Deputy CM Pawan Commnets: తిరుపతి వారాహి బహిరంగ సభ సాక్షిగా మరోమారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. సనాతన ధర్మ పరిరక్షణకై 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తిరుమలకు వెళ్లి దీక్షను విరమించిన విషయం తెలిసిందే. అయితే వారాహి డిక్లరేషన్ ప్రకటించేందుకు తిరుపతిలో వారాహి బహిరంగ సభను గురువారం నిర్వహించారు.
ఈ బహిరంగ సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో గెలవగానే.. అభివృద్ధిపై దృష్టి సారించినట్లు తెలిపారు. అయితే పగ ప్రతీకార రాజకీయాలు ఉండవని గెలిచిన రోజే తాము చెప్పామని.. తనను దశాబ్దానికి పైగా వైసీపీకి చెందిన నేతలు వ్యక్తిగతంగా తిట్టి, అవమానించారన్నారు. అయినా తాను ఎవరిని నిందించలేదని, ఇప్పుడు కలియుగ వైకుంఠం తిరుమల అపవిత్రతకు ప్రయత్నిస్తే మాట్లాడకుండా ఎలా ఉంటామంటూ ప్రశ్నించారు.
అన్ని రాజకీయాల కోసమే చేస్తామన్న ఆలోచన వైసీపీ నేతలు విడనాడాలని.. తన జీవితంలో ఇలాంటి రోజు రాకూడదని తాను కోరుకున్నట్లు తెలిపారు. ఈనాటి పరిస్థితికి వైసీపీ నేతల కారణమని.. కల్తీ ప్రసాదాలు పెట్టి.. వెంకన్నకు అపచారం చేశారని వైసీపీపై ఘాటు విమర్శలు చేశారు. సనాతన ధర్మానికి అపచారం చేస్తూనే వైసీపీ పాలన సాగిందని.. భగవంతుడు ఘోర ఓటమిని రుచి చూపించి 11 సీట్లు ఇచ్చినా కూడా వైసిపి నేతల్లో మార్పు రాలేదన్నారు.
తాను ఉప ముఖ్యమంత్రిగా.. జనసేన అధ్యక్షుడిగా ఇక్కడికి రాలేదని.. సనాతన ధర్మ విరోధులతో గొడవ పెట్టుకునేందుకే వచ్చానంటూ వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం అంటే.. హిందుత్వాన్ని పాటిస్తూ.. ఇతర మతాలను గౌరవించడమేనన్నారు. హైందవ ధర్మాన్ని కాపాడేందుకు ముందుకు వచ్చినట్లు.. 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేపడితే వైసిపి అపహస్యం చేసిందన్నారు.
నా కూతురితో డిక్లరేషన్ ఇప్పించా..
తన చిన్న కూతురు తిరుమల దర్శనానికి రాగా.. స్వయంగా డిక్లరేషన్ ఇప్పించినట్లు పవన్ అన్నారు. ఈ మాట సభలో అనగానే ఒక్కసారిగా జై జనసేన నినాదం మారు మ్రోగింది. తిరుమల పవిత్రతను కాపాడేందుకు.. తానెప్పుడూ వెనుకడుగు వేయనని, అందుకే డిక్లరేషన్ పై తన కూతురు మైనర్ కావడంతో తండ్రిగా సంతకం చేశానన్నారు. ఈ విషయాన్ని కూడా రాజకీయం చేయాలని వైసీపీ చూసిందన్నారు.
స్టాలిన్ పేరెత్తకుండా.. కామెంట్స్ చేసిన పవన్..
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పేరెత్తకుండా.. పవన్ తన ప్రసంగంలో స్టాలిన్ కి చురకలంటించారు. ఈ మధ్య ఒక యువ నాయకుడు సనాతన ధర్మం వైరస్ లాంటిది, దానిని అరికట్టాలని మాట్లాడుతున్నారన్నారు. ఇదే మాట ఇతర మతాలపై మాట్లాడి ఉంటే ఈపాటికి దేశం తగలపడి పోయి ఉండేదని, కానీ మనం మాత్రం మౌనంగా ఉండాలా అంటూ పవన్ అన్నారు. దీనికి ప్రతిస్పందనగా.. జనసైనికులు, ప్రజలు గట్టిగా పోరాడుదాం అంటూ సమాధానం ఇచ్చారు.
ఇదే వారాహి డిక్లరేషన్..
హిందూ ధర్మానికి అన్యాయం, అవమానం జరుగుతుంటే నన్ను మాట్లాడవద్దని ఎలా అంటారన్నారు. సూడో సెక్యులరిజం ముసుగులో మాట్లాడే మేధావులకు చెబుతున్నా, నేను నిజమైన సనాతనవాదిని, నేను సనాతన హిందువును, నేను అన్ని మతాలను గౌరవిస్తాను, హిందూ మతాన్ని పాటిస్తానంటూ పవన్ అన్నారు. తిరుపతి వారాహి సభలో చివరగా.. పవన్ వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. తాను తిరుపతి స్వామి వారి సన్నిధి నుండి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పిలుపునిస్తున్నట్లు, దేశమంతా ఒకటే గళం వినిపించాలి, జాతి, మత, భేదం లేకుండా మాట్లాడాలి అంటూ ఇదే డిక్లరేషన్ అన్నారు.