TTD Good News: తెలంగాణ రాష్ట్ర భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖతో వచ్చే వారికి తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలు, రూ.300 దర్శనాలకు వీరిని అనుమతించనున్నారు. సోమ, మంగళ వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు, బుధ, గురు వారాల్లో రూ.300 ప్రత్యేక దర్శనాలు ఉంటాయి. ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకి ఒక లేఖను అనుమతి ఇవ్వనున్నారు. అయితే ఒక్కో లేఖపై ఆరుగురికి మాత్రమే దర్శనం కల్పించనున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనాల విషయంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంప్రదింపులకు సత్ఫలితం వచ్చిందనే చెప్పవచ్చు. ఇటీవల ఇదే విషయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. మంత్రి లేఖకు ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు దర్శనాలు ఇవ్వాలన్న మంత్రి సురేఖ విజ్ఞప్తికి స్పందన రావడంతో తెలంగాణ భక్తులకు మేలు జరగనుంది. మార్చి 24వ తేదీ నుంచి తెలంగాణ ప్రజాప్రతిని లేఖలకు దర్శనాలు ప్రారంభం కానున్నాయి. టీటీడీ తాజా ఉత్తర్వులపై ఏపీ సీఎం చంద్రబాబుకి మంత్రి కొండా సురేఖ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం స్పందనకి మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనానికి సంబంధించి ఏపీ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలు ఇకపై స్వీకరించమని టీటీడీ పేర్కొంది.. ఇప్పటి వరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబధించి ఏపీ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ ఆదివారం స్వీకరిస్తున్న విషయం తెలిసిందే. అయితే దానికి బదులుగా ఆదివారం దర్శనం కోసం శనివారం రోజు సిఫార్సు లేఖలు స్వీకరించనున్నట్లు టీటీడి వివరించింది. తిరుమలలో అందుబాటులో ఉన్న వసతి సౌకర్యాలు, ఇతర భక్తుల దర్శన సమయాలు సహా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చెప్పుకొచ్చింది. ఈ మార్పుల అన్నింటగిని దృష్టిలో ఉంచుకొని తిరుమల శ్రీవారి భక్తులు టీటీడీ సిబ్బందికి సహకరించాలని పేర్కొంది.
ALSO READ: CM Revanth Reddy: యువతకు భారీ గుడ్ న్యూస్.. రూ.4,00,000 స్కీం ప్రారంభించిన సీఎం రేవంత్