Pawan Kalyan – Nara Lokesh: పిఠాపురంలో లోకేష్ పేరు మారుమ్రోగింది. పవన్ ఇలాకాలో పవన్ పేరు కాకుండ, లోకేష్ పేరు వినిపించడం ఏమిటని అనుకుంటున్నారా.. ఔను మీరు విన్నది నిజమే. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలోని ఏ టీడీపీ కార్యకర్త నోట విన్నా, లోకేష్ మాటే వినిపిస్తోంది. అది కూడ లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందే అంటున్నారు టీడీపీ క్యాడర్.
ఇటీవల మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందేనన్న డిమాండ్ అధికంగా వినిపిస్తోంది. మహాసేన రాజేష్ మొదట ఈ విషయాన్ని లేవనెత్తారు. కూటమిని అధికారంలోకి తెచ్చేందుకు నారా లోకేష్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదన్నారు. యువగళం పాదయాత్ర పేరుతో రాష్ట్రమంతా పాదయాత్ర చేసిన లోకేష్ కు మంత్రి పదవి కంటే, డిప్యూటీ సీఎం పదవి గౌరవంగా ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అలాగే కడప టీడీపీ లీడర్ శ్రీనివాస్ రెడ్డి కూడ ఇదే విషయాన్ని సాక్షాత్తు చంద్రబాబు సమక్షంలో లేవనెత్తారు. అంతేకాదు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కూడ తన నోట ఇదే మాట వినిపించారు.
ఇలా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలన్న డిమాండ్ రోజురోజుకు అధికమవుతోంది. టీడీపీ క్యాడర్ కూడ సోషల్ మీడియాలో పోస్టులు కూడ పెడుతున్నారు. ఇప్పటికే మంత్రి హోదాలో గల లోకేష్ కు తగిన గౌరవం దక్కడం లేదన్నది పరోక్షంగా టీడీపీ నేతలు వ్యక్తపరుస్తున్నట్లు చెప్పవచ్చు.
తాజాగా పిఠాపురంలో కూడ ఇదే నినాదం వినిపించడం ఇప్పుడు హైలెట్ గా నిలిచింది. ఇప్పటికే డిప్యూటీ సీఎం హోదాలో గల పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం పిఠాపురం. ఇక్కడ పవన్ గెలుపుకు స్థానిక టీడీపీ ఇంచార్జ్ వర్మ సహకరించారు. పవన్ కూడ పలుమార్లు వర్మ గురించి గొప్పగా చెప్పారు. అయితే ఆ వర్మనే లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: kumbh mela: కుంభమేళాలో టాప్ బిజినెస్ ఇదే.. లక్షల్లో లాభాలు..
అసలే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కూడ ఇదే డిమాండ్ వినిపించడం ఇప్పుడు హైలెట్ గా మారింది. రోజులు గడిచే కొద్దీ టీడీపీ క్యాడర్ నోట ఇదే పలుకు వినిపిస్తున్నా, టీడీపీ అధినాయకత్వం అసలు స్పందించక పోవడం విశేషం. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని పార్టీ కార్యకర్తలు కోరుతున్నా కూడ, సీనియర్ నాయకులు గప్ చుప్ గానే ఉన్నారు. ఇంతకు లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఏమోకానీ, ఇచ్చేదాక క్యాడర్ మాత్రం వదిలేలా లేదని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే డిప్యూటీ సీఎం పవన్ దీనిపై ఎలా స్పందిస్తారని రాజకీయ విశ్లేషకులు నిశితంగా పరిశీలిస్తున్నారు.