Posani Health issue: నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే రాజంపేట ప్రభుత్వ వైద్యశాలకు పోసానిని తరలించి చికిత్స అందిస్తున్నారు. పోసాని కృష్ణమురళిని ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్లో నమోదైన కేసులో భాగంగా అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పోసాని కృష్ణమురళి పై 14 కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్టు చేయడంతో రిమాండ్ ఖైదీగా పోసాని ఉన్నారు.
శుక్రవారం జైలుకు తరలించిన సమయంలో గంట వ్యవధిలోని వాంతులు, విరోచనాలతో పోసాని ఇబ్బందులకు గురి కావడంతో జైలు అధికారులు వెంటనే వైద్యులను రప్పించి చికిత్స అందించారు. మరల శనివారం పోసాని ఆరోగ్యం మరింత క్షీణించగా రాజంపేట వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ఛాతీలో నొప్పి రావడంతో ఈసీజీ తీసిన వైద్యులు కడప రిమ్స్ వైద్యశాలకు తరలించాలని సూచించారు. దీనితో పోసానిని కడపకు తరలిస్తున్నట్లు సమాచారం. అయితే హైదరాబాద్ మై హోమ్ భుజాలో అరెస్ట్ చేసిన సమయంలో సైతం పోసాని కొంత మానసిక ఆందోళన చెందినట్లుగా భావించవచ్చు. అయితే పోసానిని అరెస్టు చేసిన అనంతరం న్యాయమూర్తి ముందు హాజరు పరిచే సమయంలో రిమాండ్ రిపోర్టును పోలీసులు సమర్పించారు. ఆ రిమాండ్ రిపోర్టులో గతంలో ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకే తాను విమర్శలు చేశానని, ఇదే విషయాన్ని పోసాని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
అంతేకాదు పవర్ స్టార్ గా అభిమానులను ఆదరణ పొందిన పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై పోసాని ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టారని రిపోర్టులో పొందుపరిచారు. పవన్ అభిమానులను రెచ్చగొట్టే ఉద్దేశంతోనే తాను అలా మాట్లాడడం జరిగిందని పోసాని అంగీకరించారని అందులో తెలిపారు. తన మాటలను సోషల్ మీడియాలో ప్రచారం చేసే బాధ్యత సజ్జల భార్గవరెడ్డి తీసుకున్నారని, అందుకే తాను అలా మాట్లాడవలసి వచ్చిందంటూ పోసాని చెప్పారని రిమాండ్ రిపోర్టును న్యాయస్థానానికి పోలీసులు అప్పగించారు.
నోరు అదుపులో పెట్టుకోవాలి.. హోమ్ మంత్రి
ఎవరైనా సరే మాట్లాడే సమయంలో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని ఏపీ హోమ్ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. పోసాని అరెస్ట్ గురించి అనిత మాట్లాడుతూ.. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయని, పోసానికి ఎవరు స్క్రిప్ట్ ఇచ్చినా, అనుభవించేది మాత్రం పోసానినే కదా అంటూ మంత్రి అన్నారు. అయితే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైసీపీ చేసిన ఆరోపణలపై మంత్రి సీరియస్ కామెంట్స్ చేశారు. రెడ్ బుక్ ప్రకారం మేం ముందుకెళ్తే వైసీపీ నేతలు రోడ్డుపై తిరగలేరని అనిత అన్నారు.
Also Read: Heavy Rainfall India: సమ్మర్ లో భారీ వర్షసూచన.. అలర్ట్ చేసిన ఐఎండీ.. ఇదేమి చిత్రమో కదా..
కూటమిలో అంతర్యుద్ధం అని కామెంట్స్ చేసిన గోరంట్ల మాధవ్ పై హోం మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీలో అంతర్యుద్ధంపై మాధవ్ దృష్టి సారించాలని, కూటమిలో అలాంటిదేమీ లేదన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే కుదరదని. ఇది వైసీపీ ప్రభుత్వం కాదు.. ఎన్డీయే ప్రభుత్వమని అనిత హెచ్చరిక చేశారు. కాగా పోసాని బెయిల్ పిటిషన్ పై సోమవారం విచారణ సాగనున్న నేపథ్యంలో, బెయిల్ మంజూరైతే మరో కేసులో అరెస్టు చేయడానికి పోలీసులు సిద్దమైనట్లు సమాచారం.