Amaravati 2.0: ఏపీ రాజధాని పరిస్థితి ఇది. ఐతే అదంతా గతం. ఇప్పుడు నవకశం ఆరంభమైంది. ఎట్టకేలకు అమరావతి నిర్మాణ పనులు మొదలయ్యాయి. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇది ఆంధ్రుల రాజధాని అని తలెత్తుకునేలా నిర్మిస్తామన్నారు సీఎం. మూడేళ్లల్లో పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రధాని సహకారంతో మళ్లీ పట్టాలెక్కించామని చెప్పారు.
అమరావతి సభ రైతుల్లో కొత్త ఆశలను నింపిందని భావిస్తోంది సర్కార్. రాజధాని కోసం రైతులు చేసిన త్యాగం వృథా కానివ్వబోమని తేల్చి చెప్పింది. మూడేళ్లల్లో ప్రముఖ నిర్మాణాలు పూర్తి చేయాలనే కసితో ఉంది.
దీంతో అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందుకు అనుగుణంగానే CRDA కార్యాచరణ రూపొందించింది. 2014 నుంచి 19 వరకు అమరావతి పనులు వేంగా పరుగులు పెట్టడంతో.. మెజార్టీ పనులు అప్పట్లో పూర్తయ్యాయి. 2019 నుంచి 2024 వరకు అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రాజధాని పూర్తిస్థాయిలో ఎడారిగా మారిపోవడంతో ప్రస్తుత ప్రభుత్వం పనుల పూర్తి విషయంలో సీరియస్ నిర్ణయం తీసుకుంది.
రాజధాని పనుల కోసం భారీగా నిధులు సమకూరడంతో పాటు.. గత ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిర్మాణానికి కావలసిన 64 వేల కోట్ల రూపాయలకు సంబంధించి.. 49 వేల కోట్ల రూపాయలు సమకూరాయి. దీంతో పనులు వేగవంతం చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
ఓవైపు కేంద్ర సహకారం.. మరోవైపు రాష్ట్ర ప్రజలు, రైతుల అండ ఉండటంతో.. రెట్టించ్చిన ఉత్సాహంతో పని చేయాలని.. అనుకున్న గడువు కంటే ముందే పూర్తి చేయాలని CRDA ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి.
ఇదిలా ఉంటే.. రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమాన్ని మోడీ ప్రారంభించినందుకు అమరావతి రైతులు ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్లుగా అడవిలా తయారైన రాజధానికి ఇప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కొత్త ఉత్సాహాన్ని నింపారంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కోసం గతంలో తాము పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని రాజధాని రైతులు ఆనంద పడుతున్నారు. రాజధాని నిర్మాణం పూర్తి అయితే ఇక్కడే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని రైతులు చెబుతున్నారు.
Also Read: ఆ ఇద్దరే కీలకం.. అనుమతి లేకుండానే గోడ కట్టేసారు..
జగన్ ప్రభుత్వంలో ఎన్నో లాఠీ దెబ్బలు, అక్రమ కేసులు పెట్టిన భయపడకుండా నిలబడి అమరావతిని ఏకైక రాజధానిగా నిలుపుకోగలిగామంటున్నారు. ప్రధానమంత్రి మోడీ 58 వేల కోట్ల రూపాయల పనులను ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే రాజధాని పూర్తి అవుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి ఒక నగరం కాదు, శక్తి అన్నారు ప్రధాని మోడీ. స్వర్ణాంధ్రప్రదేశ్‌కు ఇది శుభ సంకేతామని చెప్పారు. రాజధాని అభివృద్ధికి పూర్తి సపోర్ట్ ఉంటుందని భరోసా ఇచ్చారాయన. అమరావతి ఏపీ గ్రోత్ ఇంజిన్‌గా మారబోతోందన్నారు. మూడేళ్లల్లో పూర్తి చేస్తామని సీఎం చెప్పారని, ఇందుకు తన భుజం కలుపుతానని హామీ ఇచ్చారు.