ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రలో పర్యటించారు. ఆయన కాన్వాయ్ కోసం విశాఖలోని పెందుర్తిలో ప్రజల్ని రోడ్లపై ఆపివేశారని ఆ కారణంగా కొంతమంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలకు ఆలస్యమయ్యారని, వారికి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. వైసీపీ అనుకూల మీడియా కూడా దీనిపై రాద్ధాంతం మొదలు పెట్టింది. కొంతమంది పిల్లలు, పేరెంట్స్ తో మాట్లాడించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ వల్లే తమ పిల్లలు పరీక్షలకు ఆలస్యంగా వెళ్లారని, మరో రోజు వారితో పరీక్షలు రాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నట్టుగా ఆ వీడియోల్లో ఉంది. అయితే ఇందులో ఎంతమాత్రం నిజం లేదని అంటున్నారు జనసేన నేతలు. ఉద్దేశపూర్వకంగానే పవన్ పై కొందరు విమర్శలు చేస్తున్నారని, పవన్ కారణంగా ఎవరూ పరీక్షకు ఆలస్యం కాలేదని వారు వివరణ ఇస్తున్నారు.
విశాఖ పోలీస్ వివరణ..
మరోవైపు విశాఖ పోలీసులు కూడా ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఉదయం 9 గంటలకు జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్ల వద్ద అభ్యర్థులు 7 గంటలకల్లా చేరుకోవాలని అడ్మిట్ కార్డుల్లో స్పష్టగా ఉంది. ఉదయం 8.30 గంటల తర్వాత ఎవరినీ లోపలికి అనుమతించరు. అంటే పరీక్షకు హాజరు కావాలనుకునేవారు ఉదయం 7 గంటలకే ఆయా కేంద్రాల వద్దకు రావాల్సి ఉంటుంది. ఇక ఉదయం 8.41 గంటలకు పెందుర్తి జంక్షన్ నుంచి డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ వెళ్లేందుకు షెడ్యూల్ ఉంది. అంటే ఉదయం 7 గంటలకు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోడానికి 8.41 గంటలకు వెళ్లే డిప్యూటీసీఎం కాన్వాయ్ కి సంబంధం లేదని అంటున్నారు పోలీసులు.
ఈరోజు ఉదయం గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి కాన్వాయ్ కారణంగా పరీక్షకు ఆలస్యం అయ్యారనే వార్త అవాస్తవం. పరీక్షా కేంద్రానికి రిపోర్టింగ్ టైం 7:00 గంటలకు అయితే 8:41 గంలకు ఆ మార్గంగా వెళ్లిన కాన్వాయ్ కారణమని ప్రచారం చేయడం ఖండిస్తున్నాం . విద్యార్థులు సౌకర్యార్థం ఎనిమిదిన్నర… https://t.co/ypKAWIDatc pic.twitter.com/OGVwnehCB1
— JanaSena Shatagni (@JSPShatagniTeam) April 7, 2025
ప్రతిరోజూ కొంతమంది గైర్హాజరు..
ఏప్రి 2 నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రతి రోజు మొదటి షిఫ్ట్ పరీక్షకు 7 గంటలనుంచి అభ్యర్థుల్ని సెంటర్లోకి అనుమతిస్తున్నారు. పెందుర్తి పరీక్ష కేంద్రంలో జరిగే పరీక్షకు ఏప్రిల్ 2న 81మంది గైర్హాజరు కాగా, ఏప్రిల్ 3న 65మంది, 4వతేదీన 76మంది, 5 వతేదీన 61మంది హాజరు కాలేదు. ఏప్రిల్ 7న అంటే ఈరోజు 50మంది హాజరు కాలేకపోయారు. రోజువారీ ఆబ్సెంటీస్ సంఖ్య కంటే ఈరోజు ఆ సంఖ్య తక్కువగా ఉందని, అంటే ఈరోజు పరీక్షకు హాజరు కాలేకపోయిన వారికి ఈరోజే జరిగిన సంఘటనకు సంబంధం అస్సలు లేదని అంటున్నారు పోలీసులు.
8.30 గంటల తర్వాతే ట్రాఫిక్ నియంత్రణ..
ఇక పవన్ కల్యాణ్ వెళ్తున్న గోపాలపట్నం -పెందుర్తి సర్వీస్ రోడ్ లో 8.30 గంటల తర్వాతే ట్రాఫిక్ ని నియంత్రించామని, అంటే అప్పటికే విద్యార్థులు పరీక్ష హాల్ లోకి వెళ్లాల్సిన సమయం అయిపోయిందని తెలిపారు పోలీసులు. అంటే విద్యార్థుల గైర్హాజరుకి, పవన్ కాన్వాయ్ కి ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు.
పోలీసుల వివరణను జనసేన సోషల్ మీడియా హైలైట్ చేస్తోంది. తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని, నిజానిజాలు తెలుసుకోవాలని జనసైనికులు చెబుతున్నారు. పవన్ కాన్వాయ్ రావడం వల్లే విద్యార్థులు పరీక్షకు ఆలస్యంగా వెళ్లారనే వాదనలో వాస్తవం లేదని వారు అంటున్నారు.