AP Politics: బీజేపీ రాజకీయాలు విచిత్రంగా ఉంటాయి. ఏ విషయం తీసుకున్నా, బయటకు ప్రచారం ఒకలా జరుగుతుంది. ఆ పార్టీ ప్రకటన మరోలా ఉంటుంది. ప్రజల నుంచి రియాక్ట్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేందుకు ఈ స్కెచ్ వేసినట్టు చెబుతారు. ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ సీటుకు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు దాదాపు ఖరారైనట్టు వార్తలు వచ్చాయి. తాజగా తెరపైకి మరో కొత్త పేరు వెలుగులోకి వచ్చింది. కొత్త వ్యక్తి ఎవరు? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
2029 ఎన్నికలకు ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నట్లు పలుమార్లు సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎన్డీయే పార్టీల సమావేశం జరిగిన ప్రతీసారి ఈ అంశంపై చర్చిస్తున్నారు కూడా. దాని ప్రకారమే నేతలు అడుగులు వేస్తూ పోతున్నారు. ఇదే సమయంలో కొత్త కొత్త వ్యక్తులను ఛాన్స్ ఇస్తున్నారు కూడా.
ఢిల్లీలో ఏం జరిగింది?
విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభ సీటు ఖాళీ అయ్యింది. ఏపీ నుంచి ఎవరిని పెద్దల సభకు పంపిస్తున్నారు అనేదానిపై రకరకాల వార్తలు జోరందుకున్నాయి. రెండురోజులుగా ఏపీ రాజకీయాల్లో దీనిపై చర్చ జరుగుతోంది. విదేశీ టూర్ నుంచి ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు, మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. రాజ్యసభ సీటు తమకు ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. అందుకు సీఎం చంద్రబాబు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
రాజ్యసభ రేసులో ఇద్దరు పేర్లు తెరపైకి వచ్చాయి. ఒకటి తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై అయితే, మరొకరు మంద కృష్ణ మాదిగ. అమిత్ షాతో సీఎం చంద్రబాబు సమావేశానికి ముందే.. మందకృష్ణ, మంత్రి కిషన్‌రెడ్డి ఇద్దరు కలిసి కేంద్ర హోంమంత్రిని కలిశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందుకు అమిత్ షాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడే చాలామందికి అనుమానం వస్తుంది.
ALSO READ: మళ్లీ తెరపైకి చింతమనేని, ఈసారి సాక్షిపై
డౌట్ అంతా అక్కడే
ఎస్సీ వర్గీకరణను తెలుగు రాష్ట్రాల్లో అమలు చేస్తే ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు మందకృష్ణ చెప్పాల్సిపోయి హోంమంత్రికి చెప్పడం ఏంటన్నది అసలు ప్రశ్న. రాజ్యసభ సీటుకు అన్నామలైతోపాటు మందకృష్ణ పోటీ పడుతున్నట్లు ఢిల్లీలో ఓ వార్త ప్రచారం సాగుతోంది. దీనిపై బీజేపీగానీ, టీడీపీ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి ఇద్దరిలో ఎవరికి అవకాశం వస్తుందన్న ఆసక్తికరంగా మారింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ ఓటు బ్యాంకు కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కొన్నాళ్లు కిందట హైదరాబాద్‌లో ఎమ్మార్పీఎస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. సభలో చెప్పాల్సిన మాటలు చెప్పేశారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఆపై తెలుగు రాష్ట్రాల్లో కమిషన్ వేయడం, ప్రభుత్వాలు నివేదికను ఓకే చేయడం చకచకా జరిగిపోయింది.
అంతకుముందు జరిగిన.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మందకృష్ణకు ఛాన్స్ ఇచ్చే అవకాశముందని కమలనాధుల్లో ఓ వర్గం అంచనా వేస్తోంది. నామినేషన్‌కు ఇంకా సమయం ఉండడంతో బీజేపీ నుంచి రాజ్యసభ సీటుపై ఎలాంటి ప్రకటన వస్తుందో చూడాలి.