** ఇకనైనా మారండి చిన్న బాస్..!
– పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీకి బీటలు
– అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోయి పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకోలేని పరిస్థితి
– నాడు కారుకు ఎదురే లేదు.. నేడు దిక్కులేదా?
– జిల్లాలకు జిల్లాలే ఖాళీ.. గులాబీల్లో కంగారు
– పార్టీపై క్రమంగా పట్టు కోల్పోతున్న కేటీఆర్
– ఎంతసేపూ కాంగ్రెస్‌ను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్న వైనం
– వర్కింగ్ ప్రెసిడెంట్ తీరుతో విస్తుపోతున్న నేతలు
– లగచర్ల వ్యవహారంతో లబోదిబోమంటున్న క్యాడర్
– తీరు మారకపోతే లోకల్‌గా బతకలేమంటున్న లీడర్లు
– ఆవేశంతో తప్పు మీద తప్పు చేస్తున్న చిన్న బాస్
– చెప్పే ధైర్యం చేయలేక కుమిలిపోతున్న గులాబీ దళం
స్వేచ్ఛ సెంట్రల్ డెస్క్:
రాను రాను రాజు గుర్రం గాడిద అయినట్లుగా తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి తయారయ్యింది. ఈ ఆరోపణలు ఎవరో చేయట్లేదు ఆ పార్టీ నేతల నుంచే వస్తున్నాయి. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు పదేళ్లపాటు రాష్ట్రాన్ని ఏలిన కారు పార్టీకి బీటలు పడి, పంచర్లు వేసినా సెట్ అయ్యే పరిస్థితుల్లేవ్. అసెంబ్లీ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం పరువు నిలబెట్టుకోలేకపోయింది. ఇలాంటప్పుడు పార్టీని గాడిన పెట్టడానికి ప్రయత్నించాల్సిన అధ్యక్షుడు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ ఊసే ఎత్తట్లేదు. పెద్ద సారు ఫామ్‌హౌస్‌లో రెస్ట్ తీసుకుంటుంటే, కారు స్టీరింగ్ తన చేతిలోకి తీసుకున్న కేటీఆర్ ఎంతసేపూ అధికార కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం, క్యాడర్, ప్రజలను రెచ్చగొట్టి ఉసిగొల్పే దగ్గరే ఆగిపోయారు. దీంతో పార్టీ పరిస్థితేంట్రా దేవుడా అంటూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకూ దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కేటీఆర్ ఏదో విధంగా రెండ్రోజులకో రచ్చ చేయడమే పనిగా పెట్టుకుని, పార్టీని గాలికొదిలేయడంతో గులాబీ దళంలో కంగారు మొదలైనట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అధికార పార్టీని బద్నాం చేయడంపై వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టిన దృష్టి, పార్టీపై 10 శాతం పెడితే బాగుపడుతుందని బయటికి చెప్పుకోలేక, లోలోపల గులాబీ నేతలు కుమిలిపోతున్నారు. పోనీ మందిలించే ధైర్యం ఉందా? అంటే అంత సాహసం ఎవరూ చేయలేకపోతున్నారు. దీంతో ఇక బీఆర్ఎస్ మనకొద్దు మహాప్రభో అంటూ జిల్లాలకు, జిల్లాలే లీడర్లు ఖాళీ చేసేసి కాంగ్రెస్‌లోకి జంప్ అయిపోతున్న పరిస్థితులు వస్తున్నాయి. ఆయన ఆవేశంతో చేస్తున్న తప్పుల మీద తప్పులు బీఆర్ఎస్ ఉనికికే ఎసరొస్తోందని కొందరు కీలక నేతలు చెప్పుకుంటూ ఉండటం గమనార్హం. ఇప్పటికైనా కేటీఆర్ తీరు మార్చుకుని, పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టకపోతే స్థానికంగా బతకలేమని గులాబీ లీడర్లు గొల్లు మంటున్నారు. ఇందుకు ఉమ్మడి నిజామాబాద్, వరంగల్ జిల్లాలో నెలకొన్న పరిస్థితులు చూస్తే అర్థం చేసుకోవచ్చు.
