Wood Burning Stove Pollution Women Memory Loss Risk| బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) నిర్వహించిన కొత్త అధ్యయనం ప్రకారం.. ఇళ్లలో కట్టెల పొయ్యి నుండి వచ్చే వాయు కాలుష్యానికి గురైన మహిళలకు పురుషులతో పోలిస్తే.. మెదడు సామర్థ్యం తగ్గే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. ఈ అధ్యయనం.. ‘ది లాన్సెట్ రీజినల్ హెల్త్ సౌత్‌ఈస్ట్ ఆసియా’ జర్నల్‌లో ప్రచురితమైంది.
కర్ణాటకలోని శ్రీనివాసపుర గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నివసించే మహిళలు, వృద్ధులపై జరిపిన ఈ అధ్యయనంలో మెదడు ఎంఆర్ఐ (MRI) స్కాన్‌లను పరిశీలించారు. అయితే మహిళల మెదడుపై కాలుష్యం ఎక్కువ ప్రతికూల ప్రభావం చూపుతుందని ఫలితాల్లో తేలింది.
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ చికాగో పరిశోధకులు కూడా పాల్గొన్న ఈ పరిశోధనలో .. వెంటిలేషన్ (గాలి రాకపోక) సరిగా లేని చోట్ల సంప్రదాయ ఇంధనాలను (కట్టెలు, బొగ్గు) వంట కోసం ఉపయోగించడం వల్ల కార్బన్, నైట్రోజన్, సల్ఫర్ ఆక్సైడ్‌లు, సస్పెండెడ్ పార్టికులేట్ మ్యాటర్ వంటి వాయు కాలుష్య కారకాలు విడుదలవుతాయని తెలిసింది. ఇవి మెదడుపై వాపు, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ద్వారా ప్రభావం చూపుతాయి.
IIScలో జరుగుతున్న సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్-శ్రీనివాసపుర ఏజింగ్, న్యూరో సెనెసెన్స్, అండ్ కాగ్నిషన్ (CBR-SANSCOG) అధ్యయనంలో 45 ఏళ్లు పైబడిన 4,100 మంది పెద్దలను విశ్లేషించారు. వీరిలో సుమారు వెయ్యి మంది MRI స్కాన్‌లు చేయించుకున్నారు.
మెదడు సామర్థ్యం తగ్గడం వల్ల జ్ఞాపకశక్తి, రీజనింగ్ (అర్థవంతంగా) .. మాట్లాడే సామర్థ్యం దెబ్బతినవచ్చని.. ఇది డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధులకు దారితీయవచ్చని తెలిపారు.
“ఇంట్లో వంట చెరకు ఉపయోగించేవారికి మెదడు సామర్థ్యం తగ్గే ప్రమాదం ఎక్కువగా ఉంది. గ్రామీణ మహిళలు ఎక్కువగా ఈ కాలుష్యానికి గురవుతారు కాబట్టి వారి మెదడుపై ఎక్కువ ప్రభావం ఉంటుంది” అని అధ్యయన రచయితలు చెప్పారు.
భారతదేశంలో డిమెన్షియా రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఫలితాలు ప్రజారోగ్యానికి ముఖ్యమైనవని పరిశోధకులు చెప్పారు. వంట చెరకు ద్వారా కలిగే వాయు కాలుష్యం డిమెన్షియా ప్రమాదాన్ని ఎలా పెంచుతుందో ఈ అధ్యయనం వెల్లడిస్తుంది.
“శుభ్రమైన వంట ఇంధనాలను ప్రోత్సహించే విధానాలు అవసరం” అని వారు సూచించారు. ఈ ఫలితాలు గత అధ్యయనాలను ధృవీకరిస్తూ, కాలుష్య ఇంధనాలను ఉపయోగించేవారిలో మెదడు సామర్థ్యం, దృశ్య సమాచార ప్రాసెసింగ్ సామర్థ్యం తగ్గుతాయని చూపాయి.
మహిళల MRI స్కాన్‌లలో హిప్పోకాంపస్ భాగంలో తక్కువ వాల్యూమ్ కనుగొనబడింది. ఈ భాగం జ్ఞాపకశక్తికి కీలకమైనది మరియు అల్జీమర్స్ వ్యాధిలో ఎక్కువగా దెబ్బతింటుంది.
కాలుష్య వంట ఇంధనాలు మెదడు సామర్థ్యాన్ని ఎలా తగ్గిస్తాయో ఈ అధ్యయనం వివరిస్తుంది.
“గ్రామీణ భారతీయులలో ఆరోగ్య సామర్థ్యాన్ని పెంచేందుకు, శుభ్రమైన వంట ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహించే సామాజిక కార్యక్రమాలు డిమెన్షియా ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి” అని రచయితలు వెల్లడించారు.
Also Read: ఎద్దులకు బదులు స్వయంగా పొలం దున్నుతున్న 75 ఏళ్ల రైతు..
గ్రామీణ జనాభాలో మెదడు నిర్మాణంపై గృహ వాయు కాలుష్యం యొక్క ప్రతికూల ప్రభావాన్ని MRI స్కానింగ్ టెక్నిక్‌లతో పరిశీలించిన ఏకైక అధ్యయనం ఇదేనని వారు తెలిపారు.