కోనసీమ, స్వేచ్ఛ: సంక్రాంతి వచ్చిందంటే గోదావరి జిల్లాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. ఓవైపు కోడిపందాల జోరు. ఇంకోవైపు ఆటపాటలు, పిండివంటల ఘుమఘుమలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉభయ గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ప్రత్యేకతలు అనేకం. ఎక్కడెక్కడో ఉండే వారంతా, పెద్ద పండుగకు సొంత ఊరు వచ్చి అక్కడి సంప్రదాయాలను పాటిస్తారు. ఈ క్రమంలోనే కోనసీమలో అత్యంత పవిత్రంగా జరిగే ప్రభల తీర్థం ఈసారి కూడా వైభవంగా జరిగింది. సంక్రాంతి నుంచి ముక్కనుమ తర్వాతి రోజు దాకా అన్ని మండలాల్లో ప్రభల తీర్థాలు జరుపుతారు. బుధవారం జగ్గన్న తోట ప్రభల తీర్థం కన్నులపండువగా సాగింది.
ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
కోనసీమలో ఎంతో ప్రత్యేకత చాటుకున్న ఈ ప్రభల తీర్థం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. చిన్నా పెద్దా అందరూ చేరి ఒక్కటై తీర్థాన్ని చూడ్డానికి కోనసీమ సహా ఇతర ప్రాంతాలవాసులు కూడా తరలివచ్చారు. ఈసారి ఏకాదశ రుద్రుల ప్రభలను ఏర్పాటు చేసి ఊరేగించారు. వందల కేజీలకు పైనే బరువు ఉండే భారీ ప్రభలను మోసుకెళ్లారు ప్రజలు. పంట పొలాలు, కాలువలు దాటుకుంటూ జగ్గన్న తోటకు చేరుకున్నాయి. ఈ సుందర దృశ్యాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవని ప్రజలు తెలిపారు.
11 గ్రామాల నుంచి తీర్థాలు
ఎప్పటిలాగే ఈసారి కూడా 11 గ్రామాల నుంచి ప్రభలు తీర్థానికి చేరుకున్నాయి. ఆయా గ్రామాల్లో వెలిసిన కాశీ విశ్వేశ్వర స్వామి, భోగేశ్వర స్వామి, వీరేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వర స్వామి, చెన్నకేశవ మల్లేశ్వర స్వామి, మేనకేశ్వర స్వామి, రామేశ్వర స్వామి, చెన్నమల్లేశ్వర స్వామి, రాఘవేశ్వర స్వామి, అభినవ వ్యాఘ్రేశ్వర స్వామి, భోగేశ్వర స్వామి జగ్గన్న తోటలో సమావేశమై లోక కల్యాణార్థం మాట్లాడుకుంటారని భక్తుల నమ్మకం. దానికి సంకేతంగా ఏటా ఆయా గ్రామాల నుంచి ప్రభలు జగ్గన్న తోటకు చేరుకుంటాయి.
50 వేల మంది భక్తుల రాక
పంట పొలాలు, పచ్చని పొలాల మధ్య సాగే ఈ ప్రభల తీర్థం చూసేందుకు ఈసారి 50వేల మందికి పైగా ప్రజలు తరలివచ్చారు. గూడు బండ్లపైనే ఈ కార్యక్రమం కొనసాగింది. అయితే, ఈసారి తీర్థంలో అపశృతి చోటు చేసుకుంది. ఎడ్ల బండ్లు జనంలోకి దూసుకెళ్లాయి. ఈ సంఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
Also Read: సంక్రాంతి బరిలో కోడి పందేలు పీక్స్.. నిషేధం ఉన్నా కారు, బుల్లెట్ బైక్ బహుమానంగా పోటీలు