Jubleehill By Election: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. మొత్తం 150కి పైగా నామినేషన్లు దాఖలైనట్లు ప్రాథమిక సమాచారం. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగిసింది. అయితే 3 గంటల తర్వాత గేటు లోపల ఉన్న వారికే నామినేషన్ వేసేందుకు అనుమతిస్తామని ఆర్వో ప్రకటించారు. చివరి రోజు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఇతర పార్టీలతో పాటు స్వతంత్రులు, రీజనల్ రింగ్ రోడ్డు బాధిత రైతులు, ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగ సంఘాల ప్రతినిధులు నామినేషన్లు దాఖలు చేశారు. రేపటి నుంచి ఆర్వో సాయిరాం నామినేషన్లను పరిశీలించనున్నారు. అక్టోబర్ 24 వరకు నామినేషన్లను ఉపసంహరణకు గడువు ఇచ్చారు. నవంబర్ 11న ఉపఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 14న కౌంటింగ్ ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 2 సెట్ల నామినేషన్లు దాఖాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత 3 సెట్ల నామినేషన్ వేశారు. అలాగే బీఆర్ఎస్ పి. విష్ణువర్ధన్ రెడ్డితో డమ్మీ నామినేషన్ దాఖలు చేయించింది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున ఆయన సతీమణి ఇప్పటికే నామినేషన్ వేశారు.
దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గుండెపోటుతో మృతి చెందడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నిక వచ్చింది. ఉపఎన్నికలో విజయం సాధించాలని అధికార కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తుంది. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. హైదరాబాద్ లో కీలకమైన స్థానాన్ని గెలుచుకుని తమ సత్తా చూపించాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఈ విజయంతో సరిచేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది.
Also Read: దొడ్డి కొమరయ్య: తెలంగాణ ఆయుధ పోరాటపు తొలి అమర వీరుడు