Amaravati News: ఏపీలో రాజకీయాలు రూటు మార్చాయి. అసెంబ్లీ వేదికగా ఎత్తుకు పైఎత్తులు పార్టీలు వేసేవి. కానీ, ఇప్పుడు మండలి వేదికగా రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. కేవలం మండలికి మాత్రమే వైసీపీ సభ్యులు హాజరవుతున్నాయి. శాసనసభకు మాత్రం రాలేదు. దీనిపై మంత్రి లోకేష్ కీలక విషయాలు బయటపెట్టారు.
అమరావతిలో సోమవారం మీడియాతో చిట్ చాట్ చేశారు మంత్రి నారా లోకేష్. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరుపై చీకటి విషయాలు బయటపెట్టారు. మాజీ సీఎం జగన్ కేవలం ప్రమాణ స్వీకారం రోజు సభకు వచ్చారని గుర్తు చేశారు. ఆ తర్వాత సభకు రావడమే మానేశారట. వైసీపీ ఎమ్మెల్యేలు కేవలం జీతాల కోసం దొంగల్లా వచ్చి రిజిస్టర్‌లో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు.
అందుకే ఈసారి హాజరు నమోదు సభలోకి మార్చాలని సూచించినట్టు తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు సభకు రాలేదని ఆ పార్టీ నేతలు పదేపదే చెప్పడాన్ని క్లియర్ గా వివరించారు. చంద్రబాబు ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ప్రతిజ్ఞ చేసి బయటకు వెళ్లారని, అధినేత రాకపోయినా, పార్టీ ఎమ్మెల్యేలు సభలో అప్పటి అధికార వైసీపీతో పోరాటం చేశారని గుర్తు చేశారు.
ఇదే సమయంలో ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న సమయంలో సభలకు పెట్టే ఖర్చు.. ఇప్పుడు సీఎం చంద్రబాబు సభకు పెట్టిన ఖర్చుల వివరాలు బయటపెట్టారు సదరు మంత్రి. అప్పట్లో జగన్ సభకు రూ.6 నుంచి 7 కోట్లు చేసేవారని, సీఎం చంద్రబాబు సభ ఖర్చు కేవలం రూ.25 లక్షలు మాత్రమేనని గుర్తు చేశారు. జగన్ ఐదేళ్లలో సభలకు, 16 నెలల్లో సీఎం చంద్రబాబు సభలకు ఏ మాత్రం పొంతన లేదన్నారు.
ALSO READ: వచ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు
జగన్ హెలికాప్టర్ ఖర్చు రూ.224 కోట్లు అయినట్టు చూపించారని, కాన్వాయ్‌లు, వాహనాల ఖర్చు కలిసి అదనంగా మరో రూ.200 కోట్లు ఉండవచ్చన్నారు. సీఎం చంద్రబాబు హెలికాప్టర్ మార్చడంతో ఆయన రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా అందులో నేరుగా వస్తున్నారని గుర్తు చేశారు. వైసీపీ మాదిరిగా ఎక్కడికక్కడ కాన్వాయ్‌లు పెట్టలేదని, ఐదేళ్లలో సీఎం చంద్రబాబు హెలికాప్టర్‌కు అయ్యే ఖర్చు రూ.100 కోట్లు దాటదన్నారు.
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ జిల్లాలకు వెళితే ఒక్కో కార్యక్రమానికి 6 నుంచి 7 కోట్లు ఖర్చు పెట్టేశారని చెప్పుకొచ్చారు మంత్రి లోకేష్. టీటీడీ పరకామణి వ్యవహారంపై నోరు విప్పారు. అక్కడ జరిగిన అవకతవకలపై సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ఈ కేసును నీరు గార్చిందన్నారు. అసలు దొంగను అరెస్ట్ చేయకుండా కేవలం 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారని విమర్శించారు. ఈ కేసులో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉందన్నారు.
పరకామణిలో చోరీపై 2023 ఏప్రిల్ 29న రాత్రి 11 గంటలకు ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యిందన్నారు. మరుసటి రోజు ఛార్జిషీట్ వేసి, నిందితుడికి 41(ఎ) నోటీసు ఇచ్చి వదిలేశారని ఆరోపించారు. చివరకు లోక్ అదాలత్‌లో ఈ వ్యవహారం బయటకు రాకుండా రాజీ చేశారన్నారు. దేవుడితో ఆటలాడడంతో వారి దోపిడీని దేవుడే బయటపెట్టారని చెప్పుకొచ్చారు.
ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని జగన్ ఎలా అంటారని ప్రశ్నించారు. అప్పటి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎవరు? ఆయన జగన్ బంధువు కాదా? అంటూ విమర్శలు గుప్పించారు. క్రైస్తవ సంప్రదాయంలో కూతురికి పెళ్లి చేసిన భూమన కరుణాకరరెడ్డిని టీటీడీ ఛైర్మన్‌గా నియమించింది ఎవరని అన్నారు. పరకామణి వ్యవహారంపై అప్పటి ఛైర్మన్లకు సంబంధం ఉందన్న విషయాన్నిచెప్పకనే చెప్పారు. సిట్ రంగంలోకి దిగితే ఈ నేతలిద్దరికీ కష్టాలు తప్పవని అంటున్నారు.