SIT Team Report Reports Ready: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రోజు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనపై సిట్ రిపోర్టును సిద్ధం చేసి.. దానిని డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు అందజేసింది. సిట్ రిపోర్టు ఏ విధంగా ఉంది? ఇంకా అధికారులపై వేటు వస్తారా? పార్టీల అభ్యర్థులున్నారా? కౌంటింగ్ తర్వాత బలగాలు అవసరమా? ఇలాంటి అంశాలపై కూలంకుషంగా రిపోర్టు రెడీ చేసింది సిట్. సమయం ప్రకారం ఇప్పటికే రిపోర్టు ఇవ్వాల్సి ఉండగా, ఆదివారం రాత్రి 11 గంటల వరకు బాధితులతో మాట్లాడడంతో నివేదిక ఆలస్యమైనట్టు తెలుస్తోంది.
సోమవారం ఉదయం డీజీపీ కార్యాలయానికి చేరుకున్న సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్ మధ్యాహ్నం తర్వాత రిపోర్టును హరీష్ కుమార్ గుప్తాకు అందజేశారు. ఆ నివేదికను ఆయన కేంద్ర ఎన్నికల అధికారులకు పంపించనున్నారు. ఈ రిపోర్టు ఆధారంగా ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తారా..? నివేదిక ఆధారంగా అధికారులు, నేతలపై చర్యలు చేపడతారా అనేది ఆసక్తికరంగా మారింది. పల్నాడు జిల్లాలోని మాచర్ల, నరసరావుపేట, గురజాల ప్రాంతాల్లోని మారణాయుధాలు, నాటు బాంబు కనిపించడం కలకలం రేపింది. తిరుపతిలోని టీడీపీ అభ్యర్థి నానిపై దాడి, తాడిపత్రిలో జరిగిన దాడులు గురించి టోటల్‌గా 33 ఘటనలపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను పరిశీలించారు.
33 ఘటనలపై ప్రత్యేకంగా సిట్ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. స్థానిక పోలీసులు చేర్చిన అంశాలు, కొన్ని సెక్షన్లు మినహాయింపుపై ఆరా తీశారు. ఘటనలు జరగడానికి బాధ్యులు ఎవరు? అధికారులు ఏ విధంగా వ్యవహరించారు? ఏ నేతలకు అనుగుణంగా వ్యవహరించారు..? అనేదానిపై ఫోకస్ చేశారు. సాయంత్రం దీనిపై మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చే అవకాశముందని అధికారుల నుంచి వినబడుతున్నమాట. జూన్ నాలుగు తర్వాత హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందా అనేది కూడా రిపోర్టులో ప్రస్తావించనున్నారు.
మరోవైపు సిట్ రిపోర్టు రెడీ అయిన నేపథ్యంలో.. అధికార వైసీపీ- విపక్ష టీడీపీ మధ్య మాటలయుద్ధం మొదలైంది. తన వల్ల ఎలాంటి హింస జరగలేదని కుండబద్దలు కొట్టారు నరసారావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు. తాము రాసిన లేఖను పరిశీలించాలని సిట్‌ను కోరుతున్నట్లు చెప్పారు. అంతేకాదు కాల్ డేటాను పరిశీలించాలని దర్యాప్తు సంస్థను అడుగుతున్నట్లు సోమవారం ఉదయం మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. ఎంపీగా ఉండి తామే ఈ ఘటనలు చేశామన్న ఆరోపణలు ముమ్మాటికీ అసత్యమన్నారు. ఈ విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. జనంతో కలిసి తిరుగుతున్న తనపై ఇలాంటి ప్రచారం తగదన్నారు. ఒకే కులం, వర్గానికి తనను పరిమితం చేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు లావు. తాను ప్రభావితం చేసుంటే ఛార్జిషీటులో చేర్చినా ఇబ్బంది లేదన్నారు.
Also Read: ఏపీలో హింసాత్మక సంఘటనలపై సిట్ ఏర్పాటు..!
తిరుపతిలో దాడి జరిగిన గురించి చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిని సిట్ అధికారులు విచారించారు. ఘటన జరిగిన విధానాన్ని నివేదిక రూపంలో ఇచ్చామన్నారు. అలాగే మా వద్దనున్న ఆధారాలనూ అందజేశామన్నారు. తనను సుత్తితో కొట్టిన దృశ్యాలు ఉన్నాయని, అలాగే డాక్టర్ ఇచ్చిన రిపోర్టు కూడా ఉందన్నారు. సిట్ అధికారులు అడిగిన అన్నింటికీ సమాధానం చెప్పామన్నారు. ఈ ఘటన వెనుక ఎవరన్నది లోతుగా విచారణ చేయాలని కోరినట్టు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధంలేని కొంత మందిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని సిట్ దృష్టికి తెచ్చామన్నారు. మొత్తానికి సిట్ నివేదిక ఏ విధంగా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.