మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత వైసీపీ నాయకుల్లో చిన్నా పెద్దా అందరూ స్పందించారు. పార్టీ అధినేత జగన్ కూడా ట్వీట్ వేసి మరీ తన ఆగ్రహం వ్యక్తం చేశారు. తానే బాధితురాలినంటూ రెండు రోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నమాజీ మంత్రి రోజా కూడా మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత నేరుగా స్పందించారు. ఆయన్ను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. ఇక పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఏకంగా ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టారు. ఈ పాపం ఊరికే వదలదని మిథున్ రెడ్డి ఉసురు తగులుతుందని, ఇంతకు ఇంత అనుభవించి తీరతారన్నారు. కానీ ఎక్కడో లోటు, ఏదో వెలితి. ఒక్క గొంతు మాత్రం వినపడలేదు, ఆయన మాత్రం మీడియాకు కనపడలేదు. అసలు పేర్ని నాని ఈ ఎపిసోడ్ లో ఎందుకు మిస్సయ్యారు? మిథున్ రెడ్డి అరెస్ట్ పై ఆయన ఎందుకు స్పందించలేదు? ఆయనకు ఆవేదన లేదా? ఈ అరెస్ట్ ని ఆయన ఎందుకు ఖండించలేదు?
అజ్ఞాతంలో పేర్ని..
మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత పేర్ని నాని ఎందుకు బయటకు రాలేదు అని కొంతమంది ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవల కన్నుకొడితే చీకట్లో ఏసేయాల్రా..! అంటూ ఆయన వైసీపీ మీటింగ్ లో సంచనల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల ఫలితంగా ఆయనపై కేసు నమోదైంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ కృష్ణా జిల్లా పామర్రు పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో కూడా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం పేర్ని హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు కొట్టివేయాలంటూ మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టులో ఆయనకు చుక్కెదురైంది. ఆ పిటిషన్ తోసిపుచ్చిన కోర్టు, తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఈలోగా తన అరెస్టు ఖాయమని తేలడంతో పేర్ని నాని అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈనెల 22న హైకోర్టు విచారణలో ఊరట లభిస్తే ఆయన వెలుగులోకి వస్తారని అంటున్నారు.
అజ్ఞాతవాసం పార్ట్-2
కూటమి అధికారంలోకి వచ్చాక పేర్ని నాని అజ్ఞాతవాసానికి సంబంధించి ఇది రెండో ఎపిసోడ్. గతంలో రేషన్ బియ్యం కుంభకోణంలో కూడా ఆయన ఓసారి పోలీసుల్ని తప్పించుకుని అజ్ఞాతంలో గడిపారు. కోర్టులో ఊరట లభించిన తర్వాతే ఆయన బయటకు వచ్చారు.ఆ తర్వాత మళ్లీ స్పీడ్ పెంచారు. అయితే రప్పా రప్పా వ్యాఖ్యలతో మరోసారి ఆయన స్పీడ్ కి బ్రేక్ పడింది. పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ కి ప్రయత్నిస్తుండటంతో మళ్లీ జంప్ అయ్యారు నాని. అయితే బయటకొచ్చిన ప్రతిసారీ మరింత ఫోర్స్ గా ఆయన మాట్లాడటం విశేషం. ఈసారి కేసు వ్యవహారం తేలిపోయిన తర్వాత ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాలి. మొత్తానికి మిథున్ రెడ్డి ఎపిసోడ్ లో పేర్ని నాని ఆవేశం చూడాలనుకున్న వైసీపీ అభిమానులు మాత్రం కాస్త నిరాశపడ్డారు. ప్రస్తుతానికి వారంతా అనిల్, అంబటి, రోజా నిరసనలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.