సజ్జల చుట్టూ అడవి ఉచ్చు
కుటుంబ సభ్యులందరికీ భూములు
బినామీల పేరుతో సీకే దిన్నె
సమగ్ర విచారణకు ఆదేశించిన డిప్యూటీ సీఎం
పట్టాభూముల పేరుతో అటవీ భూముల ఆక్రమణ
వైసీపీలో నెంబర్ 2 గా వ్యవహరించిన సజ్జల
సర్వేనంబర్ 1629లో దాదాపు 40 ఎకరాలు కబ్జా
రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో దర్జాగా గెస్ట్ హౌస్
సహకరించిన డీఎఫ్ఓ
ఏ ఒక్కరినీ వదలొద్దంటున్న పవన్ కళ్యాణ్
Sajjala Ramakrishna Reddy: మొన్న సరస్వతి భూములు, నేడు సజ్జల భూములు రెండూ అటవీ ప్రాంతానికి చెందిన భూములే కబ్జాలకు గురయ్యాయి. అటవీ సంపద, భూముల ఆక్రమణదారులపై పవన్ కళ్యాణ్ ఉక్కుపాదం మోపుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా సీకే దిన్నె పరిధిలోని సుగాలిబిచికి ప్రాంతంలో దాదాపు 200 ఎకరాలలో సజ్జల సామ్రాజ్యాన్ని ఏర్పాటుచేసుకున్నారు. వైఎస్ఆర్ సీపీలో నెంబర్ 2 గా వ్యవహరించి అన్నీ తానై సర్వాంతర్యామిగా మారారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏం చేసినా అడిగేవారే లేరన్నట్లుగా ఉండేది సజ్జల వ్యవహార శైలి. కుటుంబ సభ్యులందరికీ అక్కడ బినామీ పేరుతో వందల ఎకరాలు కొనుగోలు చేశారు అదీ అత్యంత చౌక ధరలలో. డీకేటీ భూములుగా చెప్పబడే వీటిలో వందల ఎకరాలు అటవీ భూములు కూడా ఉండటం గమనార్హం.
కుటుంబ సభ్యుల కబ్జా
వీటినైతే ఏకంగా కబ్జానే చేశారు సజ్జల ఫ్యామిలీ మెంబర్స్ . పైగా అది పక్కా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతం. అందులో అనుమతులు లేకుండానే సజ్జల ఓ జల్సాగా ఓ గెస్ట్ హౌస్ కూడా కట్టుకున్నారు. అయితే ఎక్కడా తన పేరు లేకుండా బినామీ పేర్లతో జాగ్రత్త పడ్డారు సజ్జల. అయితే తాజాగా ఆక్రమణలకు గురైన అటవీ ప్రాంతంపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టారు. తాజాగా బినామీలను కదిలిస్తే సజ్జల పేరు బయటపెట్టారు. దీనితో పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. సజ్జల రామకృష్ణా రెడ్డి మొదటినుంచి వివాదాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు.
తన చేతికి మట్టి అంటకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారని సన్నిహితులే చెబుతున్నారు. డిప్యూటీ సీఎం ఈ వ్యవహారంపై చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే అటవీ శాఖ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. కబ్జాకు గురైన అటవీ ప్రాంతం ఎంత? దీనిని ఆక్రమించుకున్నవారు ఎవరు? వారి వెనకున్న బినామీలు ఎవరు అని అధికారులు వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. అలాగే ఇప్పటిదాకా అక్కడి వన్యప్రాణులకు ఎంతమేరకు నష్టం కలిగిందో కూడా విచారణ చేపట్టారు అధికారులు.
రికార్డులను అనుకూలంగా మార్చుకుని
దాదాపు నివేదికలో ఎక్కువగా సజ్జల పేరే బయటకు వస్తోంది. పూర్తి ఆధారాలతో నివేదికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. అయితే సజ్జల తెలివిగా బినామీలు ఎవరో తనకు తెలియదని బుకాయించవచ్చు. ఇప్పటికే రికార్డులన్నీ తమకు అనుకూలంగా మార్చుకుని ఉండవచ్చు. అయితే బినామీలపై ఉచ్చు బిగిస్తే తప్పకుండా సజ్జల పేరు బయటకు రాబట్టవచ్చని అధికారులు ఆలోచిస్తున్నారు.
Also Read: చంద్రబాబు సర్వే.. ఎమ్మెల్యేలకు టెన్షన్
ఇప్పటికీ కడప జిల్లాలో కొందరు ప్రభుత్వ అధికారులు వైసీపీకి వంతపాడేవారు లేకపోలేదు. అందుకే పవన్ రాష్ట్ర స్థాయి అధికారులతో విచారణ చేయిస్తున్నారని సమాచారం. వారిచ్చే నివేదికల ఆధారంగా సజ్జలపై కేసు నమోదు చేయవచ్చనే ఆలోచనతో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే కడప జిల్లా కలెక్టర్ కు పవన్ కళ్యాణ్ అటవీ భూముల కబ్జాలపై సమగ్ర నివేదికలు ఇవ్వాల్సిందిగా కోరారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది. నివేదికలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు అధికారులు.
40 ఎకరాల అటవీ భూమి
సుగాలిబిడికిలోని సర్వేనంబర్ 1629లో దాదాపు 40 ఎకరాల వరకు అటవీ భూములు కబ్జాచేశారనే ఫిర్యాదులు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో కడప డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ గా పనిచేసిన అధికారి నాటి ప్రభుత్వ నేతలు చెప్పినట్లుగా వారి చేతిలో తోలుబొమ్మలా వ్యవహరించారని టాక్. ప్రభుత్వ పట్టా భూములకు కొంత భాగం అటవీ భూములను కూడా కలిపేసి వాటిని చట్టబద్దంగా రికార్డులలో చూపారని అంటున్నారు.
అయితే సజ్జలకు చెందిన 200 ఎకరాల భూముల చుట్టూ పెద్ద ఇనపకంచెను ఏర్పాటు చేశారు. ఎవరినీ లోపలికి రానీయకుండా పకడ్బందీగా సెక్యూరిటీని కూడా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధాన గేటుకు ఎదురుకుండా ఉండే భూములు కూడా ఎవరెవరి పేర్లో ఉన్నాయి. అవన్నీ సజ్జల కు చెందిన బినామీలవే అంటున్నారు చుట్టు పక్కల ప్రాంతాల వారు. వాటికి పట్టా భూములుగా పేదలకు అందించారు అప్పట్లో. మెల్లిగా పట్టా భూములలో అటవీ భూములను కూడా కలిపేసుకున్నారు.
పోలీసు బలగాలతో సర్వే
అటవీ భూముల కబ్జా వ్యవహారంలో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు దర్యాప్తు వేగం పెంచారు. గత మూడు రోజులుగా పోలీసు బలగాలతో వెళ్లి దగ్గరుండి సర్వే చేయిస్తున్నారు. అయితే స్థానిక మీడియా సిబ్బంది కవర్ చేయడానికి వెళితే సజ్జల అనుచరులు ఆయన ఎస్టేట్ లోనికి రానీయకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. పెద్ద గేట్లు వేసి లోనికి ఎవరినీ రానీయకుండా అడ్డుకుంటున్నారు. కొంతమంది పట్టా భూములను కూడా సజ్జల ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే బాధితులకు భరోసా ఇస్తున్నారు. ఆక్రమిత భూములపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు సరైన న్యాయం చేస్తామని అంటున్నారు. కాగా పవన్ కళ్యాణ్ అటవీ భూములను ఆక్రమించిన వారిపై చట్టప్రకారమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.