పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం విషయంలో క్రమక్రమంగా మీడియా, సోషల్ మీడియా హడావిడి కాస్త తగ్గింది. ఆందోళనకారులు కూడా కాస్త చల్లబడ్డారు. అయితే అప్పటికే జరగాల్సిందందా జరిగిపోయింది. సోషల్ మీడియాలో ఎవరికివారు విశ్లేషకులైపోయారు. అది ప్రమాదం కాదు, హత్యేనంటూ తీర్మానించేశారు. ఆ హత్య ఎలా జరిగిందో కూడా వివరిస్తున్నట్టుగా మాట్లాడారు. ప్రవీణ్ పగడాల సీసీ టీవీ ఫుటేజీలు బయటకొచ్చేంత వరకు మీడియా, సోషల్ మీడియాలో అది ప్రమాదం కాదు, హత్యేనంటూ హోరెత్తిపోయింది. కానీ సీసీ టీవీ ఫుటేజీలు బయటపడిన తర్వాత ఈ కేసులో చిక్కుముడులు ఒక్కొక్కటే వీడుతున్నాయి. పోలీస్ విచారణపై తమకు నమ్మకం ఉందని ఎక్కువగా స్పందించవద్దని కుటుంబ సభ్యులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వరుస కేసులు నమోదవడం విశేషం.
హర్షకుమార్ పై కేసు
ప్రవీణ్ పగడాల మరణం తర్వాత సోషల్ మీడియాలో హేట్ స్పీచ్ వైరల్ గా మారింది. కొంతమంది తీవ్రంగా స్పందించారు. మతాలను మధ్యలోకి తీసుకొచ్చారు. గతంలో వార్నింగ్ లు ఇచ్చినవారే ఇప్పుడు చంపేసి ఉంటారని అనుమానించారు. సీసీ టీవీ ఫుటేజీలు బయటకొచ్చిన తర్వాత కూడా ఇది ముమ్మాటికీ హత్యనంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యల్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. అది హత్యే అయితే అందుకు మీ దగ్గరున్న ఆధారాలు చూపండి అంటూ నోటీసులిచ్చారు. హర్షకుమార్ కూడా తగ్గేది లేదన్నారు. అసలు అది హత్య కాదంటూ మీ దగ్గర ఉన్న ఆధారేంటో చూపెట్టాలన్నారు. తాను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా వివరాలు రాబడతానని చెబుతున్నారు.
వారిపై పోలీసుల ఫోకస్
హర్షకుమార్ సంగతి పక్కనపెడితే.. క్రిస్టియన్ సామాజిక వర్గం నుంచి కూడా కొంతమంది పాస్టర్లు, ఇతర సంఘాల నేతలు ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన మృతి విషయంలో ఏపీ పోలీసులు నిజాలు దాచిపెడుతున్నారని కూడా ఆరోపించారు. సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేశారు. ఈ ఆరోపణలన్నిటినీ పోలీసులు నిశితంగా గమనించారు. అసత్య ప్రచారం చేయొద్దని, మత విద్వేషాలు రెచ్చగొట్టొద్దని గతంలోనే పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయినా కూడా కొంతమంది మరింత దూకుడుగా వ్యవహరించారు. అప్పటికప్పుడు పోలీసులు సంయమనం పాటించారు. ప్రవీణ్ పగడాల మృతిపై ఆందోళనలు కాస్త సద్దుమణిగిన తర్వాత ఆరోపణలు చేసిన వారిపై దృష్టి పెట్టారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడిన వారిపై కూడా వారు ఫోకస్ పెంచారు. వారందరికీ ఇప్పుడు నోటీసులిస్తున్నారు. ఆయన మృతి విషయంలో ఏమైనా కొత్త విషయాలు తెలిస్తే తమకు సమాచారం అందించాలంటున్నారు. అదే సమయంలో మరింత దూకుడుగా వ్యవహరించి, తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు కేసులు పెట్టారు.
ఇద్దరిపై కేసులు
ప్రవీణ్ మరణంపై సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు చేస్తూ, ప్రజల్ని రెచ్చగొడుతున్నారనే ఆరోపణలపై తాజాగా ఇద్దరిపై కేసులు పెట్టారు పోలీసులు. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన పాస్టర్ అజయ్ పై తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు. వైసీపీ క్రైస్తవ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు జాన్ బెన్నిలింగంపై కూడా కేసు నమోదైంది.