YCP in Nellore: కడప తర్వాత ఆ జిల్లాను వైసీపీకి కంచుకోటగా పిలుచుకుంటారు. పార్టీ ఏర్పడ్డ కొద్దిరోజులకే ఆ జిల్లాలో నాయకత్వం పటిష్టంగా మారింది. వైసిపి పోటీ చేసిన తొలిసారే ఆ జిల్లాలో విజయాలు సాధించింది. ఏకంగా పదికి 10 స్థానాలను కైవసం చేసుకుని అప్పటి ప్రతిపక్షమైన టిడిపిని చితికిల పడేలా చేసింది. అలాంటి ఆ జిల్లాలో ఒకరిద్దరు నేతలు తప్ప ప్రస్తుతం అంతా సైలెంట్ గా మారిపోయారు. కొన్ని నియోజకవర్గాల్లో నేతలు యాక్టివ్ గా ఉన్నా వారి వెంట నడవడానికి కేడర్ సంశయిస్తుంది. మరి కొన్ని నియోజకవర్గాల్లో కార్యకర్తలు జోష్‌లో ఉంటే నాయకత్వం సైలెంట్ అయిపోయింది. అసలు ఆ జిల్లా నేతల మౌనం వెనుక కారణమేంటి…?
చెలాయించారు.. మాయమయ్యారు. ఓసారి జిల్లా గురించి డిటైయిల్‌గా తెలుసుకుందాం.
2019 ఎన్నికలు వైసీపీకి బాగా కలిసి వచ్చాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆ పార్టీ పదికి పది అసెంబ్లీ స్థానాలను, ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఐదేళ్ల పాటు వైసీపీ నేతలు తమదైన స్టైల్లో అధికారం చెలాయించారు. జిల్లాలోనూ ఆ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఈ సమయంలో ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మనుగడ కోల్పోయే పరిస్థితికి వచ్చింది. 2024లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకరన్న పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో 2024 ఎన్నికలు రానే వచ్చాయి. టీడీపీ పుంజుకోవడంతో పాటు కూటమి పార్టీల బలం బాగా కలిసి వచ్చింది. వైసీపీ అభ్యర్థులకు దీటుగా బరిలో నిలిచారు. ఏటువంటి రాజకీయ అనుభవం లేని వారు కూడా టికెట్లు దక్కించుకొని గెలుపొందారు. 2019 నాటి ఫలితాలు పూర్తిగా రివర్స్ అయి.. కూటమి జిల్లాలో క్లీన్‌స్పీప్ చేసింది. దాంతో వైసీపీ నేతలు ఒక్కసారిగా ఢీల పడిపోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన నేతలు కూడా మొహం చాటు చేయడం ఆ పార్టీలో పెద్ద మైనస్ గా కనిపిస్తుంది.
పార్టీ అధ్యక్షుడు జగన్ పలు దఫాలుగా పార్టీ సమావేశాలు పెట్టి సమీక్షలు చేస్తున్న నాయకుల్లో మనోధైర్యం కనిపించినట్టు లేదు. అధిక సంఖ్యలో నేతలు ఇళ్ళకే పరిమితమవుతున్నారు. మరి కొంతమంది ఏకంగా రాష్ట్రాన్ని విడిచి పొరుగు రాష్ట్రాల్లో సొంత వ్వవహారాలు చూసుకుంటున్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి కూడా ప్రజా క్షేత్రంలో కనిపించడం లేదు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం పార్టీ బాధ్యతలు చూసుకుంటూ అందరికీ అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. గూడూరు నియోజకవర్గంలో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఉన్నానంటే ఉన్నాను అన్నట్లు వ్యవహరిస్తున్నారంట.
Also Read: Chandrababu – Pawan Kalyan: ఏపీలో పవన్ చెప్పిందే నడుస్తోందా.. అసలు నిజాలివే..!
సుళ్ళురుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య సూళ్లూరుపేట లోనే ఉంటున్నా అంతంత మాత్రమే అందుబాటులో ఉన్నారని కార్యకర్తలు వాపోతున్నారు. ఇలా అయిదేళ్లు, పదేళ్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన నేతలు ప్రజలకు పూర్తిగా అందుబాటులో లేకుండా పోయారు. మరి కొంతమంది ఇప్పటికే పార్టీ మారి కూటమి పార్టీల్లో చేరుతున్నారు. ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి టిడిపి అధికారంలోకి రాగానే పార్టీ మారిపోయారు. మొత్తమ్మీద జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీకి నాయకత్వ లేమి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ క్రమంలో ప్రత్యామ్నాయ నాయకులను వెతుక్కోవడానికి వైసీపీ అంతర్గతంగా సర్వేల చేయించుకుంటుందంట. అది తెలిసి ఇప్పటివరకు పని చేసిన నేతలే మొహం చాటేస్తుంటే కొత్తగా వచ్చిన నేతలు ఎంత మాత్రం నిలబడి ముందుకు నడిపిస్తారని వైసీపీ కేడర్ పెదవి విరుస్తుంది. మొత్తానికి ఉమమడి జిల్లాలో అలా తయారైంది వైసీపీ పరిస్థితి.