Simhachalam Tragedy: వాస్తు దోషం వల్లే గోడ కూలిందా..? ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా గోడ నిర్మించారా..? తరతరాలుగా వస్తున్న స్వామివారి సొరంగ మార్గాన్ని మూసేయడం వల్లే ప్రమాదం జరిగిందా? లేక ఇంజినీర్ల తప్పిదమా? అని సింహాచలం ప్రమాదం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సింహాచలం ఆలయ గోడ నిర్మాణంలో ఎన్నో తప్పిదాలు ఉన్నట్లు త్రిసభ్య కమిటీ గుర్తించింది. అయితే ఆగమాశాస్త్రం, వైదిక సూచనలు పాటించకుండా గోడ నిర్మించినట్లు అర్చకులు ఆరోపిస్తున్నారు. స్మామివారు మాడవీధుల్లో తిరిగి.. సొరంగంగుండా పుష్కరిణికి వెళ్లే మార్గాన్ని అధికారులు కూల్చేశారు. ఆ మార్గంలో మూడు నెలల క్రితం బ్రిడ్జ్ నిర్మించి, రోడ్డు వేశారు. అక్కడ కట్టిన గోడనే వర్షం కారణంగా కూలింది. మొత్తంగా అధికారుల నిర్లక్ష్యం వల్లే గోడ కూలి భక్తులు చనిపోయినట్లు కమిషన్ ప్రాథమిక నివేదికనిచ్చింది.
సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు మృతిచెందిన ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతుంది. ఈ ఘటనపై ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తును ముగించిన త్రిసభ్య కమిటీ.. శనివారం ప్రభుత్వానికి ప్రాథమిక దర్యాప్తు నివేదికను అందించనున్నారు. ఇప్పటికే ఘటనా స్థలానికి వెళ్లిన కమిటీ విచారణ జరిపింది. గోడ నిర్మాణం చేపట్టిన ఇంజినీరింగ్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించింది.
ప్రమాదానికి కారణమైన గోడను ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నోటి మాటతో కట్టేశారని తేల్చింది కమిటీ. నిర్మాణంలో నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించింది. వైదిక నియమాలను ఉల్లంఘించారని.. ఆగమశాస్త్ర సలహాలను కూడా తీసుకోలేదని దర్యాప్తులో గుర్తించింది కమిటీ. అసలు ఎవరి అనుమతితో ఈ గోడను నిర్మించారనే దానిపై ఫోకస్ చేసింది కమిటీ.
టూరిజం ఈఈ, ఆలయ ఈఈ నుంచి సరైన సమాధానాలు రావడం లేదన్నది కమిటీ మాట. నేడు ప్రాథమిక నివేదిక సమర్పించిన తర్వాత.. నెల రోజుల్లో పూర్తి దర్యాప్తు నివేదిక అందించనుంది కమిటీ. చందనోత్సవం సందర్భంగా హడావుడిగా ఐదురోజుల్లోనే గోడ నిర్మించారు. కాంక్రీటు, పిల్లర్లు వేయకుండా.. సిమెంట్ ఇటుకలతోనే గోడ నిర్మించారు. పునాదులు వేయకుండా.. సాయిల్ టెస్ట్ చేయకుండా.. గోడ నిర్మించినట్లు కమిషన్ గుర్తించింది. ప్లానింగ్, డ్రాయింగ్ లేకుండా.. చందనోత్సవం కోసం గోడ కట్టడంపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మరోవైపు.. వైసీపీ నేతలు గోడ కూలిన ప్రదేశాన్ని పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపించారు బొత్స సత్యనారాయణ. గతంలో కూడా తిరుపతిలో ఇలాంటి ఘటనే జరిగిందన్నారు.
ఐతే జనసేన వాదన మరోలా ఉంది. ఈ ప్రమాదానికి కాంట్రాక్టర్ అనంతరావే కారణమని ఆరోపిస్తోంది. ప్రసాదం స్కీం కింద కేంద్ర నుంచి కాంట్రాక్ట్ పొంది, ఏడాదిలో చేయాల్సిన పనులను రెండేళ్లుగా సాగదీస్తున్నాడని తెల్పింది. కాంట్రాక్టర్‌కు EE సహకరించడం వల్లే ఏడుగురు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. కాంట్రాక్టర్ , EEపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
Also Read: లిక్కర్ స్కామ్‌లో మరో కీ టర్న్.. జగన్ జమానాలో అసలేం జరిగింది?
విచారణ కమిటీ రేపు కూడా మరికొందరిని విచారించనుంది. 72 గంటల్లో ప్రాథమిక రిపోర్ట్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. కమిటీ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోనుంది సర్కార్.