Nara Rammurthy Nayudu: ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నేడు ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో జరగనున్నాయి. రామ్మూర్తి నాయుడు శనివారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శనివారం హైదరాబాద్ లోనే రామ్మూర్తి పార్థీవ దేహాన్ని ఉంచగా నేడు ప్రత్యేక విమానంలో తిరుపతికి తీసుకెళ్లనున్నారు. ఏఐజీ ఆసుపత్రి నుండి వాహనంలో బేగంపేట్ విమానాశ్రయానికి తీసుకువెల్తారు. మంత్రి నారా లోకేష్ తన చిన్నాన్న భౌతిక కాయాన్ని దగ్గరుండి నారావారిపల్లెకు తరలిస్తున్నారు.
Also read: కారు.. కిస్సా కల్లాస్.. జిల్లాలకు జిల్లాలే ఖాళీ!
ఢిల్లీ పర్యటన మధ్యలోనే హైదరాబాద్ వచ్చిన చంద్రబాబు నేడు సోదరుడి అంత్యక్రియలలో పాల్గొంటారు. చంద్రబాబు మరో ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయం నుండి తిరుపతికి బయలుదేరనున్నారు. తిరుపతి ఎయిర్ పోర్టు నుండి రోడ్డు మార్గంలో నారావారిపల్లెకు చేరుకుంటారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టు సమాచారం. అంత్యక్రియలకు చంద్రబాబు లోకేష్ తో పాటు నారా నందమూరి కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. అదేవిధంగా ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కార్యకర్తలు భారీ ఎత్తున నారావారిపల్లెకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.