
AP : ఏపీలో పొలిటికల్ వార్ మరింత తీవ్రమైంది. టీడీపీ, వైసీపీ పోటాపోటీగా యాత్రలు చేపడుతున్నాయి. అటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ ఆసక్తిని రేపుతోంది. తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమై చర్చించారు. ఈ భేటీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. 45 నిమిషాలపాటు వివిధ అంశాలపై చర్చించారు. ఇప్పటికే కిషన్‌రెడ్డి, లక్ష్మణ్.. పవన్ కల్యాణ్‌ను కలిసి తెలంగాణలో బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలతో పవన్ భేటీ ఆసక్తిని రేపుతోంది.
మరోవైపు చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో జనసేనానితో అమిత్ షా ఏపీ రాజకీయ అంశాలు చర్చించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల నారా లోకేశ్ అమిత్ షాను కలిసి వచ్చారు. ఇప్పుడు తెలంగాణ పొత్తుల అంశం పేరుతో పవన్ కల్యాణ్ అమిత్ షాతో భేటీకావడం ఆసక్తిగా మారింది.
ఇంకోవైపు ఏపీలో నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి కార్యక్రమం చేపట్టారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని అగరాలలో నిర్వహించిన సభలో ఆమె పాల్గొన్నారు. తమ జీవితాల్లో వెలుగులు నింపుతారని చంద్రబాబుపై రాష్ట్ర ప్రజలకు ఎంతో నమ్మకం ఉందని భువనేశ్వరి అన్నారు. తను బాధను మహిళలు అర్థం చేసుకుంటారని భావిస్తున్నానన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా అడుగు ముందుకే వేద్దాం. నిజం గెలవాలి.. నిజమే గెలవాలి. సత్యమేవ జయతే అంటూ కార్యకర్తలతో భువనేశ్వరి ప్రతిజ్ఞ చేయించారు.
వైసీపీ కూడా రాజకీయ యాత్రకు శ్రీకారం చుడుతోంది. 175 నియోజకవర్గాల్లో సామాజిక సాధికార యాత్ర చేయనుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు నేతలు బస్సు యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ నెల 26 నుంచి నవంబర్ 9 వరకు మొదటి విడత బస్సుయాత్ర చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు.
ఆదివారాలు మినహా మిగిలిన ఆరు రోజులు యాత్ర కొనసాగుతుంది. ఉత్తరాంధ్రలో ఇచ్చాపురం, దక్షిణ కోస్తాలో తెనాలి, రాయలసీమలో శింగనమల నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ప్రతిరోజూ యాత్ర కొనసాగుతుంది. డిసెంబర్ 31 వరకూ 60 రోజులపాటు సభలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఈ యాత్ర చేపడతారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు ఈ యాత్రలో పాల్గొంటారు. సీఎం జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ప్రజలకు వివరించడమే ఈ యాత్ర లక్ష్యం. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, తలశిల రఘురాంలకు సీఎం వైఎస్ జగన్ సమన్వయ బాధ్యతలను అప్పగించారు.
Roja : వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు మావే : మంత్రి రోజా