Pawan effect In Maharastra : మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయంతో కూటమి పార్టీ నేతలు సంతోషంలో మునిగిపోయారు. ఇప్పటికే వెలువడిన ఫలితాల్లో అద్భుత ఫలితాలతో అధికార పీఠాన్ని అందుకోవడం ఖరారైంది. ఈ తరుణంలోనే జనసైనికులు సైతం పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే.. మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. దాంతో.. పవన్ ఎంటర్ అయితే.. విన్నింగ్ మారిపోతుంది అంటూ పంచ్ డైలాగులు పేర్చుతూ.. సంబరపడిపోతున్నారు.
తెలంగాణాతో సుదీర్ఘ సరిహద్దు పంచుకునే మహారాష్ట్రలో తెలుగు వారి ప్రభావం ఎక్కువగానే ఉంటాయి. బోర్డర్ నియోజకవర్గాల్లో తెలుగు ప్రజలు.. అక్కడి విజయాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ఈ కారణంగానే.. పవన్ సాయాన్ని కోరారు.. కూటమి పార్టీలు. దాంతో.. రంగంలోకి దిగిన పవన్.. మహారాష్ట్రలో విస్తృతంగా ప్రచారం చేశారు. బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించి.. ఓట్లు అభ్యర్థించారు.
అక్కడ పవన్ ప్రసంగాలకు సైతం మంచి స్పందన వచ్చింది. అప్పటి ఎఫెక్ట్.. ఇప్పటి ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్నిచోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో.. అంతా పవన్ మ్యానియా అంటూ సంబరపడిపోతున్నారు.. డిప్యూటి సీఎం అభిమానులు.
కూటమి తరఫున పుణే, బల్లార్ పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్‌లలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ స్థానాల్లో కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థులైన.. కాంబ్లె సునీల్ ధ్యాన్ దేవ్(పుణే), ముంగంటివార్ సుధీర్ సచ్చిదానంద్ (బల్లార్ పూర్), దేశ్‌ముఖ్ సుభాష్ సురేశ్‌చంద్ర (షోలాపూర్), అంతపుర్కర్ జితేష్ రాయ్ సాహెబ్(డెత్లూర్), రమేష్ కాశీరామ్ కరద్ (లాతూర్) లు విజయం సాధించారు. దీంతో పవన్ కల్యాణ్ ప్రచారం వల్ల మేలు జరిగిందని బీజేపీ కూటమి అభ్యర్థులు మాట్లాడుకుంటున్నారు.
రాజకీయాలు అందరూ చేస్తారు.. కానీ సరైన వ్యూహాలు కొందరే అనుసరిస్తారు. అలాంటి వ్యూహాన్నే తన వెంట తీసుకెళ్లిన పవన్ కళ్యాణ్.. మహారాష్ట్రలో ఆకట్టుకునే ప్రసంగాలు చేశారు. మహారాష్ట్ర ఆరాధ్య దైవమైన శివాజీ మహారాజ్ ను గుర్తు చేస్తూ.. ఆయన చేసిన ప్రసంగాలు అక్కడి ప్రజల్ని ఆకట్టుకున్నాయి. సందర్భాన్ని బట్టి మరాఠాలోనూ ప్రసంగించిన పవన్.. తన అభిమానుల్ని కూటమి పార్టీ అభ్యర్థుల వైపు మళ్లించడంలో సక్సెస్ సాధించారు.
Also Read : షిండే, అజిత్ పవార్‌ల వెంటే మహా ప్రజలు.. పార్టీలను చీల్చినా ఎందుకింత క్రేజ్
మహారాష్ట్ర నేల మీద నుంచి హిందూ ధర్మ రక్షణ గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్.. అక్కడి యువతలో ఆలోచనను రేకెత్తించారు. ప్రజల మధ్య మతం చిచ్చు పెట్టేందుకు వచ్చిన అసదుద్దీన్ ఓవైసీ వంటి వాళ్లకు వార్నింగ్ ఇచ్చి.. తనదైన శైలి రాజకీయాలు చేశారు. తన బహిరంగ సభలు, సమావేశాల్లో ఎక్కువగా హిందుత్వ పరిరక్షణ గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఓట్లను ఆకర్షించడంలోనూ ముందువరుసలో నిలుచున్నారు. బాలా సాహెబ్ ఠాక్రే ప్రసంగాలను, ఆయన ఆలోచనలను ప్రస్తావిస్తూ మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ప్రత్యర్థి ఉద్దవ్ ఠాక్రే వర్గం అభ్యర్థుల ఓట్లు చీల్చడంలో మంచి వ్యూహాన్ని అనుసరించారు. ఇలా.. అనేక రకాలుగా మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి విజయానికి జనసేనాని పవన్ కళ్యాణ్ మంచి తోడ్పాటు అందించారు.