Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టాగ్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో గత ప్రభుత్వంలో విశాఖ ఓడరేవులో పట్టుబడిన కొకైన్ షిప్ మెంట్ గురించి ప్రస్తావించారు. దీంతో ఏపీలో మరో దుమారం రేగే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. పవన్ కల్యాణ్ తన పోస్టులో…రాష్ట్రంలో డ్రగ్స్ పెనుముప్పుగా మారిందని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి గతంలో జరిగిన అవినీతి, నేరపాలన వారసత్వ సమస్యగా వచ్చిపడిందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, గంజాయి సాగు, సంబంధిత నేర కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.
Also read: ఈటెల చుట్టూ రాజకీయాలు.. బీఆర్ఎస్‌కు టచ్‌లో, అదెలా?
గతంలో విశాఖపట్నం ఓడరేవులో కొకైన్ షిప్ మెంట్ స్వాధీనం చేసుకోవడం, దేశంలోని ఇతర చోట్ల పట్టుబడిన డ్రగ్స్ కు విజయవాడలోని ఓ వ్యాపార సంస్థతో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఈ వ్యవహారం అంతా గత పాలనలో డ్రగ్స్ మాఫియా బాగా అభివృద్ధి చెందిందని చూపిస్తోందని పేర్కొన్నారు. నేరగాళ్లను కట్టడి చేసేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం అని చెప్పారు. జగన్ రెడ్డి 11 రూపంలో ఉన్న కొద్దిపాటి ప్రతిపక్షం సభకు గైర్హాజరు కావడంతో, ఆ లోటును ఎవరైనా భర్తీ చేయాలని అందుకే ప్రభుత్వం, ప్రతిపక్ష పాత్ర జనసేన పోశిస్తుందని అన్నారు.
విశాఖపట్నం షిప్‌మెంట్ కేసును సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐకి అప్పగించాలని పవన్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టులు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వ్యవహారంలో చాలా మంది జైలుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు విశాఖ కంటైనర్ వ్యవహారంపై దర్యాప్తు మొదలు పెడితే రాష్ట్రంలో మరో రాజకీయ దుమారం రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. డ్రగ్స్ కు సంబంధం ఉన్న ఆ విజయవాడ వ్యాపార సంస్థ ఏది? అందులో పెద్ద తలకాయలు ఎవరెవరు ఉన్నారనేది బయటపడనుంది.