* ప్రసంగంలో ఆవేశం ఉండాలి, కానీ దాన్ని సరైన వేదికపైనే చూపించాలి..
* వివిధ అంశాలపై అనర్గళంగా మాట్లాడే సత్తా ఉండాలి, కానీ దానికి కూడా సరైన టైమ్ చూసుకోవాలి.
* వివిధ భాషల్లో పాండిత్యం ఉండాలి, దాన్ని అవసరమైనప్పుడే ఉపయోగించాలి.
ఇవన్నీ అందరికీ తెలిసినవే. ముఖ్యంగా రాజకీయ నాయకులకు తెలియని విషయాలు అసలే కావు. కానీ అనుకోకుండా, అవసరం లేకపోయినా కొన్నిసార్లు వారి మాటలు సంచలనంగా మారిపోతుంటాయి. తాజాగా పవన్ ప్రసంగం కూడా ఇలాగే సంచలనాలకు వేదికగా మారింది. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం జరిగి రోజులు గడుస్తున్నా, ఆ వేదికపై పవన్ చేసిన ప్రసంగం ఇంకా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంది. ముఖ్యంగా జనసేన వ్యతిరేక సోషల్ మీడియా అకౌంట్ల నుంచి జరుగుతున్న ట్రోలింగ్ అంతా ఇంతా కాదు. పవన్ కి ఈ ట్రోలింగ్ కొత్త కాకపోయినా ఆయన దీన్ని ఎదుర్కోవడంపై మరికాస్త దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చిందని మాత్రం స్పష్టమవుతోంది.
జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన జయకేతనం సభలో పవన్ ప్రసంగం ఆద్యంతం ఆవేశంగా సాగింది. ముఖ్యంగా జనసైనికులకు, పవన్ వీరాభిమానులకు ఆ ప్రసంగం అమితంగా నచ్చింది. కానీ ఇక్కడ నచ్చాల్సింది కేవలం వారికి మాత్రమే కాదు. ఆ మాటకొస్తే పవన్ ఇప్పుడు కేవలం జనసేనాని మాత్రమే కాదు. జరిగింది జనసేన పార్టీ ఆవిర్భావ సభే అయినా, పవన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం. ఆ హోదాలో ఆయన నుంచి ఇంకేదో ఆశించిన సామాన్య జనం కాస్త నీరసపడ్డారు. పవన్ ప్రసంగం పరిపూర్ణంగా ఉందా లేదా అనే విషయం పక్కనపెడితే, సరికొత్తగా ఆయన ఏదో చెబుతారని ఆశించిన వారు మాత్రం కాస్త అసంతృప్తికి లోనయ్యారు.
ఇక వైరి వర్గాల విషయానికొస్తే, పవన్ కల్యాణ్ ప్రసంగం ఎలా ఉన్నా అటునుంచి కౌంటర్లు పడటం సహజం. అయితే పవన్ ప్రసంగం ఈసారి ట్రోలర్లకు మరింత పని పెంచింది. పవన్ ప్రసంగంపై ఈసారి విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ చేసిన బహుభాషా ప్రసంగం అక్కడ అంత అవసరమా అనే మాట వినపడుతోంది. అన్నిటికంటే ముందు ఇల్లు చక్కబెట్టుకోవాలనుకుంటారు పెద్దలు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం జనసేన ఆవిర్భావ సభలో ఏపీ మినహా మిగతా విషయాలు చాలా మాట్లాడారు. హిందీ, తమిళం, మరాఠీ, కన్నడ భాషల్లో ప్రసంగించారు. తనను బీజేపీ నేతలు ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి పిలిపించారని, అప్పుడు తనపై అక్కడి స్థానికుల్లో ఉన్న క్రేజ్ అర్థమైందని చెప్పారు. పోనీ పవన్ కి అక్కడ మరింత క్రేజ్ ఉన్నా కూడా జనసేన ఆయా రాష్ట్రాల్లో పోటీ చేసే అవకాశం ఉందా..? ఎన్నాళ్లయినా ఆయన బీజేపీకి ప్రచారం చేయడం కోసమే ఆయా రాష్ట్రాలకు వెళ్లాలి కానీ, సొంతగా జనసేనకు అక్కడ ఎంట్రీ ఉంటుందా..? ఒకవేళ ఉంటుందీ అనుకుంటే, ముందుగా జనసేన ఏపీలో సింగిల్ గా సత్తా చాటాలి, ఆ తర్వాతే పక్క రాష్ట్రాలవైపు చూడాలి.
భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ప్రస్తుతం జనసేన కూటమిలో ఉంది, అంటే పొత్తు ధర్మం పాటిస్తూ మాటల్లో, చేతల్లో కూడా ఎక్కడా లైన్ క్రాస్ చేయకుండా ఉండాలి. ఇలాంటి సందర్భంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎలా ఉండాలి..? భవిష్యత్ లో తమ ప్రయాణం ఎలా కొనసాగుతుంది..? దానికోసం తీసుకోవాల్సిన నిర్ణయాలేంటి..? కార్యకర్తలకు పవన్ చేసే ఉపదేశం ఏంటి..? ఇలా రకరకాల ప్రశ్నలకు జయకేతనం సభలో సమాధానం దొరుకుతుందని అందరూ అనుకున్నారు. కానీ కుదర్లేదు. పార్టీ వ్యవహారాలపై పవన్ పెద్దగా ఫోకస్ చేయలేదు. తనని అసెంబ్లీ గేటు తాకనీయబోమంటూ తొడలు కొట్టిన వారికి గట్టిగా సమాధానం చెప్పామన్నారు డిప్యూటీ సీఎం పవన్. ప్రశ్నించే స్థాయి నుంచి సమస్యలు పరిష్కరించే స్థితికి ఎదిగామన్నారు. 100 శాతం స్ట్రైక్ రేట్ అన్నారు. ఇవన్నీ ఇప్పటికే జరిగిపోయిన విషయాలు. వీటిని మరోసారి గుర్తు చేశారు కానీ, భవిష్యత్ దిశా నిర్దేశం లేదనేది ప్రధానంగా వినిపిస్తున్న కంప్లయింట్.
ఫైనల్ గా త్రిభాషా విధానంపై కూడా పవన్ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. హిందీ వద్దనుకున్నప్పుడు తమిళ సినిమాలను హిందీలో డబ్ చేస్తే వచ్చే డబ్బులు మాత్రం తమిళ నిర్మాతలకు ఎందుకంటూ సూటిగా ప్రశ్నించారు పవన్. ఈ ప్రశ్న తమిళ నేతలకు నచ్చలేదు. ప్రకాష్ రాజ్ వంటివారు నేరుగా పవన్ ని సోషల్ మీడియాలో టార్గెట్ చేశారు. తమకి హిందీపై ద్వేషం లేదని, కానీ దాన్ని తమపై బలవంతంగా రుద్దొద్దని మాత్రమే అంటున్నామని ఆయన క్లారిటీ ఇచ్చారు. త్రిభాషా విధానంపై తన వ్యాఖ్యలను పవన్ మరోసారి ఎక్స్ వేదికగా స్పందించడం ఇక్కడ విశేషం. హిందీని బలవంతంగా రుద్దడాన్ని తాను కూడా సమర్థించడం లేదన్నారు. తానెప్పుడూ హిందీ భాషను వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో హిందీని తప్పనిసరి చేయలేదని, అయితే కొందరు దీనిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని స్పందించారు పవన్.
మొత్తమ్మీద పవన్ కల్యాణ్ జయకేతనం సభ ప్రసంగం అన్ని వర్గాలను సంతృప్తి పరచలేదని తెలుస్తోంది. ఆయన ఆవేశపూరిత ప్రసంగం జనసైనికులకు ఉత్తేజ భరితంగా ఉండొచ్చు, వీర మహిళలకు నచ్చవచ్చు. కానీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా తనకు ఉన్న విజన్ ని, భవిష్యత్ కార్యాచరణను ఆ వేదికపై వినిపించలేకపోయారనే వాదన సోషల్ మీడియాలో ఉంది. ఇక సినిమాల విషయాన్ని కూడా పవన్ పూర్తిగా పక్కనపెట్టారు. ఓజీ, ఓజీ అంటూ గొడవ చేస్తున్న అభిమానులకు సర్దిచెప్పారు.
జాతీయ వాదాన్ని పవన్ తలకెత్తుకోవడం తప్పు కాదు కానీ, ముందు ఏపీ రాజకీయాల్లో జనసేన బలంగా పాతుకుపోవాలి. ఆ తర్వాతే పవన్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలి. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో బీజేపీకి సపోర్ట్ గానే పవన్ పనిచేశారు. దానివల్ల ఆయనకు కానీ, జనసేనకు కానీ సొంతగా కలిగిన ప్రయోజనం ఏంటో ఆయన లెక్కలు వేసుకోవాలి. అలా బేరీజు వేసుకున్న తర్వాతే జాతీయ రాజకీయాలపై పవన్ కామెంట్స్ చేస్తే బాగుంటుందేమో. అప్పటి వరకు ఏపీ రాజకీయాలను పూర్తిగా ఔపోసన పట్టడమే పవన్ తక్షణ కర్తవ్యం.