ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రజా క్షేత్రంలో ఒక్కొకరిదీ ఒక్కో స్టైల్. ఒకే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండేవారు కొందరు. ఎక్కడ అవకాశం వస్తే అక్కడికి వెళ్లి, అనువుగాని చోట కూడా గెలిచి చూపించే సత్తా ఉన్నవారు మరికొందరు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కూడా కొంతమంది తమ ప్రత్యేకత చూపుతుంటారు. అనారోగ్యంతో ఉన్నా కూడా నిత్యం ప్రజల గురించి ఆలోచిస్తుంటారు కొందరు. ఓవైపు చేతికి సెలైన్ పెట్టుకుని మరోవైపు ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకునే ఎమ్మెల్యేలను కూడా చూస్తున్నాం. ఈ కోవలో నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అతి సామాన్యుడిగా జనంలో తిరిగేందుకు ఇష్టపడుతున్నారు. సాధారణ స్కూటర్ పై నెల్లూరు రోడ్లపై ఆయన చక్కర్లు కొడుతున్నారు.
రాజకీయ నాయకులు వస్తున్నారంటే మందీ మార్బలం, అధికారుల హడావిడి.. ఆ వ్యవహారమే వేరుగా ఉంటుంది. కానీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్టైలే వేరు. కొత్తగా ఆయన స్కూటీ పర్యటన మొదలు పెట్టారు. తన నియోజకవర్గంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించేందుకు తానొక్కడే స్కూటీపై వెళ్తున్నారు. అనుచరుల్ని వెంటబెట్టుకుని వెళ్లే ప్రచార ఆర్భాటంకంటే ఇలా సింపుల్ గా వెళ్లి పనుల్ని పర్యవేక్షిస్తే కాంట్రాక్టర్లు కూడా నాణ్యతతో చేస్తారని, సడన్ విజిట్ లతో అలర్ట్ గా ఉంటారని, అందుకే ఎమ్మెల్యే ఇలా పర్యటిస్తున్నారని అంటున్నారు.
స్కూటర్ పై నియోజకవర్గంలో
హెల్మెట్ ధరించి స్కూటర్ పై నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆకస్మికంగా పర్యటించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఇటీవల 303 అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఆయా పనుల పురోగతిని తెలుసుకోడానికి ఆయన ఆకస్మిక పర్యటనకు సిద్ధమయ్యారు. హెల్మెట్ ధరించి పార్టీ సీనియర్ నేతను స్కూటీ వెనక ఎక్కించుకుని నియోజకవర్గంలో పర్యటించారు. నేరుగా స్థానిక ప్రజల వద్దకే వెళ్లి.. అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. సమస్యలుంటే తన దృష్టికి తీసుకు రావాలని, పనులు జరుగుతున్న సమయంలో ఎక్కడైనా ఇబ్బందులు వస్తే నేరుగా తనకే ఫోన్ చేయాలని సూచించారు. ప్రస్తుతం నియోజకవర్గంలో మొదలు పెట్టిన అభివృద్ధి పనుల్ని మే 20లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే పర్యటన వివరాలు తెలిసి స్థానిక నేతలు ఆయనకు స్వాగతం పలికేందుకు రాగా సున్నితంగా వారించారు. ఇకముందు కూడా ఎలాంటి సమాచారం లేకుండా ఆకస్మిక పర్యటనకు వస్తానని చెప్పారు ఎమ్మెల్యే కోటంరెడ్డి.
ఆ ఎమ్మెల్యే రూటే సెపరేటు..
గతంలో జగన్ పై అభిమానంతో వైసీపీలో చేరిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. పార్టీ ప్రారంభం నుంచి ఆయనతోనే ఉన్నారు. జగన్ కి వీరాభిమానిగా మారారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు గెలుపొందినా మంత్రి పదవి రాకపోవడంతో వైసీపీలో కాస్త అసంతృప్తికి గురయ్యారు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేయడంతో పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారన్న ఆరోపణలను కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఆ తర్వాత టీడీపీలో చేరి 2024 ఎన్నికల్లో తిరిగి నెల్లూరు రూరల్ నుంచి గెలుపొందారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. టీడీపీలో చేరిన తర్వాత కూడా ఆయన తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు. ఇటీవల ఒకేరోజు వందల సంఖ్యలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి పార్టీ అధినాయకత్వంతో శెహభాష్ అనిపించుకున్నారు.
నెల్లూరు రూరల్ లో జరుగుతున్న 303 అభివృద్ధి పనుల ఆకస్మిక పర్యటన లో భాగంగా నేడు 21వ డివిజన్ లో పర్యటించడం జరిగింది
నేరుగా స్థానిక ప్రజల ఇంటి వద్దకే వెళ్ళి వారినే అడిగి తెలుసుకోవడం జరిగింది
ఎట్టి పరిస్థితిల్లో మే 20వ తేదికి పనులు పూర్తికావాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది pic.twitter.com/n3nM3piW6y
— Kotamreddy Sridhar Reddy (@kotamreddy_NLR) March 23, 2025
నిత్యం ప్రజల్లోనే..
రాజకీయాల్లో గెలుపోటములు సహజం, అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎమ్మెల్యే కోటంరెడ్డి నిత్యం ప్రజల్లో ఉండేందుకు ఇష్టపడతారు. 2019 ఎన్నికల ముందు ఆయన తన నియోజకవర్గం మొత్తం పాదయాత్ర చేశారు. ప్రతి ఇంటికీ వెళ్లారు, వారిని పలకరించారు. ప్రత్యర్థి పార్టీ అయినా కూడా అందరి ఇళ్లకూ వెళ్లి ఆప్యాయంగా మాట్లాడతారు కోటంరెడ్డి. ఎన్నికల తర్వాత కూడా ఆయన కృతజ్ఞతగా తన నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు వెళ్లేందుకు పాదయాత్ర చేపట్టారు. ఒకరకంగా అప్పటి సీఎం జగన్ ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమానికి కోటంరెడ్డి స్ఫూర్తి అని చెప్పాలి.
వైసీపీలో తనకు గౌరవం లేదని తెలిసిన తర్వాత అధికార పార్టీ అయినా కూడా బయటకొచ్చేశారు కోటంరెడ్డి. టీడీపీలో చేరినా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆయన తన బలం నిరూపించుకున్నారు. అప్పట్లో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలలో ఇద్దరికి చంద్రబాబు టికెట్లు నిరాకరించగా, మరో ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి నియోజకవర్గం మార్చారు. ఆ బ్యాచ్ లో నియోజకవర్గం మారకుండా టీడీపీ తరపున పోటీ చేసిన ఏకైక ఎమ్మెల్యే కోటంరెడ్డి. ఇప్పుడు కూడా ఆకట్టుకునే నిర్ణయాలతో, ఆసక్తి కలిగించే కార్యక్రమాలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు కోటంరెడ్డి.