Rohit sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టు అయిన ముంబై ఇండియన్స్ {ఎమ్ఐ} ప్రదర్శన నానాటికి దిగజారిపోతుంది. ఐపీఎల్ లో ఐదు సార్లు టైటిల్ విజేత అయిన ముంబై ఇండియన్స్.. చివరిసారిగా 2020లో టైటిల్ గెలిచింది. అంటే ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచి నాలుగు సీజన్లు గడిచి ఇప్పుడు ఐదవ సీజన్ నడుస్తోంది. ఈ సీజన్ లో అయినా ముంబై ఇండియన్స్ టైటిల్ కొడుతుందా..? అని ఎదురు చూస్తున్న ముంబై ఇండియన్స్ అభిమానులకి నిరాశ ఎదురవుతుంది.
ఐదుసార్లు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మని కాదని.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా వెళ్లిన తమ మాజీ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాని ఏరి కోరి తీసుకువచ్చి కెప్టెన్ గా నియమించుకుంది ముంబై ఇండియన్స్. అతని సారథ్యంలో కప్ కొట్టాలని భావించింది. కానీ ఫలితాలు మాత్రం చాలా నిరుత్సాహకరంగా వెలువడుతున్నాయి. ఈ 18వ సీజన్ లో కూడా ముంబై ఇండియన్స్ ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్.. రెండు మ్యాచ్లలోనూ ఓడి – 1.163 నెట్ రన్ రేటు తో పాయింట్స్ పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ సీజన్ లో తన బ్యాటింగ్ తో ఏదోలా నెట్టుకొస్తున్నాడు. అతడిలో ఒకప్పటి ఫామ్ ఏ మాత్రం లేదని భారత క్రికెట్ మాజీ ఆటగాళ్లు సైతం విమర్శిస్తున్నారు. ఒకప్పుడు తన నిలకడ ప్రదర్శనతో భారీగా పరుగులు చేస్తూ, ముంబై జట్టుకు ఎన్నో విజయాలను అందించి, ఐదు సార్లు టైటిల్ విజేతగా నిలిపిన రోహిత్ శర్మ.. ఈ సీజన్ లో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ఈ సీజన్ లోని తొలి మ్యాచ్ లో డక్ అవుట్, రెండవ మ్యాచ్లో కేవలం 8 పరుగులు చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.
గత ఐపీఎల్ సీజన్ లో అతడు సెంచరీ చేయడంతో పాటు గతం కన్నా మెరుగైన స్ట్రైక్ రేట్ తో ఆడాడు. కానీ ఈసారి ఆడిన రెండు మ్యాచ్లలో 4.00 యావరేజ్ తో, 100 స్ట్రైక్ రేటుతో కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు. అయితే రోహిత్ శర్మ నాయకత్వంలో ఇప్పటి వరకు ఐదుసార్లు ఐపీఎల్ కొట్టిన ముంబై ఇండియన్స్.. ఈ సీజన్ లో మాత్రం ఒక్క గెలుపు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అంబానీ ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముంబై ఇండియన్స్ తిరిగి మళ్లీ గెలుపు బాట పట్టాలంటే రోహిత్ శర్మకే తిరిగి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాలని కొందరు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కెప్టెన్గా హార్దిక్ పాండ్యా సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని, కెప్టెన్సీ ఒత్తిడితో బ్యాటింగ్ లోను తేలిపోతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ఈ నేపథ్యంలో అంబానీ ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని.. తిరిగి హిట్ మ్యాన్ కి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించే అభిప్రాయంపై చర్చలు జరుపుతున్నట్లుగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే ఎటువంటి అభిప్రాయాలు వినిపిస్తున్నప్పటికీ రోహిత్ శర్మని మాత్రం తక్కువగా అంచనా వేయలేం. ముంబై జట్టుకు అతడే మెయిన్ ఫేస్. కాబట్టి అతడికి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే అతడు ఒక్కసారి క్రీజ్ లో నిలదొక్కుకున్నాడు అంటే భారీ ఇన్నింగ్స్ ఆడతాడు. ఈ నేపథ్యంలో అక్కడికే కెప్టెన్సీ బాధ్యతలను ఇవ్వాలన్న డిమాండ్స్ కూడా పెరిగిపోతున్నాయి.