Purandeswari Critices YCP: వైసీపీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సంచలన విమర్శలు చేశారు. ఈ రోజు విజయవాడలో పురందేశ్వరి అధ్యక్షతన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జిల్లాల కొత్త అధ్యక్షులు, పార్టీకి చెందిన కీలక నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థాగత అంశాలు, రాజకీయ కార్యాచరణపై చర్చలు జరిపారు.
ఏప్రిల్ 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపనున్నట్లు పురందేశ్వరి తెలిపారు. అలాగే వచ్చే నేల 14న అంబేడ్కర్ జయంతి నిర్వహిస్తామని అన్నారు. వీటిని విజయవంతం చేయడంపై పార్టీ నేతలకు పురందేశ్వరి పలు సూచనలు చేశారు.
అనంతరం మీడియా, పార్టీ సభ్యులతో మాట్లాడిన పురందేశ్వరి.. గతంలో అధికారంలో ఉన్న వైసీపీపై విరుచుకు పడ్డారు. రాష్ట్రాన్ని వైసీపీ అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఆమే ఆరోపించారు. మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏపీకి ఒక్క కంపెనీ కూడా రాలేదని గుర్తుచేశారు. పెట్టుబడులు లేకపోయేసరికి రాష్ట్రంలో ఎన్నో రంగాలు దివాలా తీసాయని అన్నారు. దీంతో ఉపాధి కూడా లేకుండా పోయిందని తెలిపారు.
అధికారంలో ఉన్నన్ని రోజులు మద్యం మాఫియాతో వైసీపీ నేతలు భారీగా దోచుకున్నారని పురందేశ్వరి ఆరోపించారు. చివరికి ఇసుక మట్టి విషయంలో కూడా అడ్డగోలుగా వ్యవహరించారని మండిపడ్డారు. అందుకే ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్తూ ఎన్నికల్లో ఓడించారని పురందేశ్వరి ఎద్దేవా చేశారు.