సింగర్ ప్రవస్తి ఆరాధ్య. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈమె పేరు మారుమోగిపోతోంది. గతంలో మంచి సింగర్ గా ప్రవస్తి ఇంటర్వ్యూలు వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు పాడుతా తీయగా కార్యక్రమంపై ఆమె చేసిన విమర్శలు మరింత వైరల్ గా మారాయి. ఈ ఎపిసోడ్ లో వైసీపీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నిటికంటై హైలైట్ గా మారింది. అసలింతకీ ప్రవస్తి వివాదం ఏంటి..? ఆ వివాదంతో వైసీపీకి సంబంధం ఏంటి..?
జడ్జిలపై ఆరోపణలు..
ప్రవస్తి ఆరాధ్య చిన్నతనం నుంచీ మంచి సింగర్ గా పేరు తెచ్చుకున్నారు. వివిధ టీవీ షోస్ లో ఆమె పాటలు పాడేవారు. తాజాగా ఆమె ఈటీవీలో వస్తున్న పాడుతా తీయగాలో కంటెస్టెంట్ గా ఉన్నారు. టాప్ -12 నుంచి ఆమె ఇటీవలే ఎలిమినేట్ అయ్యారు. ఆ ఎలిమినేషన్ తర్వాత ఆమె సోషల్ మీడియాలో ఓ వీడియో అప్ లోడ్ చేశారు. పాడుతా తీయగా కార్యక్రమం గురించి, ప్రొడక్షన్ టీమ్ గురించి ముగ్గురు జడ్జీలు కీరవాణి, సునీత, చంద్రబోస్ గురించి ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఎలిమినేట్ అయిన తర్వాత ఆమె చేసిన ఆరోపణలకు సహజంగానే ఎవరి మద్దతూ లభించలేదు. అదే సమయంలో ఆమె చేసిన ఆరోపణల తీవ్రత మాత్రం కలచివేసేలా ఉంది. అయితే ఈ ఎపిసోడ్ లో వైసీపీ సడన్ ఎంట్రీ మాత్రం ఊహించనిదే.
టార్గెట్ ఈటీవీ..
పాడుతా తీయగా కార్యక్రమం ఈటీవీలో ప్రసారం అవుతోంది. ఈ కార్యక్రమంపై ఆరోపణలు చేయడమంటే, ఈటీవీపై కూడా ఆరోపణలు ఎక్కుపెట్టడమే. ఇక్కడే వైసీపీకి ఎంట్రీ సులభమైంది. ఈటీవీ అంటే రామోజీరావు, రామోజీరావు అంటే టీడీపీ మద్దతుదారు.. అనేట్టుగా వైసీపీ టర్న్ తీసుకుంది. ప్రవస్తికి మద్దతిస్తే ఆటోమేటిక్ గా ఈటీవీని టార్గెట్ చేసినట్టే. అందుకే వైసీపీ ఇక్కడ ఎంట్రీ ఇచ్చింది.
టార్గెట్ కీరవాణి..
ఇక కీరవాణి విషయంలో కూడా ఇటీవల వైసీపీ రగిలిపోతూ ఉంది. ఆమధ్య రామోజీరావు సంస్మరణ సభలో కీరవాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. రామోజీరావు ఏపీలో వైసీపీ ప్రభుత్వం పతనాన్ని కోరుకున్నారని, అది సాధ్యమైనా, ఆయన దాన్ని చూడలేకపోయారని అన్నారు. దీంతో ఆయన ఏవైపో క్లియర్ గా తేలిపోయింది. అప్పటినుంచి కీరవాణి వైసీపీకి శత్రువుగా మారిపోయారు. సహజంగా ఆయనపై విమర్శలు రావడంతో సాక్షి వాటికి ప్రయారిటీ పెంచింది. వైసీపీ సోషల్ మీడియాలో కూడా ప్రవస్తికి సపోర్ట్ పెరిగింది.
పాడుతా తీయగా జడ్జిలపై ( సింగర్ సునీత, కబంధహస్తాల కీరవాణి, చంద్రబోస్ ) తీవ్ర ఆరోపణలు చేసిన సింగర్ ప్రవస్తి.
టాలెంట్ ని తొక్కడానికి ప్రయత్నించారు
ఎక్సపోసింగ్ చెయ్యమన్నారు.
సింగెర్స్ తో చాకిరి చేయించుకుంటా. వెడ్డింగ్స్ లో పాటలు పాడేవాళ్ళంటే నాకు అసహ్యం, ఇవి కీరవాణి చిలకపలుకుల pic.twitter.com/fRPvOWwbpn
— Warrior YSRCP (@Vamsee007) April 21, 2025
ప్రవస్తికి ఇండస్ట్రీనుంచి మద్దతు ఉందా..?
ప్రవస్తి ఆరాధ్య విమర్శలను ఎలా రిసీవ్ చేసుకోవాలి..? జడ్జిల కామెంట్లను ఆమె మరీ పర్సనల్ గా తీసుకున్నారా..? తన ఎలిమినేషన్ ని తట్టుకోలేక విమర్శలు మొదలు పెట్టారా..? ప్రొడక్షన్ టీమ్.. బాడీషేమింగ్ కామెంట్స్ చేసినప్పుడే ఆమె ఆ షో నుంచి బయటకు ఎందుకు వచ్చేయలేదు. కనీసం జడ్జిలకు అయినా, లేదా కుటుంబ సభ్యులకైనా ఆ విషయం చెప్పారా..? ఇప్పుడు ఎలిమినేషన్ పూర్తయ్యాక ఆమె ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు..? ఇలాంటి ప్రశ్నలకు సమాధాం రావాల్సి ఉంది. ప్రస్తుతానికి మిగతా కంటెస్టెంట్ లు కానీ, ఇతర గాయకులు కానీ, సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కానీ ఎవరూ దీనిపై స్పందించలేదు. అంతమాత్రాన ప్రవస్తి ఆరోపణలను పూర్తిగా కొట్టివేయలేం. ఒక మహిళగా ఆమె హక్కుల్ని ఎవరూ కాదనలేరు. ఆమె ఆరోపణలు నిజమైతే.. ఈటీవీకి అది మాయని మచ్చ అనుకోవాల్సిందే. అయితే అనుకోకుండా వైసీపీ ఎంట్రీ ఇక్కడ అనుమానాస్పదంగా ఉంది. కేవలం ఈటీవీ, కీరవాణిని టార్గెట్ చేయడానికే దీనికి రాజకీయ రంగు పులిమారని తెలుస్తోంది. ఇక్కడ ప్రవస్తి కూడా ఈ వివాదాన్ని రాజకీయం చేయకుండా.. తనకు జరిగిన అన్యాయంపై సూటిగా పోరాటం చేస్తే ఫలితం ఉంటుంది.