RRR over Jagan :
⦿ నన్ను టార్చర్ చేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరు
⦿ సునీల్, ఆంజనేయులు, జగన్ కూడా జైలుకెళ్తారు
⦿ విజయ్‌కు జైలు శిక్ష.. త్వరలోనే జైలుకు ప్రభావతి
⦿ నా గుండెలపై కూర్చున్న తులసి తప్పించుకోలేడు
⦿ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు
అమరావతి, స్వేచ్ఛ: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయమని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు. తనను చిత్రహింసలకు గురిచేసిన ఏ ఒక్కరూ తప్పించుకోలేరన్నారు. ఒక్కొక్కరుగా జైలుకెళ్లడం ఖాయమని, ఏ2 సునీల్ కుమార్, ఏ3 పీఎస్ఆర్ ఆంజనేయులు, ఆఖరికి వైఎస్ జగన్ కూడా జైలుకెళ్తారని ధీమాగా చెప్పారు.
శనివారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇప్పటికే విజయపాల్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడని, త్వరలో ప్రభావతి కూడా జైలుకెళ్తారన్నారు. ‘ నా గుండెలపై కూర్చోని టార్చర్ పెట్టిన తులసిబాబు తప్పించుకోలేడని అన్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన ఘటనపై స్పందించి ఏపీ డిప్యూటీ స్పీకర్ తిరుపతి తొక్కిసలాట బాధాకరమన్నారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి. తొక్కిసలాటతో సంబంధం లేకపోయినా క్షమాపణ చెప్పారు. బీఆర్ నాయుడు తీరును అభినందిస్తున్నాను. బీఆర్ నాయుడు టీటీడీ ఛైర్మన్ అయ్యాకే సమూల మార్పులు జరుగుతున్నాయి.
కాగా, వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారిని కించపరిచే విధంగా మాట్లాడారని, సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారనే ఆరోపణలతో రఘురామపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆయనపై ఎఫ్ఐఆర్ 12/2021 నమోదు చేశారు. ఇందులో ఏ1గా రఘురామకృష్ణంరాజును చేర్చడం జరిగింది.