Narsapur police : కొన్ని సంఘటనలను తెలుసుకుంటేనే వ్యవస్థలోని లోపాలు అర్థం అవుతాయి. వ్యవస్థల పనితీరు సహా వాటిలోని బలహీనతలు సైతం బయటపడతాయి. అలాంటి ఘటనే.. ఒకటి మెదక్ జిల్లాలో వెలుగుచూసింది. మన సమాజంలో.. శాంతి భద్రతలు పరిరక్షణనకు ఏర్పాటు చేసుకున్న పోలీసు వ్యవస్థ ఎంత ఘోరంగా పనిచేస్తుందో కళ్లకు కట్టినట్లు చూపించింది. బలవంతులకు, బలహీనల పట్ల ఎలాంటి వ్యత్యాసాన్ని చూపుతుందో, ఎలా అనాలోచితంగా.. పని చేసుకుంటూ కాలాన్ని నెట్టుకొస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం గురించి తెలుసుకున్న వాళ్లంతా.. పోలీసుల తీరుపై విమర్శలు చేస్తున్నారు. ఇదేం పనంటూ ఆగ్రహిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది అంటే..
మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు నెలల క్రితం ఓ భూ వివాదం జరిగింది. భూతగాదాలు సివిల్ కేసులు కావడంతో, అక్కడ జరిగిన వివాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక్కడే పోలీసుల నిర్వాకం బయటపడింది. ఎలా వారి విచారణ జరుగుతోంది. ఎంత నిక్కచ్చిగా పనిచేస్తున్నారు. కేసుల నమోదు, విచారణలో ఎంత పారదర్శకంగా ఉంటున్నారో అర్థం అవుతుంది. ఈ కేసులో నలుగురిని నిందితులుగా ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అందులో పాల్గొని.. దౌర్జన్యం చేశారంటూ కొంత మందిపై ఎఫ్ఐఆర్ సైతం నమోదు చేశారు. కానీ.. ముందూ, వెనుక ఆలోచించకుండా చేసిన ఈ పనితో.. పోలీసు వ్యవస్థపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. వారి ఎఫ్ఐఆర్ లోని నలుగురు నిందితుల్లో ఓ వ్యక్తి అయిన విఠల్ చనిపోయి ఇప్పటికే.. ఆరేళ్ల అయ్యింది.
అవును.. ఎప్పుడో ఆరేళ్ల క్రితం చనిపోయిన విఠల్ అనే వ్యక్తి వచ్చి 2 నెలల క్రితం జరిగిన భూవివాదంలో పాల్గొన్నాడంట. కాబట్టి.. అతను విచారణకు రావాలంటూ మెదక్ జిల్లా నర్సాపూర్ పోలీసులు తేల్చేశారు. పోలీసుల తీరుతో అవాక్కైన అతని కుమారుడు.. ఇదేం పనంటూ ప్రశ్నిస్తున్నాడు. పెదలు, చదువురాని వారి పట్ల పోలీసులు ఇలానే వ్యవహరిస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. అవతలి వ్యక్తులతో చేతులు కలిపి.. ఇలా చనిపోయిన వ్యక్తుల పేరుపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఇక్కడే కాదు.. గతంలోనూ హైదరాబాద్ లో ఇలాంటి ఓ సంఘటనే జరిగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ విలువైన భూమి కబ్జాకు ప్రయత్నిస్తున్నారంటూ.. ఓ రియల్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. తండ్రి, కొడుకుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. ఎఫ్ఐఆర్ లో నమోదు చేసిన తన తండ్రి మరణించి అప్పటికే.. చాన్నాళ్లు అయ్యిందని తెలిపిన కొడుకు, డెత్ సర్టిఫికేట్ సైతం బయటపెట్టాడు. దాంతో.. బిత్తరపోవడం పోలీసుల వంతైంది. ఇప్పుడు సైతం.. ఇదే తరహా కేసు రావడంతో.. పోలీసు శాఖ తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.