Lady Aghori: తెలుగు రాష్ట్రాలలో అఘోరీ మాత తెలియని వారుండరు. పలు కామెంట్స్ తో సంచలనంగా మారిన అఘోరీ మాత మరోమారు సంచలన కామెంట్స్ చేశారు. మొన్న మహిళపై అఘాయిత్యాలకు పాల్పడిన ఒక వ్యక్తిని, తాను పదిమందిలో అవమానపరిచే విధంగా చేయనున్నట్లు ప్రకటించిన అఘోరీ, తాజాగా వేములవాడ శ్రీ రాజన్న ఆలయంలో గల దర్గాను తొలగించేంత వరకు పోరాటం కొనసాగించనున్నట్లు అఘోరీ ప్రకటించారు.
తాజాగా తణుకులో రాజేష్ నాథ్ జీ అఘోరాని కలిసి లేడీ అఘోరి ఆశీస్సులు తీసుకున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడటంలో భాగంగా పలు ఆలయాలు దర్శించుకున్నానని, తన పోరాటానికి రాజేష్ నాథ్ జీ మద్దతు తెలిపినట్లు తెలిపారు. అఘోరీ మాత మాట్లాడుతూ.. తాను ఈ నెల 18వతేదీ నుండి వేములవాడలో ఉంటూ.. దర్గాను తొలగించేందుకు పోరాటం చేస్తానంటూ ప్రకటించారు. ఎన్ని కేసులు నమోదు చేసినా తాను వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.
ముత్యాలమ్మ ఆలయం ధ్వంసం తో పాటు, ఇతర ఆలయాలను ధ్వంసం కు పాల్పడిన ఎవరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తనను విమర్శించే వారు ఒకసారి ఆలోచించి, తాను చేసే పోరాటానికి మద్దతు పలకాలన్నారు. రాజేష్ నాథ్ జీ అఘోరా మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన కొందరు, లేడీ అఘోరీపై విమర్శలు గుప్పించడం భాదాకరమన్నారు. ఒంటరి పోరాటం చేస్తున్న అఘోరీ మాతకు తాము పూర్తి మద్దతిచ్చి పోరాటం చేస్తామన్నారు.
లేడి అఘోరీ మాత ఒక్కటే ఉందని అనుకోవద్దని, తామంతా ఒక్కటై ఆలయాలపై దాడులకు పాల్పడిన వారిని శిక్షించే స్థితికి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సనాతన ధర్మం పరిరక్షణ కోసం అందరూ చేయి చేయి కలపాలని, అఘోరీ మాతకు మద్దతు పలకాలని సూచించారు. కానీ అఘోరీ మాత స్వయంగా వేములవాడ శ్రీ రాజన్న ఆలయంలోని దర్గాను తొలగించే వరకు పోరాటం చేస్తానంటూ హెచ్చరించడంపై పోలీస్ శాఖ ఏవిధంగా స్పందిస్తుందో వేచిచూడాలి.