Pattabhi : టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు గన్నవరం సబ్‌జైలుకు తరలించారు. అంతుకుముందు పోలీసులు పట్టాభిని గన్నవరం కోర్టులో హాజరుపర్చారు. ఆయనకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. శాంతిభద్రతల దృష్ట్యా వేరే జైలుకు తరలించాలని పోలీసులు కోరారు. అయితే పోలీసుల అభ్యర్థనను తిరస్కరించింది. పట్టాభి సహా 14 మందికి మార్చి 7 వరకు రిమాండ్ విధించింది.
తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పట్టాభి మంగళవారం న్యాయమూర్తికి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో మంగళవారం రాత్రి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత తమ కస్టడీలోనే పోలీసులు ఉంచుకున్నారు. వైద్యపరీక్షలు పూర్తయ్యే సమయానికి కోర్టు సమయం ముగియడంతో బుధవారం ఉదయం గన్నవరం అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ లో పట్టాభిని హాజరుపరిచారు. వైద్య నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి పట్టాభిని గన్నవరం సబ్‌జైలుకు పంపాలని ఆదేశించారు.
గన్నవరం సబ్‌జైలులో ఖాళీ లేదని, సౌకర్యాలు తగినంత లేవని పోలీసులు న్యాయస్థానానికి మరోసారి తీసుకొచ్చారు. టీడీపీ నేతలను వేరే జైలుకు తరలించేందుకు అనుమతి ఇవ్వాలని మరో అభ్యర్థనను కోర్టు ముందుపెట్టారు. పోలీసుల తాజా అభ్యర్థనపై న్యాయమూర్తి విచారించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.