వైఎస్ జగన్ తండ్రి హయాంలోనే 164 మంది టీడీపీ కార్యకర్తలను చంపారని, అప్పుడే తాము భయపడలేదని, ఇప్పుడు జగన్ రప్పా,రప్పాకు భయపడతామా? అని కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్. రొట్టెల పండగలో పాల్గొనేందుకు నెల్లూరుకి వచ్చిన ఆయన.. కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షనేత ఇంటి గేటుకు తాళ్లు కట్టారని, చంద్రబాబుని బయటకు రాకుండా అడ్డుకున్నారని.. అలాంటి వారు ఇప్పుడు పర్యటనలు చేయనీయట్లేదంటూ తమపై నిందలు వేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తిరిగే హక్కు ఉందని, కానీ తిరగడానికి వెళ్లినవారు మనుషులను చంపుతున్నారని మండిపడ్డారు. నిబంధనలు పాటించాలని చెబితే ఎదురుదాడి చేస్తున్నారన్నారు. చిన్నసందులో వెళ్తా, మరో ముగ్గురుని చంపుతా అంటే చూస్తూ ఊరుకోబోమన్నారు లోకేష్. ప్రతిపక్షంలో ఉన్నా జగన్ రెడ్డిలో ఇంకా మార్పు రాలేదన్నారాయన.
నెల్లూరు సిటీ నియోజకవర్గ సమన్వయ సమావేశంలో పాల్గొన్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. pic.twitter.com/9FZ9hwmstE
— Telugu Desam Party (@JaiTDP) July 7, 2025
ఆ పని చేసి ఉంటే..
మాజీ సీఎం జగన్ ఎక్కడికి వెళ్లినా మనుషుల్ని చంపుకుంటూ వెళ్తున్నారని కౌంటర్ ఇచ్చారు లోకేష్. పల్నాడు జిల్లా పర్యటనలో ఒకరిని పరామర్శించడానికి వెళ్లి ముగ్గురిని చంపారన్నారు. జనసమీకరణ పేరుతో ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదన్నారు. కారు కింద కార్యకర్త పడితే కనీసం దిగి చూడలేదని, ఆ కార్యకర్తను రోడ్డున పక్కన పడేసి వెళ్లిపోయారని, అప్పుడే జగన్ కారు దిగి ఆయన్ను చూసి, ఆస్పత్రికి పంపించి ఉంటే సింగయ్య బతికేవాడని చెప్పారు లోకేష్. బాధిత కుటుంబాన్ని పరామర్శకోసం తన ఇంటికే పిలిపించిన జగన్, కనీసం వారిని కూర్చోబెట్టి మాట్లాడలేదని, గ్లాస్ మంచినీరు కూడా ఇవ్వలేదని అన్నారు. వైసీపీ తీరును ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు లోకేష్.
కార్యకర్తలకు అండగా..
తెలుగుదేశం పార్టీ గుండెచప్పుడు కార్యకర్తలేనని చెప్పారు లోకేష్. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని అన్నారు. కార్యకర్తల పోరాటాన్ని విస్మరించకూడదని చెప్పారు. గత ఎన్నికల్లో మీరు కొట్టిన దెబ్బ అదుర్స్ అని కార్యకర్తల్ని ఉత్సాహపరిచారు. తాను ఏ నియోజకవర్గానికి పర్యటనకు వచ్చినా ముందు కార్యకర్తల్నే కలుస్తానని చెప్పారు. కార్యకర్తలు లేకపోతే టీడీపీ లేదన్నారు. 164 సీట్లతో రికార్డ్ బ్రేక్ చేసి, దేశ చరిత్రలో తొలిసారిగా ఓ రాష్ట్రంలో 94శాతం సీట్లు కూటమి కైవసం చేసుకుందన్నారు. ఈ ఘన విజయానికి కారణం కార్యకర్తలేనని చెప్పారు. నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలను కలిసిన తర్వాతే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని గుర్తు చేశారాయన. కార్యకర్తల సమస్యలు తెలుసుకునేందుకే సమావేశాలు నిర్వహిస్తున్నామని, కార్యకర్తలకు సమస్యలు ఉంటే తమ నిర్ణయాలను సైతం వెనక్కి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరించాలని గుర్తు చేశారు లోకేష్.
అలక మానుకోండి..
జగన్ తో పోరాడే లోకేష్ మాత్రమే కార్యకర్తలకు తెలుసని, కానీ చంద్రబాబుతో పోరాడే లోకేష్ కూడా ఉన్నారని.. కార్యకర్తల కోసం ఆయనతో తాను గొడవ పడతానన్నారు. కానీ ఫైనల్ గా చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానన్నారు. పార్టీలో సంస్కరణల కోసం తాను పోరాడుతున్నాని చెప్పారు లోకేష్. కొన్ని నిర్ణయాలు తప్పు కావచ్చని, కానీ తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పోరాడుతున్నానన్నారు. పార్టీ ఫస్ట్, కార్యకర్తలు ఫస్ట్ అనుకుంటానని, కార్యకర్తలు అలక మానుకోవాలని చెప్పారు. మన సమస్యలు కలిసికట్టుగా కూర్చొని మనమే పరిష్కరించుకోవాలని చెప్పారు లోకేష్. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.