పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చింది కానీ, ఇంకా పూర్తి కాలేదు. అది కేవలం ప్రమాదమా, లేక ఆయన మరణానికి ఇంకేదైనా కారణం ఉందా అనే విషయంలో పోలీసులు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఈలోగా రకరకాల వీడియోలు మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సీసీ టీవీ ఫుటేజీలు, ట్రాఫిక్ కానిస్టేబుల్ చెప్పిన మాటలు, టీస్టాల్ ఓనర్ చెబుతున్న మాటలు.. ఇలా ఇవన్నీ క్రోడీకరించి చూస్తే అది కేవలం ప్రమాదమే అనే విధంగా ఈ కేసుకి ఓ ముగింపు వచ్చే అవకాశం ఉంది.
పాల్ ప్రశ్నలకు బదులేది..?
సీసీ కెమెరాల ఫుటేజీలను కూడా కొంతమంది నమ్మడం లేదు. అదే సమయంలో ట్రాఫిక్ కానిస్టేబుల్ చెప్పిన మాటల్ని కూడా కేఏపాల్ వంటి వారు నమ్మడం లేదు. ఒకవేళ ట్రాఫిక్ కానిస్టేబుల్ చెప్పిందే నిజమైతే, పాస్టర్ ప్రవీణ్ మద్యం మత్తులో ఉండి ఉంటే, ఆయన్ను అప్పుడే అరెస్ట్ చేసి ఉండాలి కదా అనేది పాల్ ప్రశ్న. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది నేరం కాబట్టి.. ఆయనను అరెస్ట్ చేసి ఉండాలని, బండి నడిపేందుకు అనుమతించకుడా ఉండాల్సిందని అంటున్నారు పాల్. ఒకవేళ అప్పుడే ప్రవీణ్ ని ట్రాఫిక్ కానిస్టేబుల్ వారించి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా అని అంటున్నారు పాల్. అది యాక్సిడెంట్ కాదు, ముమ్మాటికీ హత్యేనంటున్నారు పాల్.
సీబీఐ టు ఎఫ్బీఐ..
ప్రవీణ్ పగడాల మృతి విషయంలో నిజాలన్నీ బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు కేఏపాల్. తాను సుప్రీంకోర్టులో కేసు వేస్తానంటున్నారాయన. ఏపీ హైకోర్టుకి వెళ్తానని, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఈ విషయాన్ని రెయిజ్ చేస్తానని, సీబీఐ నుంచి ఎఫ్బీఐ దాకా విచారణ కోరతానని అంటున్నారు. తాను ఇవన్నీ చేయకముందే ఏపీ పోలీసులు నిజా నిజాలు బయటపెట్టాలంటున్నారు. ప్రవీణ్ సొంత సోదరి చెప్పిన మాటలు కాకుండా, ఎవరో ట్రాఫిక్ ఎస్సై చెబితే అతను ప్రవీణ్ పగడాల అని నమ్మేస్తారా అని ప్రశ్నిస్తున్నారు పాల్.
హర్షకుమార్ వాదన..
ఎన్ని సీసీ టీవీ ఫుటేజీలు వచ్చినా నమ్మేది లేదని అంటున్నారు మాజీ ఎంపీ హర్షకుమార్. హర్షకుమార్ ఆరోపణలపై ఇప్పటికే ఓసారి ఏపీ పోలీసులు వివరణ కోరారు. ఆయన ఆరోపణలకు ఆధారాలుంటే చూపాలన్నారు. సీసీ టీవీ ఫుటేజీ బయటకు వచ్చాక ఆందోళన చేస్తున్న చాలామంది వెనక్కు తగ్గారు. కానీ హర్ష కుమార్ మాత్రం ఆ సీసీ టీవీ ఫుటేజీలు అన్నీ ఫేక్ అని అన్నారు. కావాలనే ఈ కేసుని తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.
అయితే ప్రవీణ్ భార్య, ఆయన సోదరుడు మాత్రం ఈ కేసు విషయంలో బయట వ్యక్తుల ఇన్వెస్టిగేషన్ ఇక ఆపేయాలని సూచించారు. ప్రవీణ్ మరణాన్ని కొందరు తమ సొంత ప్రయోజనాలకోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారని అన్నారు. అలాంటి పనులు ఆపేయాలని కోరారు.
కీలకంగా మారిన మాస్క్..
ఇప్పటి వరకు విడుదలైన సీసీ టీవీ ఫుటేజీలన్నిటిలో ప్రవీణ్ కుమార్ మాస్క్ తోనే ఉన్నారు. ఆయన్ను చూసిన వారు కూడా మాస్క్ ఉండగా చూశారు కానీ, మాస్క్ లేకుండా ఆయన ముమ్మాటికీ ప్రవీణే అని చెప్పేవారు లేరు. పోనీ వైన్ షాప్ లో ఉన్న వీడియోలు ఫేక్ అనుకుందాం. కానీ ఆయన లారీని ఢీకొని కిందపడిపోయిన వీడియోని ఎవరూ రీక్రియేట్ చేయలేరు కదా. అలా చేస్తే వారి ప్రాణాలకే ముప్పు కదా. సో ఆ వీడియోలను మార్ఫింగ్ అని అంత తేలిగ్గా కొట్టిపారేయలేం. ఈ సంఘటనపై మరోసారి ఏపీ పోలీసులు క్లారిటీ ఇచ్చే వరకు ఈ వాద ప్రతివాదాలు జరుగుతూనే ఉంటాయి.