AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. నిన్న చెవిరెడ్డి పీఏలు బాలాజీ, నవీన్ రిమాండ్ రిపోర్ట్‌లో మరిన్ని కీలక అంశాలు బయటపడ్డాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు పంచిన డబ్బంతా.. లిక్కర్ ముడుపులేనని సిట్ గుర్తించింది. బాలాజీ, నవీన్‌లతో పాటు మరికొందరు అనుచరులు, సిబ్బంది ఈ సొమ్మునంతా తరలించారు. చెవిరెడ్డి ఆదేశాలతో వీరంతా ఎప్పటికప్పుడు హైదరాబాద్, తాడేపల్లి నుంచి ముడుపులను.. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో వైసీపీ నాయకులకు అందించారు.
అసెంబ్లీ ఎన్నికల టైంలో విడతల వారీగా 8 నుంచి 9 కోట్ల చొప్పున దాదాపు 250 కోట్లు తరలించినట్లు సిట్ గుర్తించింది. తాడేపల్లిలోని ప్రొణయ్ ప్రకాశ్ అపార్ట్‌మెంట్ నుంచి… 8 కోట్ల నుంచి 9 కోట్ల రూపాయలు ఉన్న బాక్సులు తరలించారని రిపోర్ట్‌లో ప్రస్తావించారు. గతేడాది మార్చి 1 నుంచి మే 9 మధ్య.. 13 సార్లు నగదు ఉన్న బాక్సులు తరలించారని తేల్చారు. ఏప్రిల్ 1, 2024న కావలిలో అప్పటి MLA రాంరెడ్డి ప్రతాపరెడ్డి పీఏకి నోట్ల కట్టలున్న బాక్సులను బాలాజీ అందించినట్లు.. కాల్ డేటా రికార్డుల ఆధారంగా సిట్ సాక్ష్యాలు సేకరించింది.
Also Read: ఆన్‌లైన్ బెట్టింగ్‌కు డబ్బులివ్వలేదని.. కన్నతండ్రిని నరికిన కొడుకు
ఎన్నికల సమయంలో భారీగా నగదును నియోజకవర్గాల్లోని వాలంటీర్లకు అందించారని సిట్ పేర్కొంది. నగదు తరలించేందుకు ఏకంగా తుడా వాహనాన్ని వినియోగించారు. అప్పట్లో తుడా చైర్మన్‌గా ఉన్న మోహిత్ రెడ్డి.. పదవిని దుర్వినియోగం చేస్తూ డ్రైవర్ రామరాజుతో సొమ్ము తరలించారు. తుడా వాహనం విషయంలోనూ రికార్డులు తారుమారు చేసినట్లు తెలిపింది. వాహనం ఎప్పుడూ హైదరాబాద్ వెళ్లలేదన్నట్లుగా తుడా రికార్డుల్లో నమోదు చేశారు. వెంకటేశ్ నాయుడు నివసించే హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని క్రిషే వ్యాలీ అపార్ట్‌మెంట్స్‌కి బాలాజీ, నవీన్ పలుమార్లు వెళ్లి ముడుపుల సొత్తు తీసుకొచ్చారు. దీన్ని ఒంగోలులోని వైసీపీ నాయకులకు అందజేశారు. హైదరాబాద్‌లోని వెంకటేశ్‌నాయుడి ఇల్లు క్యాష్ కలెక్షన్ పాయింట్‌గా ఉండేది.