వైసీపీ కీలక నేత పార్టీ వ్యవహారాలను అన్నీ తానై నడిపిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని రోజులుగా మీడియాకి దూరంగా ఉన్నారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని, ఆ కోటరీ వల్లే పార్టీకి నష్టం కలుగుతోందంటూ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన తర్వాతే సజ్జల కాస్త సైలెంట్ అయినట్టు తెలుస్తోంది. కొన్నిరోజులుగా సజ్జల మీడియా ముందుకు రావట్లేదు, ప్రెస్ మీట్లు పెట్టడం లేదు, కనీసం జగన్ కార్యక్రమాల్లో కూడా ఆయన మీడియాకి కనపడలేదు. ఇటీవల జగన్ పులివెందులలో రైతుల్ని పరామర్శించారు, సజ్జల అక్కడకు వెళ్లలేదు. విజయవాడలో మైనార్టీలతో కలసి జగన్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అక్కడ కూడా సజ్జల కనపడలేదు.
వేర్ ఈజ్ సజ్జల..?
వైసీపీ ఓటమి తర్వాత కూడా ఆ పార్టీలో సజ్జల కీలకంగా వ్యవహరించారు. పార్టీ తరపున ఏ నియామకాలు జరిగినా, ఎక్కడ ఏ ప్రెస్ నోట్ విడుదలైనా ఆయన పేరు కచ్చితంగా వినపడేది. పార్టీ వాయిస్ వినిపించాలంటే ఆయనే ముందుకొచ్చేవారు. ఇక పార్టీ నాయకులతో జగన్ మీటింగ్ లకు కూడా సజ్జలే కోఆర్డినేటర్. ఆయన లేకుండా జగన్ కూడా ఎక్కడా ప్రెస్ మీట్ లో మాట్లాడలేదు. అయితే సజ్జలను పరోక్షంగా కోటరీగా పేర్కొంటూ ఆమధ్య విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యల్ని వైసీపీలో ఉన్న కొందరు సీనియర్లు ఖండించారు. కూడా. కానీ అదే పార్టీలోని మరికొందరు నేతలు విజయసాయి వ్యాఖ్యలతో ఏకీభవించారు. జగన్ చుట్టూ కోటరీ ఉందనే మాటల్ని వారు సమర్థించినట్టుగా మాట్లాడారు. గతంలో షర్మిల కూడా సజ్జలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
సజ్జల లేకపోతే..?
సజ్జల కంటే సీనియర్లు చాలామందే ఉన్నా జగన్ మాత్రం ఆయనకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారనే విషయం వాస్తవమే. పార్టీ తరపున తీసుకునే ఏ నిర్ణయాల్లో అయినా సజ్జల ప్రమేయం ఉండేది. జగన్ కంట్లో పడటం కంటే, సజ్జలకు దగ్గరైతే వైసీపీ హయాంలో పనులు పూర్తవుతాయనే ప్రచారం కూడా ఉంది. వైసీపీలో మంత్రి పదవుల నియామకాల్లో కూడా సజ్జల మాట నెగ్గిందనే వాదన కూడా ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ల రిజల్ట్ ని సజ్జల తేలిగ్గా కొట్టిపారేయడం ఆ పార్టీ వారికి కూడా నచ్చలేదు. అప్పుడు ఆ ఎన్నికలను వార్నింగ్ బెల్ గా భావించి ఉంటే 2024లో జగన్ కి ఇంత ఘోర ఓటమి దక్కేది కాదని వారి భావన. అప్పటినుంచే సజ్జల కొంతమమంది సీనియర్లకు టార్గెట్ గా మారారు. కానీ జగన్ దగ్గర మాత్రం సజ్జల మాటే చెల్లుబాటు అవుతుంది కాబట్టి ఎవరూ ఏమీ చేయలేకపోయారు. విజయసాయి లాంటివారు పార్టీ బయటకు వచ్చి విమర్శలు చేయడంతో అసలు కథ మొదలైంది.
ప్రస్తుతానికి సైలెంట్..
సజ్జలను జగన్ దూరం పెడతారని అనుకోలేం కానీ, ప్రస్తుతానికి ఆయన మాత్రం సైలెంట్ గా ఉన్నారనేది వాస్తవం. అయితే ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారనేది ఇంకా క్లారిటీ లేదు. ఇటీవల వైసీపీ అనుకూల మీడియా కూడా నాయకులందరికీ కవరేజ్ పెంచింది. జిల్లాల్లో వైసీపీ తరపున జరిగే కార్యక్రమాలు, చిన్న చిన్న మీటింగ్ లకు కూడా ప్రయారిటీ ఇస్తోంది. కొత్తగా చాలామందికి సాక్షిలో స్పేస్ దక్కింది. అదే సమయంలో కొన్నిరోజులుగా సజ్జల ఫొటో మాత్రం కనపడ్డంలేదు. ఆయన తనకు తానే దూరం జరిగారా, లేక అంతకంటే పెద్ద కారణం ఉందా అనేది తేలాల్సి ఉంది. వైసీపీలో ఏది జరిగినా, ఏ నాయకుడు పార్టీకి దూరమైనా, దగ్గరైనా.. జగన్ కి సమాచారం తెలియకుండా ఉండదు. అలాంటి సమాచారం చేరవేసే సజ్జలే ఇప్పుడు సైలెంట్ కావడం విశేషం.