Pawan Kalyan – Prakash Raj : పవన్ కల్యాణ్ వర్సెస్ ప్రకాశ్‌రాజ్. టాప్ అండ్ జెర్రీ వార్. వాళ్లిద్దరూ ఉప్పు-నిప్పు. జనసేనాని ఏం చేసినా ప్రకాశ్‌రాజ్ ఏదో ఒకటి అంటుంటారు. ప్రకాశ్‌రాజ్ ఏ ట్వీట్ చేసినా జనసైనికులు చీల్చి చెండాడుతుంటారు. సోషల్ మీడియాలో ఇరు వర్గాల మధ్య ఓ రేంజ్‌లో వార్ జరుగుతూనే ఉంటుంది.
హిందుత్వం vs సెక్యులరిజం
సినిమాల్లో బానే ఉంటారు. రాజకీయాలు వచ్చే సరికే పవన్‌కు ప్రకాశ్‌రాజ్‌కు అస్సలు పడదు. ఇద్దరూ భిన్నధృవాలు. పవన్ కల్యాణ్ పక్కా హిందుత్వ వాది. తాను హిందువునని చెబుతూనే.. మిగతా మతాలను గౌరవిస్తానని స్పష్టంగా చెబుతారు. ప్రకాశ్‌రాజు కరుడుగట్టిన సెక్యులర్. అక్కడే చెడింది ఆ ఇద్దరికీ.
మళ్లీ గిల్లిన ప్రకాశ్‌రాజ్!
జనసేనాని తన మానాన తాను పాలిటిక్స్ చేస్తుంటారు. 24 బై 7 అదే ధ్యాసలో ఉంటారు. డిప్యూటీ సీఎం అయ్యాక రోజంతా ప్రజల కోసమే పని చేస్తున్నారు. ఆయనేదో చేయాలని తెగ ఆరాటపడుతున్నారు. మధ్యలో అప్పుడప్పుడు ప్రకాశ్‌రాజ్ ఎంటరై.. జనసేనానిని ఏదో ఒకటి అనడం అలవాటుగా మారింది. జస్ట్ ఆస్కింగ్ అంటూ.. ట్వీట్లతో ప్రత్యక్షంగా, పరోక్షంగా పవన్‌ను తరుచూ గిల్లుతూనే ఉంటారాయన. లేటెస్ట్‌గా ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రకాశ్‌రాజ్‌ను ఇంటర్వ్యూ చేసింది. ప్రోమోను చూస్తే.. జనసేనాని గురించి ప్రకాశ్‌రాజ్ మరోసారి తనదైన స్టైల్‌లో విమర్శలు చేసినట్టు అనిపిస్తోంది.
నలుగురి పేర్లు తెలిసినంత మాత్రాన..
నలుగురు పేర్లు తెలిసినంత మాత్రాన ఆయనకి అన్నీ తెలుసు అని కాదంటూ.. ప్రకాశ్‌రాజ్ డైరెక్ట్‌గా అటాక్ చేసినట్టున్నారు. తమిళనాడు పాలిటిక్స్‌లో ఎంటర్ అయిన విజయ్‌ను, పవన్‌ను కంపేర్ చేస్తూ మాట్లాడారు. తనకు వాళ్లిద్దరూ 20 ఏళ్లుగా తెలుసని.. ఇన్నేళ్ల ప్రయాణం సీరియస్‌గా పాలిటిక్స్ గురించి మాట్లాడింది లేదంటూ ప్రకాశ్‌రాజ్ కామెంట్ చేశారు. ఆయనకు విజన్ కానీ, సమస్యలపై అవగాహన కానీ తనకు కనపడలేదని అన్నారు. ఈ మాటలు విజయ్ గురించా? పవన్ గురించా?
ఆయనకేం తెలీదు..
పొగుడుతాడు.. తిడతాడు.. సడెన్‌గా ఏఐడీఎంకే గురించి మాట్లాడుతాడు. ఎంజీఆర్ అంటారు.. పెరియార్ అంటారు.. నలుగురి పేర్లు తెలిస్తే మనుషులు తెలిసినట్టు కాదంటూ తనదైన స్టైల్‌లో విమర్శలు చేశారు ప్రకాశ్‌రాజ్. ఇక్కడే మరో ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు. “అర్థం చేసుకోడు, అర్థం కారు అంటారు కదా.. అలాకాదు ఆయనకు తెలీదు..” అంటూ పవన్ గురించే అన్నట్టు అనిపిస్తోంది ప్రోమో చూస్తుంటే.
టాక్ లోకల్
ఆయన నియోజక వర్గంలో ఇటీవలే కుల బహిష్కరణ జరిగిందని యాంకర్ గుర్తు చేస్తే.. ఆ ప్రశ్నకు ప్రకాశ్‌రాజ్ ఏం చెప్పారంటే.. మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, వెస్ట్ బెంగాల్ ఇలా వేటి గురించో మాట్లాడుతాడు కానీ.. తన నియోజక వర్గంలో ఉన్న సమస్యల గురించి మాత్రం మాట్లాడడు.. అంటూ ప్రకాశ్‌రాజ్ విమర్శలు చేశారు.