Maoist Hidma : దండకారణ్యంలో నెత్తురు ఏరులై పారుతోంది. పచ్చని అడువులు ఎర్ర జెండాల రక్తంతో తడిసిపోతున్నాయి. తుపాకీ గొట్టాల గర్జనతో విప్లవం తల్లడిల్లుతోంది. వందలాదిగా మావోయిస్టులు నేలకొరుగుతున్నారు. 80 రోజుల్లోనే 120 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఈ మధ్య కాలంలో ఇదే బిగ్ నెంబర్. అయితే, అడవుల్లో భద్రతా బలగాలు ఎంత గాలిస్తున్నా.. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా మాత్రం తప్పించుకుంటూనే ఉన్నాడు. చిక్కడు, దొరకడు టైప్‌లో చుక్కలు చూపిస్తున్నాడు. అబూజ్‌మడ్‌లో ప్రస్తుతం ఫుల్ యాక్టివ్‌గా ఉన్నది హిడ్మానే. అతని కోసమే పోలీస్ వేట. ఎంతగా వెంటాడినా.. కుక్కలు, డ్రోన్లు, హెలికాప్టర్లతో గాలించినా.. ప్రతీసారీ హిడ్మా గ్రేట్ ఎస్కేప్ అవుతున్నాడు. హిడ్మా కోసం ఏకంగా 125 గ్రామాలను పూర్తిగా తమ కంట్రోల్‌లోకి తీసుకుని కూంబింగ్ చేస్తున్నాయి ఆర్మ్‌డ్ ఫోర్సెస్. ఇంతకీ హిడ్మా ఎక్కడ?
ఆపరేషన్ కగార్. సీఆర్పీఎఫ్, కోబ్రా, ప్రత్యేక బలగాలతో స్పెషల్ కూంబింగ్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా డైరెక్ట్‌గా డీల్ చేస్తున్నారు. 2026 మార్చి నాటికి దేశంలో మావోయిస్టులే లేకుండా చేస్తామని తేల్చి చెబుతున్నారు. అన్నట్టుగానే అబూజ్‌మడ్‌లో మావోలను ఏరిపారేస్తున్నారు. ఈ వారంలోనే 30 మందికి పైగా ఎన్‌కౌంటర్లో మరణించారు. ఫిబ్రవరిలో 40 మంది.. జనవరిలో 48 మంది ప్రాణాలు కోల్పోయారు. 2024లో ఛత్తీస్‌గడ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్స్‌లో ఏకంగా 235 మంది మావోయిస్టులు చనిపోయారు. ఒకప్పుడు 14 రాష్ట్రాల్రలో ఉన్న వామపక్ష తీవ్రవాదం ప్రస్తుతం ఛత్తీస్‌గడ్‌కు మాత్రమే పరిమితమైంది. కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరో టార్గెట్‌గా దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నాయి కేంద్ర బలగాలు.
హిడ్మా ఉనికిని స్పెషల్ ఫోర్సెస్ పసిగట్టాయా?
దండకారణ్యంలో భద్రతా బలగాలకు సింహస్వప్నంగా మారిన మావోయిస్టు కీలక నేత మద్వీ హిడ్మానే ఇప్పుడు మెయిన్ టార్గెట్. ఇటీవల వరుస ఎన్‌కౌంటర్ల నుంచి అతను తృటిలో తప్పించుకున్నట్టు తెలుస్తోంది. బహుషా గాయపడి కూడా ఉండొచ్చు అంటున్నారు. హిడ్మా ఉండే ప్రాంతాన్ని బలగాలు గుర్తించాయని.. ఇక ఎన్నో రోజులు తప్పించుకోలేడని చెబుతున్నారు. ఏ క్షణంలోనైనా హిడ్మాను సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ చుట్టుముట్టే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు.
హిడ్మా కోసం 125 గ్రామాల్లో సెర్చ్ ఆపరేషన్
హిడ్మా బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ఏరియాలో ఉన్నట్టు భద్రతా బలగాలకు సమాచారం ఉంది. ఆ మోస్ట్ వాంటెడ్ కోసం ఆ చుట్టుపక్కల ఉన్న 125 గ్రామాలను జల్లెడ పడుతున్నారు. థర్మల్ ఇమేజింగ్ టెక్నాలజీతో హిడ్మా ఆచూకీ గుర్తించడానికి నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన టీమ్‌ను తీసుకొచ్చి అటవీ ప్రాంతంలో గాలిస్తున్నారు. హిడ్మా ఉనికిని దాదాపు గుర్తించినట్టేనని తెలుస్తోంది. హిడ్మా నేలకొరిగితే.. మావోయిస్టు ఉద్యమానికి కోలుకోలేని ఎదురు దెబ్బే అంటున్నారు.
హిడ్మాతో మావోయిజంకు ఎండ్ కార్డ్?
మళ్లీ మావోయిజం పుంజుకోవడం అంత ఈజీ కాకపోవచ్చు. తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని భావించే రోజులు కావు ఇవి. కుటుంబాన్ని, సమాజాన్ని వదిలేసి.. తుపాకీ రాజ్యం కోసం ఎర్రజెండా పట్టుకుని అడవుల్లో తిరిగే ఆలోచన చేసే యువతరం ఇప్పుడు లేనే లేదు. పెత్తందారులు, దొరలు దాదాపు కనుమరుగయ్యారు. ఇప్పుడంతా హైటెక్ ప్రపంచం. ఫోన్‌తోనే సహవాసం. ఇన్నేళ్లూ అతికష్టం మీద మావోయిజాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు కానీ.. హిడ్మా లాంటి లీడర్ హతమైతే.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టే వచ్చే ఏడాది మార్చి కల్లా మావోయిస్టులు మటాష్.