Anti-Smuggling Task Force : ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల అడవులకు మాత్రమే పరిమితమైన ఎర్రచందనం ఎంత విలువైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్ల విలువ చేసే ఈ వృక్ష సంపదను అక్రమార్కులు తప్పుదోవలో ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు. సహజ వృక్ష సంపదను భారీగా ధ్వంసం చేస్తూ కోట్లు కూడబెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారికి ఏపీలోని కూటమి ప్రభుత్వం చెక్ పెడుతోంది. తాజాగా ఏపీ టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి.. రాష్ట్రాలు దాటిపోయిన ఎర్రచందనం దుంగల్ని స్వాధీనం చేసుకుని, అక్రమార్కుల్ని అదుపులోకి తీసుకున్నారు.
గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్ ఇష్టారాజ్యంగా సాగిందని ఆరోపించిన కూటమి నేతలు.. తమ ప్రభుత్వంలో రెడ్ సాండిల్ స్మగ్లింగ్ ను అరికడతామని ప్రకటించారు. అందుకు తగ్గట్టే అధికారం చేపట్టిన వెంటనే.. ఆంధ్రప్రదేశ్ రెడ్ శాండిల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్(RSASTF) పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో ఎర్రచందనం ముఠాలను అరికట్టడంతో పాటు.. అక్రమంగా రవాణా అవుతున్న ఎర్రచందనాన్ని సైతం స్వాధీనం చేసుకుంటోంది. అందులో భాగంగానే ఇటీవల ఈ బృందం చేపట్టిన ఓ ఆపరేషన్ లో రాష్ట్రాలు దాటిపోయిన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఏపీ మంత్రి నారా లోకేష్, పోలీసులు, టాస్క్ ఫోర్స్ బృందాలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఏపీ నుంచి అక్రమ మార్గాల్లో గుజరాత్ రాష్ట్రానికి భారీగా ఎర్రచందనం సరఫరా అయినట్లు ఏపీ రెడ్ శాండిల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్(RSASTF) బృందం గుర్తించింది. వాటిని స్వాధీనం చేసుకుని, నిందితుల్ని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. అలా.. నిర్వహించిన ఆపరేషన్ లో ఏకంగా 5 టన్నులకు పైగా ఎర్రచందనం దొంగలను గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.5 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. కాగా.. ఈ బృందం నిర్వహించిన ఆపరేషన్ పై నారా లోకేష్ అభినందనలు తెలిపారు. గతంలో ఎర్రచందనం స్మగ్లర్లకు రాష్ట్రంలో తిరుగులేదని, వారికి ప్రభుత్వ పెద్దల అండదండలున్నాయని వ్యాఖ్యానించి నారా లోకేష్.. రాష్ట్రంలోని విలువైన వృక్ష సంపదను విచ్చలవిడిగా దోచుకునేందుకు అవకాశం కల్పించారంటూ విమర్శించారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని, చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం స్మగ్లింగ్ పై ఉక్కుమాదం మోపుతోందంటూ ట్వీట్ చేశారు.
ప్రత్యేక ఆపరేషన్ ద్వారా కోట్ల విలువ చేసే ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకోవడానికి ట్విట్టర్ ద్వారా వెల్లడించిన నారా లోకేష్.. ఏపీ ఇంటిలిజెన్స్ డిపార్ట్మెంట్, యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ బృందాలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్ర సంపదను కాపాడటంలో వీరి కృషి అమూల్యమైనదని కొనియాడారు.
ఎర్రచందనం అత్యంత విలువైన కలప. దీన్ని ఎర్ర బంగారం అని కూడా పిలుస్తుంటారు. ఈ అరుదైన ఎర్రచందనం.. ఒక్క ఆంధ్రప్రదేశ్ లో తప్పా ప్రపంచంలో మరెక్కడా దొరకదు, పెరగదు. ఏపీలోనూ చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలోనే లభిస్తుంటుంది. ఈ నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవులలో మాత్రమే ఈ ఎర్రచందనం సమృద్ధిగా లభిస్తుంటుంది. అత్యంత విలువైన ఈ కలపను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎగుమతి చేయడానికి నిషేధించింది. దీన్ని నరకడం చట్ట ప్రకారం నేరం.. అందుకే చాలా రహస్యంగా స్మగ్లింగ్ చేస్తుంటారు. విదేశాల్లో అత్యంత విలువైన కలప కావడంతో.. అక్రమంగా సరఫరా చేస్తూ కోట్లకు కోట్లు ఆర్జిస్తుంటారు.
Also Read : శ్రీవారి లడ్డూ కల్తీపై సీబీఐ సిట్ ఏం తేల్చేంది, సుప్రీంకోర్టుకు ప్రైమరీ రిపోర్టు
ఎర్రచందనాన్ని అక్రమంగా అడవుల నుంచి ఇతర దేశాలకు తరలించేందుకు లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ సమయాల్లో అడవి సిబ్బంది ఎదురైతే.. వారిపై దాడులకు సైతం అక్రమ రవాణాదారులు వెనకాడరు. అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డ ఏపీ అటవీశాఖ గోదాముల్లోని ఎర్రచందనం దుంగల విలువే రూ.లక్షల కోట్లు ఉంటుందని అంచనా. అలాంటిది.. విదేశాలకు తరలిపోయిన ఎర్రచందనం విలువ ఎంత ఉంటుందో ఎవరు లెక్కించలేరంటారు.. వీటి విలువ తెలిసిన వాళ్లు.