Champions Trophy 2025: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యంత పేలవ ప్రదర్శన కనబరుస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ.. సిడ్నీ వేదికగా జరుగుతున్న ఐదవ టెస్ట్ లో స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ చివరి మ్యాచ్ కి భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో శుభమన్ గిల్, ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ద్ కృష్ణ జట్టులోకి వచ్చారు. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకుంటున్నాడని స్టాండ్ – ఇన్ కెప్టెన్ జస్ ప్రీత్ బూమ్రా తెలిపాడు.
Also Read: IND vs AUS Test: బెడిసికొట్టిన గంభీర వ్యూహం.. టీమిండియా ఆలౌట్.. స్కోర్ ఎంతంటే ?
విశ్రాంతి పేరుతో తనంతట తానే జట్టు నుంచి తప్పుకున్నాడు రోహిత్ శర్మ. అయితే ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఐదు ఇన్నింగ్స్ లలో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ మొత్తం కలిపి 31 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఎక్కువ సార్లు సింగిల్ డిజిట్ పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో రోహిత్ పై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈ సిరీస్ అనంతరం రోహిత్ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా..? లేక కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతాడా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
దీనికి కాలమే సమాధానం చెబుతుంది. అయితే ఇదే సందర్భంలో మరో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. టెస్టులకు రిటైర్మెంట్, లేక కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత రోహిత్ శర్మ.. వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోబోతున్నాడనే వార్తలు వెలువడుతున్నాయి. టి-20 వరల్డ్ కప్ 2024 తర్వాత రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్ లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అప్పటినుండి టెస్టులు, వన్డేలకు సారధిగా వ్యవహరిస్తున్నాడు.
ఇప్పుడు టెస్టులు మాత్రమే కాకుండా వన్డేల నుంచి కూడా రోహిత్ ని తప్పించి అతడిని ఏకాకిని చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2024లో భారత జట్టు ఒక్క ద్వైపాక్షిక వన్డే సిరీస్ ఆడింది. శ్రీలంక పర్యటనలో భాగంగా రోహిత్ కెప్టెన్సీలోని భారత జట్టు 3 వన్డేలు ఆడితే ఇందులో 0-2 తో సిరీస్ ని కోల్పోయింది. దీంతో దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత శ్రీలంకకు వన్డే సిరీస్ ని సమర్పించుకున్న తొలి భారత జట్టుగా నిలిచింది.
ఇది మాత్రమే కాకుండా 45 ఏళ్ల తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్ లో ఒక్క వన్డే కూడా గెలవని జట్టుగా రోహిత్ కెప్టెన్సీ లోని భారత జట్టు అపఖ్యాతి మూటగట్టుకుంది. అయితే 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు ఇంగ్లాండ్ తో మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్ ఆడబోతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ వన్డే కెప్టెన్సీ మార్పు అంశంపై దృష్టి సారించిందని సమాచారం.
Also Read: Virat – Nana Patekar: కోహ్లీ కోసం పాస్టింగ్ చేస్తున్న సీనియర్ నటుడు..!
కెప్టెన్ గా వరుసగా విఫలమవుతున్న రోహిత్ శర్మ.. ఇలాంటి మానసిక స్థితిలో జట్టును ముందుకు నడిపించలేడని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వన్డే కెప్టెన్సీ నుంచి రోహిత్ శర్మని తొలగించి.. అతడి స్థానంలో మరొకరిని ఎంపిక చేయాలని భావిస్తుందట. అయితే కెప్టెన్సీ రేసులో ప్రధానంగా రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా పేర్లు ఉన్నట్టు సమాచారం. బీసీసీఐ ఎక్కువగా పాండ్యా వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.