రైతులు కష్టాల్లో ఉన్నారని జగనే అంటారు, మళ్లీ మూడేళ్లు కళ్లు మూసుకుని ఉండాలని ఆయనే చెబుతారు. ఆ తర్వాత ఆయన తీరిగ్గా అధికారంలోకి వచ్చి న్యాయం చేస్తారట. అసలు మూడేళ్ల తర్వాత ఎన్నికల్లో గెలిచేదెవరు, ఓడేదెవరు..? 11 సీట్లకు ఘోరంగా పడిపోయిన జగన్ ఇంకా జనాల దగ్గర కాకమ్మ కబుర్లు చెప్పడం విశేషం.
ఇటీవల అకాల వర్షాలకు కడప, అనంతపురం జిల్లాల్లో ఉద్యాన పంటలు కొన్నిచోట్ల దెబ్బ తిన్నాయి. అరటి తోటలు నేలకొరిగాయి. ఈ క్రమంలో రైతుల పరామర్శకోసం జగన్ జనంలోకి వచ్చారు. కడప జిల్లాలో తాతిరెడ్డిపల్లెలో అరటి పంట నష్టపోయిన రైతుల్ని ఆయన పరామర్శించారు. ఈ క్రమంలో జగన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రతిపక్షంలో ఉన్న తాము ఏమీ చేయలేకపోతున్నామని అన్నారాయన. ఇన్ పుట్ సబ్సిడీ పెంచాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని ఆయన రైతులకు సూచించగా అక్కడే ఉన్న అధికారులు ఆల్రడీ ఇన్ పుట్ సబ్సిడీ పెంచారని ఆయనకు వివరించారు. రైతులు కూడా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయకపోవడంతో జగన్ కి ఏం మాట్లాడాలో తోచలేదు.
కళ్లు మూసుకోండి..
గతంలో కూడా జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి నవ్వులపాలయ్యారు. మరోసారి ఆయన అలాంటి వ్యాఖ్యలే చేశారు. కళ్లు మూసుకుంటే ఏడాది పూర్తయిందని, మరో మూడేళ్లు కళ్లు మూసుకుంటే వైసీపీ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక తిరిగి రైతులకు మంచి రోజులొస్తాయన్నారు. రైతులకు అప్పుడు న్యాయం చేస్తామని గతంలో ఇచ్చినట్టు రైతులకు రూ.50వేలు ఇస్తామన్నారు. అంతా బాగానే ఉంది కానీ, జగన్ లెక్క ప్రకారం కష్టాల్లో ఉన్న రైతులు ఆ మూడేళ్లు కళ్లు మూసుకుని ఏం చేయాలనేదే ఇప్పుడు ప్రశ్న.
మూడేళ్లు ఓపిక పట్టండి..ప్రతి రైతు మొహం సంతోషంగా ఉండేలా చేస్తా! pic.twitter.com/Um0Lr7Lypb
— We YSRCP (@we_ysrcp) March 24, 2025
ప్రతిపక్షం ఉన్నది దేనికి..?
నిజంగానే ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రతిపక్షం వారికి బాసటగా ఉండాలి. ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. అవసరమైతే అసెంబ్లీలో ఆయా సమస్యలను ప్రస్తావించాలి. మరి జగన్ చేస్తున్నదేంటి..? అసెంబ్లీ అంటేనే ఆయన పరిగెత్తి పారిపోతున్నారు. ప్రతిపక్ష నాయకుడు అనే హోదా ఇస్తేనే తాను అసెంబ్లీకి వస్తానంటున్నారు. 11 సీట్లతో ఆ హోదా ఎలాగూ రాదని ఆయనకు తెలుసు. అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. దీంతో ఎంచక్కా అసెంబ్లీ ఎగ్గొట్టి బెంగళూరులో సెటిలయ్యారు. అసెంబ్లీలో ప్రజల తరపున పోరాటం చేయలేక, మూడేళ్లు కళ్లుమూసుకోండి అంటూ ఉచిత సలహా ఇవ్వడం హాస్యాస్పదంగా మారింది.
ఏపీ రాజకీయాల్లో జగన్ పరిస్థితి అయోమయంగా మారింది. నాయకులంతా చేజారిపోతున్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రస్తావించడానికి పెద్దగా సమస్యలు కూడా లేవు. మహా అయితే సూపర్ సిక్స్ అమలు ఆలస్యమవుతోంది అంతే. అదే సమయంలో రెడ్ బుక్ అంటూ నాయకులు కొందరు ఆరోపిస్తున్నా.. అక్కడ క్లియర్ గా అవినీతి, అక్రమాలు కనపడుతున్నాయి. అందుకే వైసీపీ నేతలు కొందరు జైలుకెళ్లారు. ఇక్కడ కక్షసాధింపు అనడానికి కూడా పరిస్థితులు సహకరించడంలేదు. దీంతో జగన్ టీమ్ సైలెంట్ గా మారింది. ఇక జగన్ కూడా ఏపీలో కంటే ఎక్కువగా బెంగళూరులో ఉంటున్నారు. ఏపీలో ఏదైనా కార్యక్రమం ఉంటే ఆయన నేరుగా బెంగళూరు నుంచి వచ్చి వెళ్తున్నారు. కనీసం అసెంబ్లీకి కూడా హాజరు కావడంలేదు. అప్పుడప్పుడు పరామర్శలంటూ ప్రజల్లోకి వెళ్లి మూడేళ్లాగండి, రెండేళ్లాగండి అంటూ కాలక్షేపం కబుర్లు మాత్రం చెబుతున్నారు.