నాడు.. నేడు
ఉమ్మడి నిజామాబాద్ ఒకప్పుడు కారు పార్టీకి కంచుకోట. గత పదేళ్లలో 10 ఏళ్లలో 8 నుంచి 9 స్థానాలు ఎమ్మెల్యేలను గెలుచుకున్న బీఆర్ఎస్ గడ్డకు బీటలు పడుతున్నాయి. తాజా, మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు ముఖం చాటేస్తూ క్యాడర్‌కు దూరంగా ఉంటున్నారు. అధినేత కేసీఆర్ ఆదేశాలను సైతం లైట్ తీసుకుంటున్నారు. సీనియర్ మహిళా శాసన సభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిస్తే జిల్లాలో సగానికి పైగా నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు జరగలేదంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక బాల్కొండ, కామారెడ్డి సీఎం దిష్టిబొమ్మలు దగ్దం చేస్తే బాన్సువాడ, ఆర్మూర్‌లో మొక్కుబడిగా కార్యక్రమం జరిగాయి అనేది చర్చ. నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గ నేతలు కేటీఆర్ ఆదేశాలను లైట్ తీసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్యక్రమాలు చేసేందుకు కనీసం క్యాడర్‌కు సైతం దిశానిర్దేశం చేయలేదు. దీంతో గులాబీ శ్రేణులు తమ నేతల తీరుపై చిటపటలాడుతున్న పరిస్థితి. ఇవన్నీ ఒక ఎత్తయితే నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పార్టీ దాదాపుగా ఖాళీ అయ్యే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే త్వరలో మేయర్ సైతం పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక మాజీ ఎమ్మెల్యేలు బిగాల, బాజిరెడ్డి సైతం అడపదడపా నియోజకవర్గం వైపు చూస్తున్నారని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. దీంతో చేసేదేమీ లేక క్యాడర్ తిన్నగా హస్తం గూటికి క్యూ కడుతోంది. మరోవైపు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఆర్మూర్, ఎల్లారెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యేలు చాలా రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారని క్యాడర్ చెబుతోంది. దీంతో ఈ నేతల హౌనం వెనుక ఏదైనా వ్యూహం ఉందా? కలిసికట్టుగా వీళ్లంతా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? అని నిజామాబాద్‌లో పెద్ద చర్చే జరుగుతోంది.
దిక్కులేని స్థితిలో..!
ఇక వరంగల్ జిల్లా విషయానికొస్తే రాళ్ళు మునిగి బెండ్లు తేలాయి అనే సామెతగా పరిస్థితులు ఉన్నాయి. ఉద్యమాల పురిటిగడ్డగా బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి వెన్నుముఖగా నిలిచిన ఓరుగల్లుకు పెద్దదిక్కు లేకుండా పోయారనే చర్చ సాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు వరంగల్ జిల్లాలో వేరేలెవల్‌లో ఉన్నా బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా తారుమారు అయ్యింది. వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు మనస్ఫూర్తిగా నాయకులు ముందుకు రాలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఇక్కడ పార్టీ గడ్డుకాలం ఎదుర్కొంటుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు వరంగల్ జిల్లాలో తిరుగులేని పార్టీగా ఉన్న బీఆర్ఎస్‌కు బహు నాయకత్వం ఉండేది. అయితే ఎన్నికల తర్వాత సీన్ రివర్స్ అయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్న 12 స్థానాలకు 10 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. 10కి తోడు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్‌లో చేరడంతో బలం 11 కు పెరిగింది. దీనికి తోడు రెండు పార్లమెంట్ స్థానాలు ఉండగా రెండు గెలుచుకుని తిరుగులేని పార్టీగా నిలిచింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాలు పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి ప్రతికూలంగా వచ్చాయి. 12 అసెంబ్లీ స్థానాలకు కేవలం 2 స్థానాలు గెలుచుకోగా స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఇక రెండు పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే 2018లో కాంగ్రెస్‌కు పట్టిన గతే 2023లో బీఆర్ఎస్‌కు పట్టింది. నాడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలు అందరూ కాంగ్రెస్‌లో చేరిపోవడంతో బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే మొన్నటి వరకూ అధికారంలో ఉన్న పార్టీకి వరంగల్‌లో అధ్యక్ష పదవికి ముందుకొచ్చే నాయకులు లేని దుస్థితి ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
