“క్లాస్ లో నన్నెవరో పూలచొక్కా అన్నారు, అర్జెంట్ గా నాకు ప్రిన్సిపాల్ వచ్చి సారీ చెప్పాలి” అనే సినిమా డైలాగ్ అప్పట్లో బాగా ఫేమస్. తాజాగా ఏపీలో కూడా ఇలాంటి సిచ్యుయేషనే కనపడుతోంది. ఎక్కడ ఏం జరిగినా పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలి, ఆయన తెరపైకి రావాలంటూ డిమాండ్లు వినపడుతున్నాయి. టీటీడీ గోశాల విషయంలో కూడా పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలంటున్నారు మాజీ మంత్రి రోజా. సనాతన ధర్మం గురించి చెబుతున్న పవన్ ఈ విషయంలో నోరు మెదపాలంటున్నారు.
టీటీడీ సమాధానం సరిపోదా..?
టీటీడీ గోశాల విషయంలో ఈరోజు ఉదయం నుంచి హై డ్రామా నడుస్తోంది. వైసీపీ నేతలు గోశాలకు వెళ్తామంటున్నారు, కొంతమంది వెళ్లారు కూడా. కానీ భూమన మాత్రం తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారంటూ హడావిడి చేశారు. రోడ్డుపైనే పడుకుని నిరసన తెలిపారు. ఈ వ్యవహారంలో లేటెస్ట్ గా రోజా ఎంట్రీ ఇచ్చారు. రోజా విమర్శలు, ఆడంగి వెధవలంటూ ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే రోజా టార్గెట్ ఇక్కడ టీటీడీ కాదు, టీడీపీ అంతకంటే కాదు. ఆమె పదే పదే పవన్ కల్యాణ్ ని ఈ వివాదంలో తెరపైకి తేవడం విశేషం.
అవును పవనే రావాలి..
తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత టీటీడీదేనని అంటున్నారు రోజా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వరుసగా అపచారాలు జరుగుతున్నాయని చెప్పారు. తిరుమల లడ్డూలో కొవ్వు ఉందని కూటమి ప్రభుత్వం అబద్ధాలాడిందని చివరకు సుప్రీంకోర్టు వారికి బుద్ధి చెప్పిందన్నారు రోజా. తిరుమలలో మద్యం తాగుతున్నారని, బిర్యానీ ప్యాకెట్లు దొరుకుతున్నాయని, క్యూలైన్లో చెప్పులేసుకుని తిరుగుతున్నారని, డ్రోన్ కెమెరాలు ఎగురుతున్నాయని.. వీటన్నిటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారామె. సనాతన ధర్మాన్ని కాపాడతానని చెబుతున్న పవన్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలన్నారు. ఆయనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కి బాధ్యత లేదా అని నిలదీశారు. తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఎవరికీ పుట్టగతులుండవని, ఆల్రడీ చంద్రబాబుకి ఓసారి అనుభవం ఉందని, పవన్ కల్యాణ్ కి కూడా ఇటీవలే ఈ విషయం అనుభవంలోకి వచ్చిందంటూ రోజా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రోజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పవన్ ప్రాయశ్చిత్తం చేసుకోరా..?
గతంలో తిరుమలలో అపచారం జరిగిందని పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేశారని, ఇప్పుడు ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఆయన ప్రాయశ్చిత్తం చేసుకోరా అని ప్రశ్నించారు రోజా. గోశాల వ్యవహారంలో సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్, పాలకమండలిపై పెద్దగా విమర్శలు చేయని రోజా, పదే పదే పవన్ కల్యాణ్ పేరు తెరపైకి తేవడం విశేషం. రోజా వ్యాఖ్యలపై అటు జనసైనికులు మండిపడుతున్నారు. గోశాల విషయంలో వైసీపీ నేతలు చెబుతున్నవన్నీ అసత్యాలేనని కూటమి నేతలంటున్నారు. అదే సమయంలో కేవలం పవన్ ని మాత్రమే రోజా టార్గెట్ చేయాలని చూడటం దారుణం అంటున్నారు జనసైనికులు. పవన్ పేరు చెప్పి ఆమె అటెన్షన్ తనవైపు తిప్పుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.