India US Tariffs| అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాలు ఏప్రిల్ 2 నుంచి అమలులోకి రాబోతున్నాయి. దాని ప్రభావం భారతదేశంపై కూడా ఉంటుంది. ఇప్పటికే ట్రంప్ కెనడా, మెక్సికో, చైనా దేశాలపై భారీగా సుంకాలు మోపారు. అయితే భారత్ మాత్రం సుంకాల నుంచి మినహాయింపు పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో అమెరికా అధికారులు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చైనా, కెనడా, మెక్సికోలతో పాటు ఇండియాని కలిపి ఒకే తరహాలో చూడబోమని అమెరికా తరపున స్పష్టం చేశారు. ఈ విషయంపై అనేక మీడియా వార్తాపత్రికలు వివరణలు ప్రచురించాయి.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరపడానికి వాషింగ్టన్ వాణిజ్య అధికారి బ్రెండన్ లించ్ తన బృందంతో కలిసి భారత్ పర్యటనకు వచ్చారు. ఈ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ వాణిజ్య అధికారులతో ఆ బృందం చర్చలు ప్రారంభించింది. శుక్రవారం నాటికి ఈ రెండు దేశాలు వాణిజ్య ఒప్పందానికి రాబోతున్నాయి. “ట్రంప్ పరిపాలనలో చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలతో కలిపి ఇండియాను కూడా అదే కోవలో మేము చూడటం లేదు. ఆ దేశాలతో కరెన్సీ అవకతవకలు, అక్రమ వలసలు, ఇతర భద్రతా సమస్యలు ఉన్నాయి. కానీ ఇండియాతో కేవలం టారిఫ్ సమస్య మాత్రమే ఉంది. ఈ సమస్యను ఇరు దేశాలు సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటున్నాయి.
Also Read: ఇండియాలో మైనారిటీలపై దాడులు.. అమెరికా నివేదిక.. గట్టిగా బదులిచ్చిన భారత్
రెండు ప్రభుత్వాలకు సంతృప్తికరమైన ఫలితం లభిస్తుందని మేము భావిస్తున్నాము” అని చర్చల్లో పాల్గొన్న ఒక అధికారి వివరించారు. ఇంతలో, ఈ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏప్రిల్ నెలలో అమెరికా రాజధాని వాషింగ్టన్ నగరంలో పర్యటించనున్నట్లు మరో అధికారి తెలిపారు. ఈ పర్యటనలో వాణిజ్యం, సుంకాలు వంటి అంశాలతోపాటు ఇరు దేశాల మధ్య ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలను బలపరచడానికి కృషి చేయనున్నారని తెలియజేశారు.
ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుండి మిత్ర దేశాలు, శత్రు దేశాలు అని వివక్ష చేయకుండా అనేక దేశాలపై భారీ సుంకాలు విధిస్తున్నారు. భారత్ తమ వస్తువులపై అధిక సుంకాలు విధిస్తోందని ఆరోపించిన ఆయన, వచ్చే నెల రెండో తేదీ నుండి ప్రతీకార సుంకాలు అమలులోకి రాబోతున్నాయని ప్రకటించారు. ఈ ప్రకటన నేపథ్యంలోనే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అమెరికాలో పర్యటించారు. ప్రతిపాదిత సుంకాలపై స్పష్టత కోరడం, వాటి ప్రభావాన్ని అంచనా వేయడం వంటి విషయాలతోపాటు సుంకాల తగ్గింపు, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మెరుగుపరచడానికి రూపొందించిన వాణిజ్య ఒప్పందం వంటి అంశాలపై యుఎస్ వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్, వాణిజ్య కార్యదర్శి హౌవర్డ్ లుట్నిక్ లతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల నాయకులు దౌత్య, రక్షణ, వాణిజ్య సంబంధాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ.. “టారిఫ్ల విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు” అని ప్రధాని మోదీకి స్వయంగా స్పష్టం చేశానని పేర్కొన్నారు. అమెరికా నుంచి చేసుకునే దిగుమతులపై భారత్ అత్యధిక పన్నులు విధిస్తోందని, ఇకపై తాము కూడా అదే రీతిలో ప్రతిస్పందిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇప్పటికే అమెరికా విధించిన సుంకాలకు ధీటుగా చైనా, కెనడా, యురోప్ దేశాలు సుంకాల శాతాన్ని పెంచేశాయి. చైనా అయితే ఈ అంశాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది. కానీ భారత్ మాత్రం చర్చల ద్వారా సుంకాల సమస్యను పరిష్కిరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అమెరికాకు చెందిన కొన్ని ఉత్పత్తులపై ఇండియా దిగుమతి సుంకాలను తగ్గించింది.