Sankranti Special: సంక్రాంతి వచ్చిందంటే చాలు.. అందరూ స్వగ్రామాల బాట పట్టేస్తారు. ఏ రహదారులు చూసిన నిత్యం వాహనాల రద్దీ సర్వసాధారణం. టోల్ గేట్ల వద్ద అయితే ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీసులు ప్రతిక్షణం శ్రమించాల్సిందే. ఏపీ ప్రజలు సంక్రాంతి పండుగకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అందుకే సుదూరాన ఉన్న ప్రజలు గ్రామాల బాట పట్టి, సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కానీ ఈ గ్రామస్థులు మాత్రం, అందుకు భిన్నం. అందరు సొంతూరికి వస్తే, వీరు మాత్రం వేరే రాష్ట్రంలో పండుగ జరుపుకుంటారు. వీరు లేని పండుగ అక్కడ ఊహించలేరట ఆ రాష్ట్ర ప్రజలు. ఇంతకు పండుగ రోజు కూడ, సొంత గూటికి రాని ఆ ఊరెక్కడుందంటే.. ఏపీలోని ప్రకాశం జిల్లాలో..
ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలోని చింతలపల్లె పంచాయతీ ఓబుళాపురం గ్రామమిది. ఈ గ్రామంలో సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇక్కడ ఎవరి ఇంట్లో చూసిన బసవన్న చిత్రపటాలే ఉంటాయి. ఈ గ్రామస్థులు బసవన్న ను దైవంలా పూజిస్తారు.. ఆరాధిస్తారు. వీరందరూ గంగిరెద్దుల వారే కావడం విశేషం. వీరి వృత్తి గంగిరెద్దుల చేత విన్యాసాలు చేయించడం, నాదస్వర నాదాన్ని వినసొంపుగా వాయించడంలో వీరికి వీరే సాటి. అందుకే వీరికి కర్ణాటక రాష్ట్రంలో ఆదరణ అధికం. గతంలో 300 లకు పైగా ఎన్నో కుటుంబాలు ఉండేవి ఈ గ్రామంలో. కానీ కర్ణాటక రాష్ట్రంలో వీరికి ఆదరణ అధికం కావడంతో పొట్టకూటికోసం అక్కడికే వలసవెళ్లారు.
సంక్రాంతికి అందరూ స్వగ్రామాల బాట పట్టినా, వీరు మాత్రం బెంగుళూరు, హంపి వంటి ప్రాంతాలలో బసవన్నల ఆటలు ఆడిస్తూ, అక్కడే సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. ఓబుళాపురం గ్రామంలో ఉన్న కొందరు మాత్రం ఇక్కడే పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ సమయంలోనే తమ వారికి కాస్త ఉపాధి దొరుకుతుందని, అందుకే పండుగ సమయంలో తమ వారందరూ అక్కడే ఉండి సంక్రాంతి పండుగ శోభ పెంచుతారని గ్రామస్థులు తెలుపుతున్నారు.
Also Read: Chandrababu – Pawan Kalyan: ఏపీలో పవన్ చెప్పిందే నడుస్తోందా.. అసలు నిజాలివే..!
మన సంస్కృతి సంప్రదాయాలను పెంపొందించడంలో వీరి పాత్ర కీలకం. ఎందుకంటే సంక్రాంతి అంటేనే డూడూ బసవన్నల ఆటలు ఉండాల్సిందే. అటువంటిది నేటి ఆధునిక కాలంలో కూడ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ.. స్వగ్రామాలకు దూరమవుతున్నారు వీరు. ఈ గ్రామస్థులకు, వలస వెళ్లి అక్కడే పండుగ జరుపుకుంటున్న వీరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పేద్దాం.. ఈ గ్రామస్థులు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని కోరుకుందాం.