Nellore Crime News: ఓ తల్లి తన కొడుకుని అత్యాచారానికి ఉసిగొల్పిందని ఆరోపిస్తున్నారు ఆ విద్యార్థిని తల్లిదండ్రులు. అసలు తల్లి కూడా ఓ మహిళే కదా.. అలా ఎందుకు చేసిందంటే.. ఇది నిజం అంటున్నారు వారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే ఏపీలోని నెల్లూరు జిల్లా పాతమిట్టపాలెం గ్రామంలో..
నెల్లూరు జిల్లా పాతమిట్టపాలెం గ్రామంలో ఓ విద్యార్థినిని యువకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యార్థిని ఏకాంతంగా ఉన్న సమయంలో యువకుడు అత్యాచారానికి పాల్పడినట్లు, తమ కుమార్తె ఆ విషయాన్ని తెలుపగా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు తెలుపుతున్నారు. ఈ దారుణ ఘటనపై పోలీసులు సైతం వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
కాగా బాలిక తండ్రి మాట్లాడుతూ.. తన కుమార్తెకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకూడదన్న భావనతో తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఏడాదిగా తమ కుమార్తెను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తమకు తెలిసిందని, యువకుడి యొక్క తల్లి సహకారంతోనే ఈ అత్యాచారం జరిగినట్లు తాను భావిస్తున్నానన్నారు. ప్రభుత్వం, పోలీసులు తమకు న్యాయం చేయాలని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. అత్యాచారానికి పాల్పడిన యువకుడు, యువతి కుటుంబ సభ్యులకు దూరపు బంధువులుగా తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఇప్పటికే అత్యాచారానికి పాల్పడ్డ యువకుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. అయితే యువకుడి తల్లి పాత్ర ఉందంటూ, యువతి తండ్రి ఆరోపించడంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై యువకుడి అత్యాచార ఘటన నెల్లూరు జిల్లాలో సంచలనంగా మారింది. అలాగే ఏకంగా అత్యాచారానికి పాల్పడ్డ యువకుడి తల్లి సహకారం ఉందంటూ సదరు బాలిక తండ్రి ఆరోపించడం విశేషం కాగా, ఇంతకు ఆమె పాత్ర ఈ ఘటనలో ఉందా లేదా అన్నది పోలీసుల దర్యాప్తు అనంతరం తేలాల్సి ఉంది.