NTR district tragedy viral: ఆ యువతి మరణించినట్లు వైద్యుల నిర్ధారణ. ఇంకేముంది.. ఆమె తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. పాము కాటుకు కూతురు బలైందని వారు పడ్డ ఆవేదన అంతా ఇంతా కాదు. అయితే వైద్యుల నిర్లక్ష్యమో, లేక ఆ తల్లిదండ్రుల ఆవేదనకు దేవుడు కరుణించాడో ఏమో కానీ, ఆ యువతి పోస్టుమార్టం గది వరకు వెళ్లి వెనక్కు వచ్చింది. ఇదొక మిరాకిల్ అనుకున్నా, ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఉందని యువతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన ఏపీలో జరిగిందని సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వివరాల ప్రకారం..
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడు జయంతి గ్రామానికి చెందిన ఓ యువతి ఇంటి వద్ద ఉన్న సమయంలో సోమవారం పాము కాటుకు గురైంది. పాము కాటు గురైనట్లు సదరు యువతి, కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు హుటాహుటిన విజయవాడ గొల్లపూడి లోని ఓ వైద్యశాలకు తరలించారు. అక్కడ వైద్యులు తక్షణం చికిత్స అందజేశారు. ఆ తర్వాత యువతి ఆరోగ్య పరిస్థితి విషమించిందని, యువతి మృతి చెందినట్లు సదరు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం. దీనితో యువతి మృతి చెందినట్లు సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో వైద్యశాల వద్దకు చేరుకుని రోదించారు.
ఇక్కడే అసలు ట్విస్ట్..
యువతి మృతి చెందిందని పోస్ట్‌మార్టం నిమిత్తం వైద్యశాలకు తీసుకెళ్లాలని సదరు వైద్యశాల వైద్యులు సూచించారు. దీనితో కుటుంబ సభ్యులు చేసేదేమీ లేక యువతిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అలా తరలించిన క్రమంలో పోస్టుమార్టం గదిలోకి యువతిని తీసుకువెళ్లారు. వెంటనే యువతికి పోస్టుమార్టం చేసే ప్రక్రియ ప్రారంభిస్తుండగా.. యువతికి శ్వాస ఆడుతున్నట్లు సదరు వైద్యులు గుర్తించారు. యువతి బ్రతికే ఉందని గుర్తించిన వైద్యులు, కుటుంబ సభ్యులకు అసలు విషయాన్ని తెలిపారు. ఇక అంతే కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మొదట చికిత్స అందించిన వైద్యశాల వైద్యుల తీరుపై మండిపడ్డారు.
ఏది ఏమైనా పోస్ట్ మార్టం గదిలోకి వెళ్లిన యువతి బ్రతికినట్లు గుర్తించిన వైద్యులు, వెంటనే చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అయితే బ్రతికి ఉన్న యువతిని చనిపోయినట్లు తెలిపి పోస్టుమార్టంకు తరలించిన వైద్యశాల వైద్యులపై చర్యలు తీసుకోవాలని యువతి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారట. మరి ముందు చికిత్స అందించిన వైద్యులు ఏమంటున్నారో కానీ, ఇప్పుడు ఆ యువతి ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ రావాల్సి ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన ఏ మేరకు వాస్తవమో కూడా వెలుగులోకి రావాల్సి ఉంది.