రైలు ప్రయాణాలు చాలా అందంగా ఉంటాయి. దట్టమైన అడవులు, లోతైన లోయలు, మెరిసే నీటి సరస్సుల పక్క నుంచి పర్వతాల గుండా పాములాగా ముందుకు సాగుతాయి. ఇక హిమాలయాల్లో వెళ్లే రైళ్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. అద్భుతమైన ఈ ప్రయాణాలు హృదయాలను తాకుతాయి. జీవింతంలో మర్చిపోలేని అనుభూతులను అందిస్తాయి. ఇంతకీ హిమాలయాల గుండా వెళ్లే అత్యంత సుందరమైన రైలు మార్గాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
ఈ టాయ్ ట్రైన్ డార్జిలింగ్ నుంచి న్యూ జల్పైగురి వరకు ప్రయాణిస్తుంది. సుమారు సుమారు 88 కిలోమీటర్ల పరిధిలో ఈ రైల్వే లైన్ విస్తరించి ఉంది. ఈ మార్గంలో అద్భుతమైన హిమాలయన్ దృష్టాలు పర్యాటకును మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ మార్గాన్నియునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఈ రైలు ప్రయాణంలో టీ తోటలు, అడవులు, మంచుతో కప్పబడిన శిఖరాల అద్భుతమైన దృశ్యాలు ఆకట్టుకుంటాయి. ప్రయాణీకులు పర్వతాల సౌందర్యాన్ని ఆస్వాదించడానికి విస్టాడోమ్ కోచ్‌లతో రైల్వే ప్రయాణం అందుబాటులో ఉంది.
⦿ హిమాలయన్ క్వీన్
ఈ రైలు కల్కా నుంచి సిమ్లా వరకు సుమారు 96 కిలో మీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఈ రైలు 103 సొరంగాలు, 800 కంటే ఎక్కువ వంతెనల మీదుగా ప్రయాణం చేస్తుంది. ప్రకృతి అందాల నడుమ ప్రయాణిస్తూ పర్యాటకులను కనువిందు చేస్తుంది. ఇది కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు తెచ్చుకుంది. ధరంపూర్, బరోగ్, సోలన్, కందఘాట్ లాంటి అందమైన పట్టణాలు, గ్రామాల గుండా వెళుతున్న ఈ రైలును హిల్ క్వీన్ గా పిలుస్తారు.
⦿ గర్హ్ వాల్ ఎక్స్ ప్రెస్
ఈ రైలు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లోని ఘజియాబాద్, మీరట్, సహరన్ పూర్, హరిద్వార్, రిషికేశ్ లాంటి ముఖ్యమైన నగరాలు, పట్టణాల గుండా వెళుతుంది. ఈ రైలు హిమాలయాల దిగువన ప్రయాణిస్తుంది. శివాలిక్ పర్వత శ్రేణి అద్భుతమైన దృశ్యాలను అందిస్తుంది. ముఖ్యంగా హరిద్వార్, కోట్ ద్వార్ మధ్య ప్రకృతి అందాలు ఎంతగానో అలరిస్తాయి. గర్హ్ వాల్ ఎక్స్‌ప్రెస్ సుమారు 238 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది.
⦿ కాశ్మీర్ వ్యాలీ రైల్వే
ఈ రైలు ఉధంపూర్ నుండి కత్రా వరకు 53 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మాతా వైష్ణోదేవి ఆలయం నుంచి మొదలుకొని శివాలిక్ పర్వత శ్రేణుల వరకు అద్భుతమైన ప్రకృతి అందాలకు నెలవుగా ఉంటుంది. చుట్టుపక్కల ప్రకృతి సౌందర్యం, సుందరమైన దృశ్యాలను అందిస్తుంది.
⦿ కాంగ్రా వ్యాలీ రైల్వే
ఈ రైలు పంజాబ్‌లోని పఠాన్ కోట్ నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని జోగిందర్ నగర్ వరకు ప్రయాణిస్తుంది. దాదాపు 164 కిలోమీటర్ల మేర ఈ రైల్వే మార్గం విస్తరించి ఉంది. ఈ రూట్ హిమాలయ పర్వత ప్రాంతాలకు సంబంధించిన సుందరమైన దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి. అయితే, ఇతర టాయ్ ట్రైన్లతో పోల్చితే ఇక్కడ రద్దీ కాస్త తక్కువగా ఉంటుంది. సుందరమైన ప్రకృతి దృశ్యాలు, టీ తోటల మధ్య నుంచి అద్భుతంగా ప్రయాణిస్తుంది. ఈ మార్గంలో 950 కి పైగా వంతెనలు, 20 కి పైగా సొరంగాలు ఉన్నాయి. ఇది కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.
Read Also: విమానంలో ఎకానమీ, బిజినెస్ క్లాస్ మధ్య ఇంత తేడానా? మీరు అస్సలు నమ్మలేరు!