దూరం.. దూరం
రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ వరంగల్ ఉమ్మడి జిల్లాను ఆరు ముక్కులుగా చేసి ఆన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించారు. ఇప్పుడు వరంగల్, జనగామ జిల్లాలకు అధ్యక్షుడే లేకుండా పోయారు. ఇక గ్రేటర్ వరంగల్, హనుమకొండలోనూ అంతంత మాత్రమే. ఇక వరంగల్ జిల్లాకు అధ్యక్షుడిగా ఉన్న వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కారు దిగి బీజేపి పార్టీలో చేరడంతో వరంగల్ కారు స్టీరింగ్ పట్టుకునే వాళ్లు కరవయ్యారనే చర్చ జరుగుతుంది. ఇదే సీన్ జనగామ జిల్లాలోనూ ఉంది. పార్టీని ముందుండి నడిపించే జిల్లా అధ్యక్షులు లేక ఆ పార్టీ క్యాడర్ నిరాశలో ఉన్నారు. ఈ అంశంపై ఎంపీ ఎన్నికల ముందూ కేసీఆర్ దగ్గర చర్చ జరిగినా కనీసం కన్వీనర్‌గా నియమించి పార్టీ నడపాలని భావించినా ఆ ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బతినడంతో మరింత గడ్డుకాలంగా మారిందని జిల్లాల్లో చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ అధికారం పోయిన తరువాత పూర్తిగా ప్రజలకు దూరం అవుతోందనే చర్చ సాగుతోంది. నాయకుల మధ్య సయోధ్య లేకపోవడం, అనేక మంది ముఖ్య నేతలు పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరడంతో గులాబీ పార్టీ ప్రజలకు దూరం అవుతోంది. ఓడినా, గెలిచినా ప్రజల్లో ఉండి ప్రజల పక్షాన నిలవాల్సిన నేతలు ప్రజల్లో లేకుండా పోయారు. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాల్లో మొక్కుబడిగా పాల్గొనడం తప్ప ప్రజల్లోకి వెళ్ళడం లేదు. కొందరు నేతలు కనీసం పార్టీ కార్యక్రమంలో కూడా పాల్గొనక పోవడంతో వారంతా పార్టీకి దూరమవుతున్నారా? అనే చర్చ కూడా నడుస్తోంది. ఇక ఈ సమయంలో అధ్యక్ష పదవులు తీసుకుంటే కార్యక్రమాలు నిర్వహించడం, పార్టీని నడపడం ఖర్చుతో కూడుకున్న పనని నేతలు మనసులో మదనపడుతున్నట్టు ద్వితియశ్రేణి నేతలు చెప్పుకుంటున్నారు.
ఎందుకీ పరిస్థితి?
ఈ రెండు జిల్లాల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నది ఇన్‌సైడ్ టాక్. ఈ పరిస్థితికి కారణం వన్ అండ్ ఓన్లీ కేటీఆర్ తీరే కారణమని గులాబీ శ్రేణులు చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్‌ను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్న కేటీఆర్, లోకల్‌గా క్యాడర్‌లో ఉన్న సమస్యలను పట్టించుకోకపోవడం, కనీసం జంపింగ్‌లను ఆపలేకపోవడమే కారణమని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. ఏకపక్ష నిర్ణయాలు, ఆవేశంతో తప్పుల మీద తప్పులు చేస్తున్న కేటీఆర్ తీరుతో సీనియర్లు సైతం విస్తుపోతున్న పరిస్థితి నెలకొంది. పోనీ ఇలా కాదని సలహాలు, మందలిచ్చే ధైర్యం చేద్దామంటే ఈ సాహసం చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని కుమిలిపోతున్నారట. ఇకనైనా కేటీఆర్ మార్చుకొని క్యాడర్‌ను అక్కున చేర్చుకుంటే తప్ప పార్టీలో బతికి బట్టకట్టలేమని గులాబీ నేతలు చెప్పుకుంటున్నారు. మరోవైపు ఈ పరిస్థితులన్నీ చక్కబెట్టేందుకే చిన్న బాస్ పాదయాత్రకు సిద్ధమయ్యారనే చర్చ కూడా జరుగుతోంది. ఇకనైనా అధికారం పోయిందనే ఫ్రస్ట్రేషన్ తగ్గించుకుని, ప్రభుత్వంపై నిత్యం ఏదో ఒక రాద్ధాంతం చేద్దామనే ఆలోచన మానుకుని, పార్టీని పట్టించుకోకపోతే అంతే సంగతులు అని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.