Rappa Rappa Comments jagan: ఏపీలో రప్పా రప్పా రచ్చ ఇప్పుడిప్పుడే ఆగేలా లేదు. పుష్ప – 2 సినిమాలో హీరో అల్లు అర్జున్ నోట వినిపించిన డైలాగ్ అందరికీ తెలిసే ఉంటుంది. అదేనండీ గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలలు తెగి పడినట్లు రప్పా రప్పా నరుకుతా అనే డైలాగ్ సినిమా రిలీజ్ అప్పుడు ఫేమ్ కావడం కంటే, ఇప్పుడు ఏపీలో ఈ డైలాగ్ పొలిటికల్ రచ్చకు దారి తీస్తోంది. అంతేకాదు మాజీ సీఎం జగన్ పదే పదే రప్పా, రప్పా అంటూ పలకడమే కాక దీనిపై విశ్లేషించడం విశేషంగా మారింది. ఇటు కూటమి, అటు వైసీపీ మధ్య రప్పా రప్పా డైలాగ్ వార్ సాగుతుందని చెప్పవచ్చు. అసలు ఈ రప్పా రప్పా రచ్చ ఏమిటో తెలుసుకుందాం. తాజాగా దీనిపై స్పందించిన జగన్ ఏమన్నారో వింటే, రాజకీయాల్లో రప్పా రప్పా రచ్చ స్టార్ట్ అయిందా అనే మాట విశ్లేషకుల నోట వినిపిస్తోంది.
అంతా రప్పా.. రప్పా
పల్నాడు జిల్లాలో జగన్ పర్యటన సంధర్భంగా ఓ యువకుడు పట్టుకున్న బోర్డు ఇప్పుడు వివాదానికి దారి తీసింది. జగన్ పర్యటన సంధర్భంగా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడగా, పోలీసులు అక్కడక్కడా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా లాఠీలకు పని చెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే ఈ పర్యటన ఏమో కానీ, ఇప్పుడు ఆ ఒక్క బోర్డు అంటే పార్టీ కార్యకర్త పట్టుకున్న బోర్డు ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్ గా మారింది.
ఆ బోర్డులో ఏముందంటే?
2029 లో వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్లు, రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని అని రాసి ఉంది. ఇప్పుడు ఇదే పొలిటికల్ వార్ కు దారి తీస్తోంది. అంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇతర పార్టీ కార్యకర్తలను, నాయకులను నరుకుతామంటూ ఆల్ రెడీ వైసీపీ చెప్పకనే చెబుతుందని టిడిపి, జనసేన, బిజెపి విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే జగన్ పర్యటన సంధర్భంగా జరిగిన అలజడిపై కేసులు నమోదు చేసే పనిలో ఇప్పటికే పల్నాడు పోలీసులు నిమగ్నమయ్యారు. ఇది ఇలా ఉంటే జగన్ తాజాగా తన పర్యటన సాగిన విషయంపై మీడియా ముఖంగా మాట్లాడారు. ఈ సంధర్భంగా ఆయన చేసిన కామెంట్స్ మళ్లీ రప్పా రప్పా రచ్చకు దారి తీశాయి. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వస్తున్నాయి. అబ్బే.. జగన్.. అల్లు అర్జున్‌లా చెయ్యలేకపోయారని అంటున్నారు.
జగన్ నోట రప్పా రప్పా..
మీడియా సమావేశంలో జగన్ మాట్లాడిన అనంతరం మీడియా ప్రతినిధులు జరుగుతున్న రప్పా రప్పా వివాదంపై అడిగారు. అప్పుడు జగన్ ఒక సినిమాలో డైలాగ్ అంటే ఏ సినిమా అంటూ జగన్ ప్రశ్నించారు. పుష్ప – 2 సినిమా అంటూ జవాబు ఇవ్వగానే, సినిమా డైలాగ్ బోర్డు మీద రాసి ప్రదర్శిస్తే కేసులు నమోదు చేస్తారా అంటూ ప్రశ్నించారు. తగ్గేదెలే అనే డైలాగ్ లో అల్లు అర్జున్ గడ్డం కింద చేతులు పెట్టినట్లుగా జగన్ అభినయించి, గడ్డం కింద చేయి పెట్టుకొని ఇలా, అలా ఊపినా కేసులు నమోదు చేస్తారా అంటూ విమర్శించారు. మనం డెమొక్రసీలో ఉన్నామా లేమా అంటూ జగన్ ప్రశ్నించి, ఆ ప్లెక్సీ ప్రదర్శనకు మద్దతుగా జగన్ మాట్లాడారని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే తెలుగు దేశం పార్టీ సోషల్ మీడియా మాత్రం మాజీ సీఎం జగన్ తన స్థాయిని మరచి అటువంటి వాటికి మద్దతు పలకడం ఏమిటని ప్రచారం సాగిస్తోంది. అది కూడా ఒకటికి పది సార్లు జగన్ నోట రప్పా రప్పా మాట రావడంతో, నిన్నటి వరకు జగన్ పర్యటనలో రప్పా రప్పా బోర్డు ప్రదర్శనపై సాగిన వివాదం జగన్ వైపు మళ్లిందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద ఏపీలో రప్పా రప్పా వివాదం మున్ముందు కేసుల నమోదు వరకు వెళ్లడం ఖాయమని చర్చ సాగుతోంది. ఏదిఏమైనా పుష్ప – 2 సినిమా డైలాగ్ ఏపీలో రచ్చ కు దారి తీయడంతో అందరి నోట రప్పా రప్పా మాటే వినిపిస్తోంది.