చంద్రబాబు తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన 1995 సెప్టెంబర్-1 వతేదీని గుర్తు చేసుకుంటూ టీడీపీ సంబరాలు చేసుకుంటోందీ. ఆ పార్టీ అనుకూల మీడియాతోపాటు తటస్థ న్యూస్ ఛానెల్స్ లో కూడా ప్రత్యేక కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో సాక్షి కూడా చంద్రబాబుకి ఊహించని ప్రచారాన్ని కల్పించింది. ఎన్టీఆర్ ని బాధితుడిగా చూపిస్తూ, చంద్రబాబుని దోషిగా చూపించాలనే ప్రయత్నంలో వరుస కథనాలిచ్చింది. అయితే సాక్షి మీడియా తెలుగుదేశం పార్టీని ఆకాశానికెత్తేయడం, ఎన్టీఆర్ పాలనను గొప్పగా చూపించడం ఇక్కడ విశేషం. మొత్తమ్మీద చంద్రబాబుపై కోపంతో టీడీపీకి ఊహించని పాజిటవ్ వైబ్ ఇచ్చింది సాక్షి.
టార్గెట్ బాబు..
వైసీపీ సొంత మీడియా సాక్షికి జగన్ భజనతోపాటు చంద్రబాబుపై వ్యతిరేక వార్తలు రాయడం కూడా దినచర్యలో భాగమే. అయితే ఈ క్రమంలో సాక్షి జగన్ కంటే ఎక్కువ వార్తలు చంద్రబాబుపైనే ఇవ్వడం ఇక్కడ విశేషం. దాదాపుగా సాక్షి మాత్రమే ఫాలో అయ్యే వారికి ఈరోజుకి చంద్రబాబుకి మధ్య ఉన్న రిలేషన్ పెద్దగా తెలియకపోవచ్చు. ముఖ్యమంత్రి పదవిని తొలిసారిగా చంద్రబాబు చేపట్టింది సెప్టెంబర్-1 వ తేదీనే. అయితే ఈ ఏడాదికి మరింత ప్రత్యేకత ఉంది. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయి నేటికి 30 ఏళ్లు. అందుకే టీడీపీ ఆ స్థాయిలో సంబరాలు చేసుకుంటోంది. మరి సాక్షి సైలెంట్ గా ఉంటుందా..? అందుకే వ్యతిరేక కథనాలు వండి వార్చింది. కానీ ఆ ప్లాన్ వర్కవుట్ కాలేదు సరికదా, టీడీపీకి మరింత మైలేజ్ పెంచాలా ఆ వార్తలు ఉండటం గమనార్హం.
అనుకోని హైప్..
ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పార్టీ పగ్గాలు, ప్రభుత్వ పగ్గాలు తీసుకోవడం గురించి చాన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. అప్పటి పరిస్థితులేంటి? ఎలాంటి సందర్భంలో తాను సీఎంగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చిందో చంద్రబాబు కూడా వివరణ ఇచ్చుకున్నారు. ఒకవేళ చంద్రబాబు నిర్ణయం తప్పే అయితే ఆయనకు అంతమంది మద్దతు ఎందుకిస్తారు. పోనీ చంద్రబాబు అప్పట్లో తప్పుడు నిర్ణయం తీసుకుని ఉంటే ఇన్నాళ్లు ఆయన రాజకీయం ఎలా చేసేవారు, ఇప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఎలా ఉండేవారు..? అయినా కూడా సాక్షి చంద్రబాబుని విలన్ గా చిత్రీకరించాలని చూస్తోంది. అదే సమయంలో ఎన్టీఆర్ ని హీరోగా ప్రొజెక్ట్ చేసింది. అంటే ఒకరకంగా తెలుగుదేశం పార్టీని సాక్షి సపోర్ట్ చేసిందనే చెప్పాలి. ఈ కథనాలిచ్చేందుకు లక్ష్మీపార్వతి పేరుని తెరపైకి తేవడం ఇక్కడ విశేషం. అప్పట్లో అంతా సాఫీగానే జరిగిపోయి ఉంటే లక్ష్మీ పార్వతి ఇప్పుడు జగన్ కోసం పనిచేసేవారా, ఆమెకు సాక్షి అంత హైప్ ఇచ్చేదా..?
ఘనంగా ఎలివేషన్..
మొత్తమ్మీద చంద్రబాబుపై కోపంతో టీడీపీని, ఎన్టీఆర్ ని హైలైట్ చేస్తూ సాక్షి కథనాలివ్వడం విశేషం. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన ఘట్టాన్ని సాక్షి గుర్తించుకుని మరీ ప్రచారం కల్పించినట్లయింది. చంద్రబాబుని విమర్శించేందుకు మొదలు పెట్టి ఆయన కెరీర్ లో మైలురాయిని ఘనంగా స్మరించుకుంది వైసీపీ మీడియా. సూపర్ సిక్స్ విషయంలో కూడా పదే పదే ప్రభుత్వంపై విమర్శలు చేయాలని చూస్తూ ఆ పథకాలకు, వాటి అమలుకి ఎక్కడలేని ప్రచారం కల్పిస్తోంది వైసీపీ మీడియా, సోషల్ మీడియా.