kumbh mela: కుంభమేళాలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం. ఎందరో సత్పురుషులను ఒకే చోట దర్శించే భాగ్యం కలగడం కూడ పుణ్యఫలమే. ఈ నేపథ్యంలో 144 ఏళ్ల తర్వాత జరిగే కుంభమేళాలో పాల్గొనేందుకు భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. అయితే ఇక్కడ జరిగే ఓ వ్యాపారం మాత్రం పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ అనే రేంజ్ లో సాగుతుందట. కుంభమేళాలో 40 కోట్ల మంది వరకు భక్తులు పాల్గొంటున్న నేపథ్యంలో, ఈ వ్యాపారం మాత్రం అక్కడ జోరుగా సాగుతుందని వ్యాపారులు తెగ ఆనంద పడిపోతున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ వద్ద కుంభమేళా జనవరి 13న ప్రారంభమైంది. వచ్చేనెల 26 మహా శివరాత్రి నాడు ముగుస్తుంది. ఇప్పటికీ 6 రోజులు పూర్తి చేసుకున్న కుంభమేళాలో భక్తుల రాక రోజురోజుకు పెరుగుతోంది. ఎటు చూసినా భక్తుల సందడి కనిపిస్తోంది. ఎందరో నాగ సాధువులు, అఘోరాలు తమ ఆవాసాలలో ఉంటూ భక్తులను ఆశీర్వదిస్తున్నారు. కుంభమేళాకు వచ్చే భక్తులకు ఏ అసౌకర్యం కలగకుండా యూపీ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు దేశ విదేశాల నుండి వస్తున్నారు. అయితే ఇక్కడ ఈ వ్యాపారం మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందట.
ఇంతకు ఆ వ్యాపారం ఏమిటో తెలుసా.. వేప పుల్లల వ్యాపారం. పూర్వం వేప పుల్లలు దంతాలను శుభ్రపరచుకోవడం కోసం ఉపయోగిస్తారు. నేటికీ కొన్ని గ్రామాలలో ఇదే పరంపర సాగుతోంది. అయితే కుంభమేళాకు భారీగా భక్తులు వస్తున్న నేపథ్యంలో స్థానికులు, కొందరు భక్తులు వేప పుల్లల వ్యాపారం ప్రారంభించారు. ఒక కట్ట వేపపుల్లలు రూ. 10 వేలకు కొనుగోలు చేసి, సుమారు లక్ష వరకు ఆదాయం పొందుతున్నారట వ్యాపారులు. 6 అడుగుల వేపపుల్ల రూ. 10 రూపాయలకు విక్రయిస్తున్నారు.
Also Read: Viral News: ఆమెకు 19 మంది సంతానం.. అయితేనేమి రికార్డ్ బద్దలు కొట్టింది
కుంభమేళాకు వచ్చిన ప్రతి భక్తుడు తప్పక దంత శుద్ధి పాటిస్తారు. అందుకే టూత్ పేస్ట్ కంటే వేప పుల్ల మేలని, ప్రకృతి వరప్రసాదిని వేపచెట్టు పుల్లలతో దంత శుద్ధి బహుబాగు అంటూ వ్యాపారులు కేకలు వేస్తూ మరీ వ్యాపారం జోరుగా సాగిస్తున్నారు. భక్తులు కూడ వేపపుల్లలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని, 45 రోజుల పాటు సాగే కుంభమేళా తమకు భక్తిపారవశ్యంతో పాటు ఉపాధి కూడ చూపిందని స్థానికులు, వేప పుల్లల వ్యాపారులు తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 40 కోట్ల మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉన్న నేపథ్యంలో వ్యాపారస్తుల సంఖ్య కూడ రోజురోజుకు అంతేస్థాయిలో పెరుగుతుందట. మరి కుంభమేళాలో పాల్గొన్నారా.. అక్కడ వేప పుల్లను ఎన్ని రూపాయలకు కొనుగోలు చేశారో కామెంట్ చేయండి!