ఏపీలో కూటమి సంసారం పొరపొచ్చాలు లేకుండా సాగుతోంది. మధ్యలో అటు, ఇటు నాయకులు కాస్త అటు ఇటుగా మాట్లాడుతున్నా అధినేతలు మాత్రం ఒకరిపై ఒకరు ఎక్కడలేని గౌరవం, ప్రేమ, ఆప్యాయతను చూపుకుంటున్నారు, బయటకు చాటుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆయనకు చంద్రబాబుపై ఉన్న గౌరవాన్ని బయటపెట్టాయి. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను పటిష్టపరస్తున్నామని, చంద్రబాబు నాయకత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అని చెప్పారు. అంతే కాదు, ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు తామంతా సంసిద్ధులమై ఉన్నామని, ఆయన మార్గదర్శకత్వంలోనే పనిచేసుకుంటూ వెళ్తున్నామని అన్నారు. కర్నూలు జిల్లా పూడిచర్లలో పంట కుంట నిర్మాణానికి భూమిపూజ చేసే కార్యక్రమంలో పాల్గొన్న పవన్, సందర్భం లేకపోయినా అక్కడ సీఎం చంద్రబాబుని ఆకాశానికెత్తేశారు. ఏపీకి చంద్రబాబు లాంటి బలమైన, అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి ఉండబట్టే పల్లె పండుగ విజయవంతమైందని అన్నారు పవన్.
ఆమధ్య పార్టీ ఆవిర్భావ వార్షికోత్సవ సభలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. టీడీపీని నిలబెట్టింది తామేనంటూ చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబు వ్యూహానిదే అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రస్తుతం దేశం మొత్తం ఏపీవైపు చూస్తోందని అన్నారు పవన్ కల్యాణ్. కష్టకాలంలో కూటమిని ప్రజలు గెలిపించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సమర్థుడు, అనుభవజ్ఞుడు, స్ఫూర్తి ప్రదాత అంటూ కొనియాడారు.
రాష్ట్ర వ్యాప్తంగా 1.55 లక్షల ఫారం పాండ్ నిర్మాణ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @PawanKalyan గారు
Live Link: https://t.co/1XorhsPu8I
— JanaSena Party (@JanaSenaParty) March 22, 2025
వచ్చేసారి కూడా ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని మళ్లీ చంద్రబాబే సీఎం కావడం గ్యారెంటీ అని గతంలో చెప్పిన పవన్ కల్యాణ్, ఇటీవల ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాల్లో చంద్రబాబు వరుసగా మూడు సార్లు హ్యాట్రిక్ సీఎం కావాలని ఆకాంక్షించారు. అంటే అవకాశం దొరికిన ప్రతిసారీ ఆయన చంద్రబాబుని ఆకాశానికెత్తేస్తున్నారు. పనిలో పనిగా కూటమి పార్టీల మధ్య ఎంత బలమైన బాండింగ్ ఉందో చెబుతున్నారు. పరోక్షంగా ప్రత్యర్థులకు ఛాన్స్ ఇచ్చేది లేదని అంటున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. కర్నూలు జిల్లా పర్యటనలో పవన్ కల్యాణ్.. ఇప్పటి వరకు తమ ప్రభుత్వ విజయాలను ఏకరువు పెట్టారు. కర్నూలు జిల్లాలో రూ.75 కోట్ల నిధులతో 117 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారాయన. జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా 98 శాతం రోడ్ల నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేశామన్నారు. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను పట్టించుకోలేదని, అధికార కాంక్షతో పంచాయతీలను పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు పవన్. కూటమి ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం ద్వారా సొంత గ్రామాల్లోనే పనులు చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.9,597 కోట్లు ఖర్చు చేశామని వివరించైారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి, ఆర్థిక స్థిరత్వం కల్పించాలనేది తమ కూటమి ప్రభుత్వం లక్ష్యం అన్నారు పవన్. గిరిజన ప్రాంతాలపై కూడా తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టిసారించిందని, 100 మందికిపైగా నివసిస్తున్న గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాని చెప్పారు పవన్. రోడ్డు సౌకర్యంతోపాటు, విద్యుత్, తాగునీరు వంటి మౌలిక వసతులకు కూడా నిధులు కేటాయించామన్నారు. నీటిని సమర్థంగా నిల్వ చేసుకోగలిగితే ఎలాంటి సమస్యలు ఉండవని, వర్షాలు రాగానే పంట కుంటలు నిండేలా ప్రణాళికలు చేపడుతున్నామని అన్నారు.